హీరో మహిళా మేనేజర్ మృతి..మాజీ సీఎం కుమారుడికి ఐదేళ్లకు క్లీన్‌చిట్
దిశా మృతి కేసులో ఆదిత్యకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని కోర్టు పేర్కొంది.;

దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన హీరో మహిళా మేనేజర్ ఆత్మహత్య కేసులో మాజీ సీఎం కుమారుడు, మాజీ మంత్రి అయిన నాయకుడికి ఎట్టకేలకు క్లీన్ చిట్ దక్కింది. ఐదేళ్లపాటు మలుపులు, ఆరోపణలతో సాగిన ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. మొత్తానికి అత్యంత వివాదాస్పద కేసు ముగిసింది. కానీ, అసలు న్యాయం జరిగిందా...? అంటే చెప్పలేని పరిస్థితి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గుర్తున్నడా..? టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర సినిమాలో ధోనీ పాత్రలో జీవించి యావత్ భారత దేశాన్ని ఆకట్టకున్నాడు.
నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చనే వ్యక్తిత్వానికి నిదర్శనమైన ధోనీ జీవిత చరిత్రలో హీరోగా నటించిన హీరో చివరకు ఆత్మహత్యకు పాల్పడడం విధి వైచిత్రి. దేశమంతా కోవిడ్ కల్లోలంలో ఉండగా.. 2020 జూన్‌లో అంటే సరిగ్గా ఐదేళ్ల కిందట సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, దీనికిముందే అతడి మేనేజర్ దిశా సాలియాన్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో ఏదో జరిగిందని.. పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. మరీ ముఖ్యంగా అప్పటి మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రిగానూ ఉన్న ఆదిత్య థాక్రే పైన ఆరోపణలు వచ్చాయి. సాలియన్ ఆత‍్మహత్య కేసులో ఇప్పుడు ఆదిత్యకు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
దిశా మృతి కేసులో ఆదిత్యకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని కోర్టు పేర్కొంది. ఆదిత్యపై ఉన్న కేసు విచారణను ముగించింది. దిశా 2020 జూన్ 8న ఆత్మహత్య అనే రీతిలో చనిపోయింది. ముంబై మలాడ్‌లోని అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా తీవ్ర చర్చనీయాంశమైంది. బలమైన వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రేగాయి.
ఆదిత్యకు క్లీన్‌చిట్ వచ్చినా.. కేసు దర్యాప్తుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణలో వాస్తవాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నరా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తూ.. దిశ తండ్రి.. ఆదిత్య థాక్రే, డినో మారియాలపై ఫిర్యాదు చేసినట్లు ఇటీవల మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీష్ రాణే వ్యాఖ్యానించారు. కేసు ఇంకా ముగియలేదని, తుది తీర్పునకు ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొంటున్నారు. గతంలో రాణే.. దిశ-సుశాంత్ మధ్య ఏం జరిగిందో అనేదాని గురించి కీలక ఆధారల పెన్ డ్రైవ్ తనవద్ద ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు అది ఏమైందని ప్రజలు అడుగుతున్నారు. దర్యాప్తు అధికారులకు ఇవ్వలేదేమని ప్రశ్నిస్తున్నారు. శక్తిమంతులైన వ్యక్తులు తప్పించుకున్నారని, నిజం బయటకు రాలేదని చాలామంది భావిస్తున్నారు.