హైద‌రాబాద్ బ్యూటీ క‌థ‌, పాత్ర తెలుసుకోకుండానే!

హీరోయిన్ ఎవ‌రైనా క‌థ, అందులో త‌న పాత్ర తెలియ‌కుండా ఏ సినిమాకు క‌మిట్ అవ్వ‌దు. అలా క‌మిట్ అయిందంటే? అది ద‌ర్శ‌కుల‌పై త‌న‌కున్న న‌మ్మకం మాత్ర‌మే కార‌ణ‌మ‌వుతుంది.;

Update: 2025-12-04 11:30 GMT

హీరోయిన్ ఎవ‌రైనా క‌థ, అందులో త‌న పాత్ర తెలియ‌కుండా ఏ సినిమాకు క‌మిట్ అవ్వ‌దు. అలా క‌మిట్ అయిందంటే? అది ద‌ర్శ‌కుల‌పై త‌న‌కున్న న‌మ్మకం మాత్ర‌మే కార‌ణ‌మ‌వుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ద‌ర్శ‌క‌, న‌టుల మ‌ధ్య ఉన్న ర్యాపో కార‌ణంగానూ ఇలాంటి స‌న్నివేశం క‌నిపిస్తుంది. తాజాగా హైద‌రాబాద్ బ్యూటీ అతిది రావు హైద‌రీ కూడా అంతేనంటోంది. పాత్ర‌ల కంటే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులే త‌నను ఎక్కువ‌గా ఉత్సాహ‌ప‌రుస్తారంది. ఎందుకంటే తానెప్పుడు ద‌ర్శ‌కుల బిడ్డ‌నే అంటుంది. వాళ్ల అభిరుచుకి త‌గ్గ‌ట్టు ఉండ‌ట‌మే త‌న ప‌ని అంది.

పాత్ర గురించి తెలుసుకోనంది. ఏం జ‌రుగుతుందో తెలియ‌ని చీక‌టి గ‌దిలోకి వెళ్తోన్న చిన్న పిల్లాడిలా తాను ఉండాల నుకుంటుంటానంది. తాను ఏ పాత్ర ఎంచుకున్నా? అందులో సీతాకోక చిలుక‌లా ఎగ‌రాల‌నుకుంటుంటానంది. ఏ సిన‌మాకు సంత‌కం చేసినా? పాత్ర‌ల ప‌రంగా అలా ఉండాలి? ఇలా ఉండాలి? అని ఎలాంటి స‌ల‌హాలు ఏ ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌కు ఇవ్వ‌న‌ని, వారు అప్రోచ్ అయ్యే విధానంతోనే స‌గం క‌మిట్ మెంట్ జ‌రిగిపోతుందంది. తాను అలా కాకుండా మ‌రోలా సినిమా క‌మిట్ అయితే ఎంతో అసౌక‌ర్యంగా అనిపిస్తుంద‌ని తెలిపింది.

న‌టిగా అదితిరావ్ హైద‌రీ ఇప్ప‌టికే అన్ని భాష‌ల్ని చుట్టేసింది. మాలీవుడ్తో మొద‌లై బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప‌ని చేసింది. ఎక్కువ‌గా హిందీ సినిమాలే చేసింది. అయితే న‌టిగా ఆ భాష‌లో సాధిం చాల్సినంత స‌క్సస్ అయితే సాధించ‌లేదు. బాలీవుడ్ ట‌ఫ్ కాంపిటీష‌న్ న‌డుమ అమ్మ‌డు నిల‌బ‌డ‌లే క‌పోయింది. ఈ క్ర‌మంలో వివిధ భాష‌ల్లో ప్ర‌యాణాన్ని కొన‌సాగించింది. టాలీవుడ్ లో `స‌మ్మోహ‌నం` సినిమాతో లాంచ్ అయింది. అటుపై `అంత‌రిక్షం`లో న‌టించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `వీ` లోనూ న‌టించింది.

అనంత‌రం సిద్దార్ద్, శ‌ర్వానంద్ న‌టించిన `మ‌హా స‌ముద్రం`లో క‌నిపించింది. ఆ త‌ర్వాత అమ్మ‌డు హిందీ, త‌మిళ్ లో ప‌ని చేస్తోంది. రెండేళ్ల క్రితం వెబ్ సిరీస్ ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. `తాజ్`, `హీరామండి` లాంటి హిట్ సిరీస్ ల్లోనూ భాగ‌మైంది. ప్ర‌స్తుతం `ఓ సాతి రే`లోనూ న‌టిస్తోంది. ఇటీవ‌లే తెలుగు సినిమాల‌పై మ‌రోసారి ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది. మంచి అవ‌కాశం వ‌స్తే న‌టించ‌డానికి తాను సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో హీరోయిన్ల మ‌ధ్య కాంపిటీష‌న్ అంతే ట‌ఫ్ గా ఉంది.

Tags:    

Similar News