స్టార్ హీరో ఒక గూండా.. రాబందు.. డైరెక్టర్ సంచలన ఆరోపణలు
భారతదేశంలో అతిపెద్ద సినీపరిశ్రమకు మూల స్థంభంగా నిలిచిన ఒక పెద్ద సూపర్‌స్టార్ పై అతడి దర్శకుడు సంచలన ఆరోపణలు చేయడం చర్చగా మారింది.;
భారతదేశంలో అతిపెద్ద సినీపరిశ్రమకు మూల స్థంభంగా నిలిచిన ఒక పెద్ద సూపర్‌స్టార్ పై అతడి దర్శకుడు సంచలన ఆరోపణలు చేయడం చర్చగా మారింది. అతడు గూండా.. రాబందు.. పరిశ్రమను నియంత్రిస్తాడు. చెప్పిన మాట వినకపోతే ప్రతీకారం తీర్చుకుంటారు. నాశనం చేస్తారు! అంటూ విరుచుకుపడ్డాడు సదరు డైరెక్టర్. ఈ వివాదం ఎవరి మధ్య? అంటే సల్మాన్ ఖాన్ కి, అతడి దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ మధ్య వార్ ఇది.
సల్మాన్ ఖాన్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలలో దబాంగ్ ఒకటి. 2010లో ఈ చిత్రం విడుదలైంది. కానీ దబాంగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అభినవ్ కశ్యప్ (అనురాగ్ కశ్యప్ అన్న) ఆ తర్వాత `దబాంగ్ 2`కి దర్శకత్వం వహించలేదు. తాను దబాంగ్ 2 కి దర్శకత్వం వహించడానికి నిరాకరించానని, ఆ తర్వాత సల్మాన్, అతడి కుటుంబం తనను నియంత్రించడానికి ప్రయత్నించారని అగ్లీ ఫైట్ కి దిగాడు అభినవ్ కశ్యప్. నిజానికి సల్మాన్ కుటుంబంతో వైరం కారణంగానే అభినవ్ కెరీర్ నాశనమైందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తాయి.
సల్మాన్ ని బహిరంగంగా తిట్టడంలో అభినవ్ ఎప్పుడూ భయపడలేదు. అతడు ఓపెన్ గానే సల్మాన్ ని తిట్టాడు. ఇప్పుడు దబాంగ్ చిత్రం 15వ వార్షికోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో అతడు మరోసారి ఓ మీడియా ఇంటర్వ్యూలో సల్మాన్ ని తీవ్రంగా విమర్శించాడు. అభినవ్ మాట్లాడుతూ.. దబాంగ్ 2కు దర్శకత్వం వహించడానికి తాను నిరాకరించడం తనపై విధ్వంసక ప్రచారానికి దారితీసిందని ఆరోపించారు. అంతేకాదు సల్మాన్ ఎప్పుడూ నటించలేదని, అతడికి నటనపై ఆసక్తి లేదని విమర్శించాడు. ''అతడు గత 25 సంవత్సరాల నుండి నటించడం లేదు. అతడు పని చేయడం ద్వారా ఉపకారం చేస్తాడు.. సెలబ్రిటీగా ఉండటానికి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు కానీ అతనికి నటనపై ఆసక్తి లేదు. అతను ఒక గూండా'' అని విమర్శించారు. పగ ప్రతీకారంతో రగిలిపోయే అసభ్యకరమైన వ్యక్తి అని కూడా సల్మన్ ని అభినవ్ కశ్యప్ ఆరోపించారు.
బాలీవుడ్ లో `స్టార్ సిస్టమ్`కి సల్మాన్ పితామహుడు. సినీపరిశ్రమలో 50ఏళ్లుగా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడు దానిని ఇకపైనా ఇలానే నడిపిస్తాడు. వారు ప్రతీకార భావాలు కలిగిన వారు. సిస్టమ్ ని నియంత్రిస్తారు. వారితో ఏకీభవించకపోతే వెంటాడతారు! అని విమర్శించారు అభినవ్. సల్మాన్ గురించి అతడితో ఉన్న బోనీకపూర్ లాంటి నిర్మాత గురించి కూడా అభినవ్ తీవ్ర విమర్శలు చేసారు.
సల్మాన్ అతడి చుట్టూ ఉన్న కోటరీ గురించి తన సోదరుడు అనురాగ్ కశ్యప్ ముందే తనను హెచ్చరించాడని, వారితో కలిసి పని చేయడం కష్టం అని సూచించాడని కూడా అభినవ్ తెలిపారు. బోనీ కపూర్ అసభ్యకర ప్రవర్తన కారణంగా `తేరే నామ్` (2003) ప్రాజెక్ట్ నుంచి తన సోదరుడు అనురాగ్ కశ్యప్ తప్పుకున్నారని తెలిపాడు. తేరే నామ్ కి రచయితగా క్రెడిట్ ఇచ్చేందుకు బోనీ కపూర్ నిరాకరించాడని కూడా అతడు ఆరోపించాడు. నిజానికి సల్మాన్, బోనీతో అభినవ్ గొడవలు కొత్త కథలు కావు.. పాత విషయాలే. అయితే ఇప్పుడు మరోసారి అభినవ్ `ది స్క్రీన్`కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా ప్రస్థావించారు. ``ఈ రాబందుల గురించి నా సోదరుడు అనురాగ్ కి బాగా తెలుసు``నని కూడా అభినవ్ కశ్యప్ అన్నారు. అయితే అభినవ్ కశ్యప్ పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా, సల్మాన్ ఖాన్ ఎప్పుడూ బహిరంగంగా వైరం గురించి మాట్లాడలేదు. సల్మాన్ కెరీర్ కి అతిపెద్ద హిట్ చిత్రాన్ని ఇచ్చినందున అభినవ్ పై సల్మాన్ కుటుంబ సభ్యులు ఎప్పుడూ మౌనంగానే ఉన్నారు.