ఐశ్వ‌ర్యారాయ్ గూగుల్‌పై 4కోట్ల న‌ష్ట‌ప‌రిహారం దావా

సెల‌బ్రిటీల ఫోటోలు, వీడియోలు, వారి వాయిస్ ల‌ను దుర్వినియోగం చేస్తూ, త‌ప్పుడు మార్గంలో వినియోగిస్తూ ఏఐ క్రియేట‌ర్లు సాగిస్తున్న అరాచ‌కాల‌ను ఇప్పుడు కోర్టులో నిల‌దీసే వెసులుబాటు క‌లుగుతోంది.;

Update: 2025-10-02 06:42 GMT

ఒక సినీ నటిని అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్న ఏఐ మోడ‌ల్ హీరో- అభిషేక్ క్లిప్.. బ్యాక్ గ్రౌండ్ లో నిలబడి అభిషేక్ పొగ త్రాగుతుండగా ఐశ్వర్య రాయ్‌, ఆమె మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ కలిసి భోజనం చేస్తున్న ఏఐ వీడియో.. ఖాన్ అభిషేక్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొసలి ఒక‌టి అభిషేక్‌ను వెంబడించే వీడియో.. ఇలాంటి అస‌భ్య‌క‌ర కంటెంట్ గూగుల్ లో చాలా కాలంగా ట్రెండింగ్ లో ఉంది. ఇటీవ‌ల కృత్రిమ మేధ‌స్సు(ఏఐ)ని ఉప‌యోగించి త‌యారు చేస్తున్న మోడ‌ల్ వీడియోలు అత్యంత నీచ‌ప్ర‌వృత్తితో జుగుప్స‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

సెల‌బ్రిటీల ఫోటోలు, వీడియోలు, వారి వాయిస్ ల‌ను దుర్వినియోగం చేస్తూ, త‌ప్పుడు మార్గంలో వినియోగిస్తూ ఏఐ క్రియేట‌ర్లు సాగిస్తున్న అరాచ‌కాల‌ను ఇప్పుడు కోర్టులో నిల‌దీసే వెసులుబాటు క‌లుగుతోంది. చ‌ట్టం ఇప్పుడు ఏఐ బాధితుల‌కు అండ‌గా నిలుస్తోంది. ఈ త‌ర‌హా కేసుల‌లో విజ‌యం సాధించిన మొద‌టి భార‌తీయ క‌పుల్ గా ఐశ్వ‌ర్యారాయ్- అభిషేక్ బ‌చ్చ‌న్ దంప‌తులు సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. దాదాపు 1500 పేజీల రిపోర్ట్ ని ఐష్-అభి దంప‌తుల లాయ‌ర్లు కోర్టుకు స‌మ‌ర్పించారు. ఇందులో వంద‌లాది ఇమేజ్ క్లిప్ లు, వీడియోల‌ను కూడా జోడించారు. వాట‌న్నిటినీ న్యాయ‌మూర్తులు ప‌రిశీలించి సెల‌బ్రిటీ దంప‌తుల‌కు జ‌రుగుతున్న న‌ష్టాన్ని ఒక అంచ‌నా వేసి చివ‌రిగా తీర్పును వెలువ‌రించారు.

ఇప్పుడు ఈ త‌ప్పులన్నిటికీ మూల‌మైన గూగుల్ పైనా, గూగుల్- యూట్యూబ్-వెబ్ వేదిక‌లుగా ఈ కార్య‌క‌లాపాల‌కు కార‌కులైన వారిపైనా అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ దంప‌తులు వ‌రుస‌గా ప‌రువు న‌ష్టం దావాలు వేస్తున్నారు. ఈ కేసుల‌లో కోట్లాది రూపాయ‌లు డిమాండ్ చేస్తూ ఈ దంప‌తులు గేమ్ స్టార్ట్ చేయ‌డం చ‌ర్చ‌గా మారింది.

AI బాలీవుడ్ లవ్ స్టోరీలను జనరేట్ చేయగలదు.. యూట్యూబ్ డేటా-షేరింగ్ విధానం ప్రకారం క్రియేట‌ర్లు ఓపెన్ AI, మెటా, xAI వంటి ఇతర ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల శిక్షణ నమూనా(మోడ‌ల్స్‌)ల కోసం అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ (లేదా ఇత‌ర జంట‌ల‌) వీడియోలను షేర్ చేస్తే ఆ న‌ష్టం ఎవ‌రికి? అటువంటి త‌ప్పుడు వ్య‌వ‌హారాల్లో శిక్షణ కోసం వీడియోలను షేర్ చేస్తే, మూడో పార్టీ కంపెనీ ఏం చేస్తుందో ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు? ఈ త‌ర‌హా కాంప్లికేటెడ్ ప్ర‌శ్న‌ల్ని లేవనెత్తుతూ గూగుల్ పై అభి- ఐష్ జంట కేసులు వేయ‌డం చ‌ర్చ‌గా మారింది. మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే కంటెంట్‌పై శిక్షణ ఇస్తే.. AI మోడల్‌లు అవాస్త‌వాల‌ను వేగంగా ప్ర‌చారం చేయ‌గ‌ల‌వ‌ని కూడా వారు కోర్టులో వాదించారు. త‌ద్వారా త‌మ ప‌రువు మ‌ర్యాద‌ల‌కు మ‌రింత ఘోర‌మైన డ్యామేజ్ జ‌రుగుతుంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో ప‌లు ఆధారాల‌తో 1,500 పేజీల స‌మాచారాన్ని కోర్టుకు స‌మ‌ర్పించారు ఈ జంట‌. అనధికారంగా వస్తువులపై త‌మ ఫోటోలను ఉప‌యోగించిన వారిపైనా కేసులు వేసారు. పోస్టర్లు, కాఫీ మగ్‌లు, త‌మ‌ ఫోటోలతో కూడిన స్టిక్కర్లు, నకిలీ ఆటోగ్రాఫ్ ఫోటోలను విక్ర‌యించే వారి నుంచి ప‌రిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. గూగుల్ స‌హా ఇతరులపై 4 కోట్లు (4,50,000 డాల‌ర్లు) నష్టపరిహారం చెల్లించాల‌ని, ఆయా వ‌స్తువుల‌ను శాశ్వతంగా నిషేధాన్ని కూడా కోరుతున్నారు.

ఈ కేసుల‌లో లైంగికంగా అసభ్యకరమైన లేదా కల్పిత AI కంటెంట్‌ను చూపించే యూట్యూబ్‌ వీడియోలకు సంబంధించి వందలాది లింక్‌లు, స్క్రీన్‌షాట్‌లను కూడా న్యాయ‌మూర్తుల‌కు అభిషేక్- ఐష్ జంట స‌మ‌ర్పించారు. ఇప్ప‌టికే వైర‌ల్ అయిన 518 వెబ్‌సైట్ లింక్‌లు, పోస్ట్‌లను తొలగించాలని కోర్టు జ‌డ్జి ఇప్ప‌టికే ఆదేశించారు. అవి స్టార్ క‌పుల్‌కు ఆర్థికంగా న‌ష్టం కలిగించాయని, వారి గౌరవం, మంచి పేరుకు హాని కలిగించాయని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

జనరేటివ్ AI కంటెంట్ తమ ప్రతిష్టను దెబ్బతీస్తుందని బాలీవుడ్ తారలు కలత చెందడంతో భారత కోర్టులు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ ఇప్పటికే మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. 2023లో ఢిల్లీ కోర్టు సీనియ‌ర్ న‌టుడు అనిల్ కపూర్ ఇమేజ్, వాయిస్ , అతడు రెగ్యుల‌ర్‌గా ఉపయోగించే క్యాచ్‌ఫ్రేజ్‌ను కూడా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడం ఒక మేలి మ‌లుపు.

Tags:    

Similar News