'క్రెడిట్స్' కొట్టేసే దొంగ‌ల గుట్టు బ‌య‌ట‌పెట్టిన వెట‌ర‌న్ డైరెక్ట‌ర్

సినిమా రంగంలో ఒక‌రి గుర్తింపును ఇంకొక‌రు అణ‌గదొక్క‌డం లేదా వాడుకుని వ‌దిలేయ‌డంపై చాలా చ‌ర్చ జ‌రుగుతుంది.;

Update: 2026-01-12 00:30 GMT

సినిమా రంగంలో ఒక‌రి గుర్తింపును ఇంకొక‌రు అణ‌గదొక్క‌డం లేదా వాడుకుని వ‌దిలేయ‌డంపై చాలా చ‌ర్చ జ‌రుగుతుంది. ముఖ్యంగా ఔత్సాహిక ర‌చ‌యిత‌లు చాలా మంది ఘోస్ట్ ర‌చ‌యిత‌లుగా ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేసినా స‌రైన గుర్తింపు ద‌క్క‌క అలాగే ఉండిపోతారు. కొంద‌రు జీవితాంతం ఘోస్టులుగానే మిగిలిపోయిన వాళ్లున్నారు. సీనియ‌ర్లు జూనియ‌ర్ల‌కు గుర్తింపును ఎప్ప‌టికీ ఇవ్వ‌రు. అయితే చాలా అరుదుగా కొంద‌రు మాత్ర‌మే ఘోస్టుల ద‌శ నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డి ద‌ర్శ‌కులుగా మారి స‌త్తా చాటారు. కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్, అనీల్ రావిపూడి, బాబి, హ‌రీష్ శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కులు ఒక‌ప్పుడు ఘోస్ట్ రైట‌ర్లుగా ప‌ని చేసిన‌వాళ్లే. వీరంతా ఆ త‌ర్వాత ద‌ర్శ‌కులుగా స‌త్తా చాటారు. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌తో సినిమాలు తీస్తూ నేడు టాలీవుడ్ లో అగ్ర ద‌ర్శ‌కులుగా కొన‌సాగుతున్నారు.

ఇప్పుడు `దురంధ‌ర్` చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్ ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నాలు సృష్టించిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ కూడా ఈ కేట‌గిరీకే చెందుతాడు. ఊరి- ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఆదిత్యాధ‌ర్ అంత‌కుముందు ఘోస్ట్ రైట‌ర్ గా కొన్నేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో న‌లిగిపోయాడు. అత‌డిని సీనియ‌ర్లు వాడుకుని వ‌దిలేసారు త‌ప్ప‌ ఎక్క‌డా `క్రెడిట్స్` ఇవ్వ‌లేదు. టైటిల్స్ లో అత‌డి పేరు క‌నీస‌మాత్రంగా అయినా వేయించ‌లేదు. అయితే త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి అత‌డు క‌సిగా ఎదిగి చూపించాడు. అంది వ‌చ్చిన ఒకే ఒక్క అవ‌కాశాన్ని అత‌డు జార‌విడుచుకోకుండా స‌ద్వినియోగం చేసుకున్నాడు.

దీనిపై ఇటీవ‌ల ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ దర్శకుడు ఆదిత్య ధర్ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను, `క్రెడిట్` దక్కని వైనాన్ని సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ప్రియ‌ద‌ర్శ‌న్ వివ‌రించారు. ఆదిత్య ధర్ దర్శకుడు కాకముందు చాలా ఏళ్ల పాటు ప‌లు ప్రాజెక్టుల కోసం లోతైన పరిశోధన చేసేవారని ప్రియదర్శన్ తెలిపారు. అయితే ఆదిత్య కష్టపడి సేకరించిన సమాచారాన్ని, ఆయన సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ఐడియాలను ఇతర సీనియర్ దర్శకులు వాడుకున్నారని, కానీ అతనికి ఇవ్వాల్సిన `క్రెడిట్` (గుర్తింపు) మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిత్య ఒక అద్భుతమైన టెక్నీషియన్. గతంలో ఆయన పడ్డ కష్టానికి, కోల్పోయిన గుర్తింపుకు `ధురందర్` స‌రైన స‌మాధానం అని కూడా ప్రియదర్శన్ పేర్కొన్నారు. గతంలో తన ఐడియాలను ఇతరులు వాడుకున్నా కుంగిపోకుండా ఆదిత్య ధర్ `యూరి- ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్`తో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.

ప్రియదర్శన్ వ్యాఖ్యల త‌ర్వాత‌ ఆదిత్య ధర్ పై నెటిజనుల‌లో సానుభూతి వెల్లువెత్తింది. పెద్ద దర్శకులు యువ ప్రతిభను ఎలా వాడుకుంటారనే దానిపై మరోసారి చర్చ మొదలైంది. ఔత్సాహిక ర‌చ‌యిత‌లు లేదా యువ‌ద‌ర్శ‌కుల ప్ర‌తిభ‌ను వాడుకున్నా కానీ, వారికి త‌గిన గుర్తింపును ఇవ్వ‌డం ద్వారా గొప్ప సినిమాలు పుడ‌తాయ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఆదిత్యా ధ‌ర్ ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ హిట్ సాధించినా, దురంధ‌ర్ చిత్రానికి ప‌ని చేసిన టెక్నీషియ‌న్లు, ర‌చ‌యిత‌లు, న‌టీన‌టులు అంద‌రికీ క్రెడిట్స్ ఇచ్చాడు. అత‌డు చాలా ఒదిగి ఉన్నాడు. నిజాయితీగా ఈ సినిమాకి ప‌ని చేసిన గొప్ప ప్ర‌తిభావంతుల గురించి అత‌డు బ‌హిరంగ వేదిక‌పై మాట్లాడ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని ఆర్జీవీ అన్నాడు. అత‌డి నిజాయితీని ప్ర‌శంసించాడు. బ‌హుశా త‌న ర‌చ‌యిత‌లు, అసిస్టెంట్లను ఆదిత్యా ధ‌ర్ దాచి పెట్టేందుకు సిద్ధంగా లేన‌ని సంకేతాలిచ్చాడు. అతడి వ‌ద్ద పని చేసే ప్ర‌తిభావంతుల‌కు అత‌డు గొప్ప గుర్తింపును ఇస్తాడు. టైటిల్ క్రెడిట్స్ కూడా ఇస్తాడు. వారి గురించి బ‌హిరంగ వేదిక‌ల‌పై హైలైట్ చేస్తాడు.

ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్ కూడా గతంలో ఇలాంటి విషయాల గురించి పరోక్షంగా స్పందించారు. టాలెంట్ ఉన్నవారిని ఎంత తొక్కేయాలని చూసినా, సరైన సమయం వచ్చినప్పుడు వారు తామేంటో నిరూపించుకుంటారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News