జర్నలిస్టు వ్యంగ్యంపై ధీటుగా కౌంటరిచ్చిన బచ్చన్
జర్నలిస్టులతో సెలబ్రిటీల సత్సంబంధాలు ఎప్పుడూ సన్నిహితంగానే అనిపిస్తాయి. కొన్నిసార్లు నిజాయితీగా సూటిగా అడిగే ప్రశ్నలకు ఫీలయ్యే సెలబ్రిటీలు ఉన్నారు.;
జర్నలిస్టులతో సెలబ్రిటీల సత్సంబంధాలు ఎప్పుడూ సన్నిహితంగానే అనిపిస్తాయి. కొన్నిసార్లు నిజాయితీగా సూటిగా అడిగే ప్రశ్నలకు ఫీలయ్యే సెలబ్రిటీలు ఉన్నారు. ఒక్కో సందర్భంలో వెగటుగా మొరటుగా ప్రశ్నించే జర్నలిస్టులతోను కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి వెగటు వ్యంగ్యం ప్రదర్శించిన ఓ జర్నలిస్టుకు మిస్టర్ అభిషేక్ బచ్చన్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చగా మారింది.
సదరు జర్నలిస్టు ప్రకారం.. అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్లు నటన కంటే, తనకు ఉన్న సత్సంబంధాల వల్ల, పీఆర్ దూకుడు కారణంగా అవార్డులు పొందగలరని, కెరీర్ లో ఒక్క సోలో హిట్టు కూడా లేకపోయినా అతడు బాలీవుడ్ లో అవార్డులను ప్రభావితం చేయగలడనే అర్థం వచ్చేలా సూటి పోటి మాటలు అన్నాడు. ఇలాంటి అవకాశం ప్రతిభావంతులైన చాలా మంది నటీనటులకు లేదు. వారికి దూకుడుగా వ్యవహరించే పీఆర్ లేదు.. సత్సంబంధాలు లేకపోవడం వల్ల అవార్డులు అందుకోలేరని కూడా అతడు అన్నాడు. అభిషేక్ బచ్చన్ `ఐ వాంట్ టు టాక్`(2025) చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డును కొనుగోలు చేసాడని అతడు విమర్శించాడు. కొందరు పెయిడ్ జర్నలిస్టులు మాత్రమే ఈ సినిమాని చూసారని, ఇది థియేటర్లలో కూడా సరిగా ఆడలేదని అతడు విమర్శల దాడి చేసాడు. వరుసగా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అభిప్రాయాలను చదివిన తర్వాత తనకు ఇది మాట్లాడాలనిపించిందని జర్నలిస్ట్ అన్నారు.
అయితే దీనికి బాగా నొచ్చుకున్న అభిషేక్ బచ్చన్ ధీటైన సమాధానం ఇచ్చారు. నేను అవార్డులు ఎప్పుడూ కొనలేదు. నాకు దూకుడైన పీఆర్ కూడా లేదు. కష్టపడే తత్వం ఒక్కటే మార్గం. చెమట రక్తం ఓడ్చి శ్రమించే తత్వంతో నేను దీనిని సాధించాను. మీకు ఏం చెప్పినా నమ్మరని తెలుసు. కాబట్టి మీ నోరు మూయించడానికి, భవిష్యత్ విజయాలపై మీరు అనుమానించకుండా ఉండటానికి మరింత కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గం. నేను మిమ్మల్ని తప్పు అని నిరూపిస్తాను! గౌరవంతో సహనంతో ఇది చేస్తాను.. అని అభిషేక్ ప్రత్యుత్తరం ఇచ్చారు.
అయితే దీనికి ప్రతిస్పందనగా జర్నలిస్ట్ కొంత దిగి వచ్చారు. మీ నటన, ప్రవర్తన గురించి కూడా చాలాసార్లు ప్రశంసనీయమైన విషయాలు రాసాను సర్. కొన్నిసార్లు అవి మా అభిప్రాయాలు మాత్రమే. దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదు.. అని రిప్లయ్ ఇచ్చారు. అవార్డుల విషయానికొస్తే నేను వాటి గురించి తక్కువ చేయను. మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ప్రధానపాత్రల్లో చూడాలని నిజంగా కోరుకుంటున్నాను. ఈ తరంలో మీరు అత్యంత మంచి ప్రవర్తన కలిగిన నటుడిగా ఎల్లప్పుడూ కొనసాగుతారు`` అని రాశారు.
అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీయెస్ట్ స్టార్. అతడు రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టి అతి భారీ లాభాలను ఆర్జించగల నిపుణుడు. వ్యవస్థాపకుడిగాను తెలివైన పెట్టుబడులు పెట్టాడు. నటనా రంగం కంటే ఎక్కువగా వ్యాపారాల నుంచి ఆర్జిస్తున్నాడు.