మీరు ముందు నడిచారు కాబట్టే.. ఆర్జీవీపై 'దురంధర్' దర్శకుడి ఎమోషనల్ పోస్ట్!
దురంధర్ సినిమాపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆదిత్యాధర్ చాలా ఎమోషనల్ అవుతూ.. ఆర్జీవీపై తన అభిమానం, ప్రేమను బహిరంగంగా వెల్లడించాడు.;
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా `దురంధర్` గురించి చర్చ సాగుతోంది. 2025 ముగింపులో వచ్చి చాలా సినిమాల రికార్డులను ఇది బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే 700కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి 1000కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోందని కథనాలొచ్చాయి. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యాధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మునుముందు చాలా రికార్డులను తిరగరాయనుందని అంచనా వేస్తున్నారు.
ఈ సమయంలోనే `దురంధర్` చిత్రంపై సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. దురంధర్ సినిమాపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆదిత్యాధర్ చాలా ఎమోషనల్ అవుతూ.. ఆర్జీవీపై తన అభిమానం, ప్రేమను బహిరంగంగా వెల్లడించాడు. ఆ ఇద్దరి మధ్యా సోషల్ మీడియా సంభాషణలు ఇప్పుడు ఎండ్ లెస్ గా మారాయి. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కనబరుస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.
ఎక్స్ ఖాతాలోని మొదటి పోస్ట్ లో భారతీయ సినిమా భవిష్యత్తును పూర్తిగా ఏకపక్షంగా మార్చేశావని ఆదిత్యాధర్ పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. `ధురందర్` నుండి దర్శకనిర్మాతలు నేర్చుకోవాల్సిన కొన్ని ప్రత్యేక పాఠాలున్నాయని ఆర్జీవీ విశ్లేషించారు. దీనికి ప్రతిస్పందనగా ఆదిత్యాధర్ ఆర్‌జీవీపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. ``భారతీయ సినిమాకు భయం అన్నదే లేని, మొహమాటపడని, సజీవమైన అనుభూతిని కలిగించిన నా అభిమాన దర్శకులలో ఒకరు ఆర్జీవీ`` అని ఆదిత్యాధర్ అన్నారు. ``ధురందర్‌లో ఆ లక్షణాలలో కొద్ది భాగం ఉన్నా, దానికి కారణం నేను ఈ సినిమా కథను రాస్తున్నప్పుడు.. దర్శకత్వం వహిస్తున్నప్పుడు మీ సినిమాలు నా తలలో గుసగుసలాడాయి.. కొన్నిసార్లు గట్టిగా అరిచాయి! అని ఛమత్కరించాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య సంభాషణలు ఆగలేదు.
ఈ ఆదివారం నాడు... ఆదిత్యా ధర్ మరోసారి ఆర్జీవీపై తన ప్రేమను కనబరిచారు. ``మీరు (ఆర్‌జీవీ) ముందు నడిచారు కాబట్టే ధురందర్ పరుగెత్తగలిగింది`` అని ఛమత్కరించారు. అత్యంత కష్టమైన సమయంలో మీరు రిస్కులు తీసుకున్నారు! ఎలాంటి టెంప్లేట్లు లేని, ఎలాంటి భద్రతా వలయాలు లేని, ప్రయోగం సక్సెసవుతుందో లేదో గ్యారెంటీ లేని సమయంలో మీరు ఆ సాహసం చేశారు`` అని అన్నారు. దీనికి ఆర్జీవీ స్పందించిన తీరు ఆశ్చర్యపరిచింది.
``ఆ రోజుల్లో తాను అజ్ఞానం వల్ల ఆ రిస్కులు తీసుకున్నానని.. అవి నిజానికి రిస్కులని తనకు తెలియద``ని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. నిజం చెప్పాలంటే.. నా అజ్ఞానం వల్ల అవి రిస్కులని నాకు తెలియకపోవడం వల్లే.. నేను అలా చేసాను.. అది అహంకారం వల్ల అయినా లేదా ఆత్మవిశ్వాసం వల్ల అయినా, నేను నా నమ్మకంతో ముందుకు వెళ్ళాను. అది విజయవంతమైనప్పుడు దూరదృష్టి అన్నారు, అది విఫలమైనప్పుడు అంధత్వం అన్నారు`` అని ఆర్జీవీ వివరించారు. ఈ ఏడాది 800 కోట్ల క్లబ్ లో నిలిచిన కాంతార చాప్టర్ 1, చావా రికార్డులను దురంధర్ బ్రేక్ చేస్తూ దూసుకెళుతోందని ట్రేడ్ చెబుతోంది.