ర‌మ్య‌కృష్ణ, అజిత్ టార్గెట్‌గా బాంబ్ బెదిరింపులు

ఇంతకుముందు ద‌ళ‌ప‌తి విజయ్, త్రిష, నయనతార నివాసానికి బెదిరింపులు ఎదురయ్యాయి.;

Update: 2025-11-12 04:50 GMT

వ‌రుస‌గా సెల‌బ్రిటీల ఇళ్ల‌కు బాంబ్ బెదిరింపులు ఎదుర‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా చెన్నై బేస్డ్ గా నివ‌శిస్తున్న ప‌లువురు సినీప్ర‌ముఖుల‌తో పాటు, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖుల‌కు బెదిరింపులు ఎదుర‌వుతుండ‌డం పోలీసుల‌ను ప‌రుగులు పెట్టిస్తోంది. ఇంత‌కుముందు త‌మిళనాడు సీఎం స్టాలిన్, గ‌వ‌ర్న‌ర్ కి కూడా బెదిరింపులు రావ‌డంతో డాగ్ స్క్వాడ్స్ తో బాంబ్ గుర్తింపు, నిర్వీర్య ద‌ళాలు త‌నిఖీలు నిర్వ‌హించాయి.

ఇంతకుముందు ద‌ళ‌ప‌తి విజయ్, త్రిష, నయనతార నివాసానికి బెదిరింపులు ఎదురయ్యాయి. వారి ఇళ్ల‌లో బాంబులు అమ‌ర్చామ‌ని ఏదో ఒక స‌మ‌యంలో పేల్చేస్తామ‌ని బెదిరింపు మెయిల్స్, కాల్స్ రావ‌డంతో ఒక‌టే టెన్ష‌న్ అలుముకుంది. గత కొన్ని వారాలుగా తమిళ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావ‌డం పోలీస్ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది.

తాజాగా త‌ళా అజిత్ కుమార్ , సీనియ‌ర్ న‌టి రమ్య కృష్ణన్ కి ఇలాంటి బెదిరింపులు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ బెదిరింపుల అనంత‌రం సమగ్ర దర్యాప్తు తర్వాత పోలీసులు ఎటువంటి పేలుడు పదార్థాలను వారి ఇళ్ల‌లో క‌నుగొన‌లేదని ప్రకటించారు. త‌మ‌కు ఫేక్ కాల్స్ వ‌చ్చాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. త‌ళా అజిత్ కి చెన్నై లో రెండు ఇళ్లు ఉన్నాయి. ఇక రమ్య కృష్ణన్ ఇల్లు చెన్నై శివార్లలో ఉంది. అయితే బాంబ్ బెదిరింపులు రావడంతో ఈ ఇళ్ల‌ను బాంబ్ నిర్వీర్య అధికారులు త‌నిఖీలు చేసారు. ఆ త‌ర్వాత త‌మ‌కు వ‌చ్చిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఫేక్ అని పోలీసులు ప్ర‌క‌టించారు.

ఇంత‌కుముందు డిజిపి స్థాయి అధికారిక బాంబ్ బెదిరింపు వ‌చ్చింది. ఎక్కట్టుతంగల్ ప్రాంతంలోని నివ‌శిస్తున్న నటుడు అరుణ్ విజయ్ ఇంట్లో బాంబు అమర్చినట్లు ఒక వ్య‌క్తి మెయిల్ పంపాడు. అయితే విజ‌య్ ఇంటిని స్క్వాడ్ , పోలీసుల క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎటువంటి పేలుడు ప‌దార్థాలు లేవ‌ని నిర్ధారించారు. సినీ తారలతో పాటు, గవర్నర్ ఆర్ ఎన్ రవి, సిఎం స్టాలిన్ నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావ‌డంతో బిడిడిఎస్ ద‌ళాలు ఇప్పుడు చెన్నైలో మోహ‌రించాయి. అయితే వర‌స బెదిరింపుల అనంత‌రం త‌నిఖీల్లో ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అనుమానాస్ప‌ద పేలుడు ప‌దార్థాల‌ను క‌నుగొన‌లేదు.

అయితే ఈ వ‌ర‌స బెదిరింపుల‌ను ప‌రిశీలిస్తుంటే, సెల‌బ్రిటీల‌కు ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఓవైపు బార్డ‌ర్ తీవ్ర‌వాదం ముదురుతుంటే, దిల్లీ బ్లాస్టుల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న ప‌రాకాష్ఠ‌కు చేరుకోగా, ఇప్పుడు చెన్నై లో వ‌రుస‌గా సెల‌బ్రిటీల‌కు థ్రెట్ కాల్స్ ఎదుర‌వ్వ‌డం మ‌రింత ఆందోళ‌న‌ల‌కు దారి తీస్తోంది. తాజాగా త‌ళా అజిత్, సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ‌కు బెదిరింపులు రావ‌డంతో మరోసారి బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వ‌హించాయి. ఇవ‌న్నీ ఫేక్ కాల్స్ గా నిర్ధారించాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న `పోలీస్ స్టేషన్ మే భూత్` చిత్రంలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. త‌ళా అజిత్ ఓవైపు ఫార్ములా వ‌న్ రేసింగుల్లో పాల్గొంటూనే త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ బాంబ్ బెదిరింపులు వ‌చ్చినా కానీ ఏవీ నిరూప‌ణ కాలేదు. దీంతో ఇవ‌న్నీ ఆక‌తాయిల బెదిరింపులు అని కొంద‌రు కొట్టి పారేస్తున్నారు. అయితే ఇలాంటి కాల్స్, మెయిల్స్ ఉద్ధేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా రాజ‌కీయ నాయ‌కులు, గూండాలు చేస్తున్న ప‌నేనా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. దిల్లీ బ్లాస్టుల త‌ర్వాత‌ దాయాది దేశ తీవ్రవాదులు లేదా సంఘ విద్రోహ శ‌క్తుల ప్ర‌మేయం ఏదైనా ఉందా? అన్న‌ది కూడా పోలీసులు విచార‌ణ‌లో నిగ్గు తేల్చాల్సి ఉంది.

Tags:    

Similar News