వంద కోట్ల వైబ్రేషన్.. మంగళవారం 2 పై అజయ్ భూపతి మైండ్ గేమ్!
ఒక సినిమా ప్రమోషన్స్ లో ఉంటూనే, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద ఆడియన్స్ కి గట్టి హింట్ ఇవ్వడం కొందరు దర్శకులకు అలవాటే.
ఒక సినిమా ప్రమోషన్స్ లో ఉంటూనే, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద ఆడియన్స్ కి గట్టి హింట్ ఇవ్వడం కొందరు దర్శకులకు అలవాటే. ఇప్పుడు డైరెక్టర్ అజయ్ భూపతి కూడా సరిగ్గా ఇదే ట్రాక్ లో వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన యంగ్ హీరో జయకృష్ణతో చేసిన 'శ్రీనివాస మంగాపురం' సినిమా జూలై 30న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే మాటల మధ్యలో తన బ్లాక్ బస్టర్ హిట్ 'మంగళవారం' పార్ట్ 2 గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
మంగళవారం సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సక్సెస్ ని కేవలం డబ్బుతో మాత్రమే కొలవకూడదని అజయ్ అంటున్నాడు. ఒక సినిమా క్రియేట్ చేసే వైబ్రేషన్ ఇక్కడ ముఖ్యమని, మంగళవారం పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వంద కోట్ల సినిమాతో సమానం అని తన కాన్ఫిడెన్స్ ని బయటపెట్టాడు. ఒకవేళ తనే వంద కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే, అది ఐదొందల కోట్ల రేంజ్ లో ఫీల్ ఇస్తుందని చెప్పరు.
ఇక మంగళవారం 2 ప్రాజెక్ట్ అయితే మామూలు స్కేల్ లో ఉండదని క్లారిటీ ఇచ్చేశాడు. పార్ట్ 1 ఒక మోస్తరు బడ్జెట్ తో డార్క్ థ్రిల్లర్ గా వస్తే, దానికి సీక్వెల్ గా వచ్చే పార్ట్ 2 మాత్రం పక్కా కమర్షియల్ హంగులతో పాన్ ఇండియా లెవల్ లో రాబోతోందని హింట్ ఇచ్చాడు. నెక్స్ట్ లెవల్ లో ఈ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పడం చూస్తుంటే, అజయ్ ఆలోచనలు చాలా పెద్ద టార్గెట్ నే సెట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో హైలైట్ అయిన మరో పాయింట్ ఇంటర్వెల్ ఎపిసోడ్. మంగళవారం 2 లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకేసారి ఐదు వేర్వేరు చోట్ల జరుగుతుందని అజయ్ రివీల్ చేశాడు. సాధారణంగా ఒకే లొకేషన్ లో ఇంటర్వెల్ బ్లాక్ డిజైన్ చేయడమే కష్టం, అలాంటిది ఐదు చోట్ల ప్యారలల్ గా రన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు అంటే స్క్రీన్ ప్లే ఎంత కాంప్లెక్స్ గా ఉండబోతోందో ఊహించుకోవచ్చు.
రాత్రి పూట బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్నప్పుడు కూడా తన బుర్రలో మంగళవారం 2 ఇంటర్వెల్ సీన్స్ మాత్రమే తిరుగుతున్నాయని చెప్పాడు. అయితే ఇలా ముందే హైప్ పెంచేయడం వల్ల జనాల్లో అంచనాలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ప్రస్తుతం అజయ్ భూపతి దృష్టంతా శ్రీనివాస మంగాపురం మీదే ఉంది. జూలై 30న రాబోయే ఈ సినిమా రిజల్ట్ ఆయన తదుపరి అడుగులకు చాలా కీలకం. ఈ గ్యాప్ లో మంగళవారం 2 మీద ఇలాంటి సాలిడ్ అప్డేట్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్ అటెన్షన్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆయన ఊహించుకుంటున్న ఆ వంద కోట్ల స్కేల్, ఐదు చోట్ల జరిగే ఇంటర్వెల్ బ్లాక్ స్క్రీన్ మీద ఎలాంటి మేజిక్ చేస్తాయో చూడాలంటే సీక్వెల్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.