బ్రేకింగ్ : మన 'మైత్రి' పై ఇళయరాజా గెలుపు!
తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్‌లో స్టార్ హీరో అజిత్‌తో నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా మేకింగ్ స మయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.;
తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్‌లో స్టార్ హీరో అజిత్‌తో నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా మేకింగ్ స మయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. పలు విషయాలు సినిమాకు అడ్డంకిగా మారాయి. అజిత్ తోడ్పాటు, మైత్రి మూవీ మేకర్స్ వారి పట్టుదల కారణంగా సినిమా పూర్తి అయ్యి విడుదల కాగలిగింది. మరో హీరో లేదా మరో నిర్మాణ సంస్థ అయితే ఖచ్చితంగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇప్పటికీ విడుదల కాక పోయేది అనేది తమిళ సినీ వర్గాల టాక్. ఆ విషయం పక్కన పెడితే సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా సినిమా యొక్క పాటల విషయంలో వివాదం చాలా పెద్దది అయింది. సినిమాలో చాలా పాత పాటలను వినియోగించడం జరిగింది. ఇళయరాజా స్వరపరిచిన పాటలను సినిమాలో వినియోగించడం అసలు వివాదం కు కారణం.
నెట్ ఫ్లిక్స్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్..
ఏప్రిల్ 10న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా విషయంలో ఇళయరాజా చాలా సీరియస్‌గా విమర్శలు చేశాడు. తన అనుమతి లేకుండా తన మ్యూజిక్ ను ఎలా వినియోగిస్తారు అంటూ కాపీ రైట్ చట్ట ప్రకారం వెళ్తాను అంటూ నిర్మాతలను హెచ్చరించాడు. చట్టపరమైన చర్యలకు వెళ్లకుండా ఉండాలి అంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడనే పుకార్లు వినిపించాయి. ఆ విషయమై ఇరు వర్గాల నుంచి క్లారిటీ లేదు. సినిమా నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు అయింది. మే 8 నుంచి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది. అప్పటి నుంచి మరింత ఈ గొడవ ముదురుతూ వచ్చింది. సినిమాలో తన పాటలను వినియోగించారు అంటూ ఇళయరాజా ఏకంగా మద్రాస్ హై కోర్ట్‌ను ఆశ్రయించారు. కోర్టు సుదీర్ఘ విచారణల తర్వాత ప్రస్తుతానికి ఏ ప్లాట్ ఫామ్‌లోనూ సినిమాను ప్రదర్శించవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది.
అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీకి బ్యాడ్ న్యూస్
నిర్మాతలు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వినియోగించిన పాటలకు అనుమతి తీసుకున్నట్లు కోర్టులో చెప్పినా, అందుకు సంబంధించి సరైన అనుమతి పత్రాలను కోర్ట్ కి సమర్పించలేక పోయారు. దాంతో కోర్ట్ సినిమాలోని ఆ పాటలను తొలగించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు సినిమాను అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ స్ట్రీమింగ్ ఆపేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే సినిమాను తొలగించింది. సినిమా టైటిల్‌ను సెర్చ్ చేస్తే మీ దేశంలో ఈ సినిమా అందుబాటులో లేదు అన్నట్లుగా మెసేజ్‌ను చూపిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు వెంటనే నెట్‌ఫ్లిక్స్ వారు సినిమా స్ట్రీమింగ్ ఆపేశారు. ఇది నిర్మాతలు మైత్రి మూవీ వారికి కూడా చాలా పెద్ద దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వారితో మైత్రి మూవీ వారు చేసుకున్న ఒప్పందం ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడ్డట్టు అవుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ వర్సెస్ ఇళయరాజా
ఇళయరాజా గతంలోనూ ఇలాంటి కాపీరైట్ న్యాయ పోరాటాలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కనుక ఆయన కంటెంట్ విషయంలో పూర్తి అధికారం ఆయనకే ఉంటుంది. కనుక సినిమాల నిర్మాతల నుంచి తీసుకున్న సాంగ్స్ ఖచ్చితంగా ఆయన అనుమతి తీసుకోవాలి అనేది కొందరి వాదన. కొందరు మాత్రం ఇళయరాజా తీరును తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి చూసి చూడనట్లుగా ఉండాలి. కానీ ఆయన మాత్రం ఇలా కాపీ రైట్ అంటూ కోర్ట్ కు ఎక్కడం ఎంత వరకు కరెక్ట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది చూడాలి. ఇళయరాజా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలోనూ ఆయన ఇలాంటి కోర్ట్ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కనుక మైత్రి వారు ఈ విషయంలో ముందు ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.