AI తో క్లైమాక్సే మార్చేశారుగా.. చనిపోయినోడిని మళ్లీ తీసుకొచ్చారు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో 2013లో రంఝానా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రశంసలే కాదు, కలెక్షన్లు కూడా వచ్చాయి.;

Update: 2025-08-01 18:22 GMT

సినిమా రంగంలోనూ ఏఐ వాడకం రోజురోజుకూ పెరిగిపోతుంది. కృతిమ మేధ ఉపయోగించి మేకర్స్ సినిమాల్లో వండర్స్ క్రియేట్ చేస్తన్నారు. విజయ్ దళపతి గోట్ (ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం) సినిమాలో హీరో దివంగత విజయ్ కాంత్ ను ఏఐ ద్వారా సృష్టించి క్యామియో చేయించడం సాంకేతికత వింతే. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు కంచెలు తెంచుకొని ముందుకెళ్తోంది. ఇధి కొత్తగా తెరకెక్కించే సినిమాల్లోనే కాదు, రీ రిలీజ్ చిత్రాల్లోనూ ఏఐని వాడి ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో 2013లో రంఝానా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రశంసలే కాదు, కలెక్షన్లు కూడా వచ్చాయి. కెరీర్ పరంగా ధనుష్ కు బాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చిన తొలి సినిమా ఇదే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో ఇది క్లాసిక్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను అంబికాపతిగా తమిళంలో డబ్ చేశారు.

అలా ధనుష్ కెరీర్ లో మంచి విజయం సాధించిన ఈ సినిమాను మేకర్స్ తాజాగా రీ రిలీజ్ చేశారు. అయితే అందరి లాగే ఉన్న కంటెంట్ ను రీ రిలీజ్ చేస్తే కిక్ ఏముంటుందని మేకర్స్ అనుకున్నారమో. అందుకే ఒరిజినల్ సినిమాతో పోలీస్తే రీ రిలీజ్ లో క్లైమాక్స్ లో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్ లో ధనుష్ పాత్ర చనిపోతుంది.

ఆసుపత్రిలో తుది శ్వాస వీడగా, ఇంకో జన్మలో మళ్ళీ చిన్న పిల్లాడిగా పుట్టినట్టు చూపించి సినిమా ఎండ్ చేశారు. కానీ తాజా రీ రిలీజ్ క్లైమాక్స్ లో ధనుష్ కళ్లు తెరిచి బ్రతికేశాడు. ఏఐ సాంకేతికతను వాడి ఏకంగా క్లైమాక్స్ ను మార్చేశారు. ఇలా ఊహించని సర్ప్రైజ్ కు అభిమానులు థియేటర్ లో షాక్ తిన్నారు. ఈ మాదిరి ట్విస్టు ఎప్పుడూ చూడలేదంటూ గోలలు, ఈలలు చప్పట్లతో సినిమా థియేటర్లలను హోరెత్తిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ టెక్నిక్ వర్కౌట్ అయితే వేరే మూవీమేకర్స్ కూడా చనిపోయిన పాత్రలను బతికిస్తాయో చూడాలి. తెలుగులో అయితే హిట్ అయిన క్లైమాక్స్ లో మెయిన్ రోల్స్ చనిపోయిన సినిమాలు అనేకం ఉన్నాయి. అసలు ఆ సినిమాలు ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచేందుకు కారణం ఆ ప్రాణ త్యాగాలే. అందుకే టెక్నాలజీతో ఇలాంటి మార్పులు చేస్తే అన్నిసార్లు వర్కౌట్ అవ్వదని సినీప్రియుల అభిప్రాయం.

అప్పటి సినిమాల్లో క్లైమాక్స్ లో చనిపోయిన పాత్రలు బ్రతికిస్తే ఇప్పటి జనరేషన్ కు ఆ పాత్రలో ఉన్న మ్యాజిక్ అర్థం కాదు. అలాగే ఆ సినిమా ప్రభావం కూడా పడిపోతుంది. తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాల్లో చనిపోయిన అక్కినేని నాగేశ్వర రావుని ఇప్పుడు బ్రతికిస్తే సినిమా ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి ప్రయోగాలకు రంఝానా సినిమాతో స్వస్తి చెప్పేస్తే బాగుంటుంది.

Tags:    

Similar News