హీరోన‌వుతానంటే? నెత్తి మీద రూపాయి పెట్ట‌న‌న్న డాడ్!

సాధారణంగా ఇలాంటి నేపథ్యం ఉన్నవారు తమ పిల్లల కోసం భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించి, గ్రాండ్‌గా లాంచ్ చేస్తుంటారు.;

Update: 2026-04-11 09:30 GMT

రాజకీయ పలుకుబడి, ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన ఆయుష్ శర్మకు హీరోగా మారడం సులభమని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. తాను నటుడిగా మారాలను కుంటున్నట్లు తన తండ్రి అనిల్ శర్మకు చెప్పినప్పుడు ఆయన నుండి లభించిన స్పందన ఆయుష్‌ను ఆశ్చర్యపరిచిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నువ్వు హీరో కావాలనుకుంటే నీ కష్టంతో అవ్వు. నీ లాంచ్ సినిమా కోసం నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను అని ఆయన తండ్రి తెగేసి చెప్పాడుట‌. వారసత్వంగా వచ్చే అవకాశాల కంటే స్వయంకృషితో సంపాదించుకునే గుర్తింపుకే డాడ్ ప్రాధాన్యతనిచ్చారు.

సాధారణంగా ఇలాంటి నేపథ్యం ఉన్నవారు తమ పిల్లల కోసం భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించి, గ్రాండ్‌గా లాంచ్ చేస్తుంటారు. అయితే ఆయుష్ తండ్రి మాత్రం తన కుమారుడికి నటనపై ఉన్న మక్కువ ఎంతవరకు నిజమో పరీక్షించాలనుకున్నారు. నీలో టాలెంట్ ఉంటే నీ అంతట నువ్వే నిరూపించుకో అని చెప్పడం ద్వారా ఆయుష్‌లో పట్టుదలను పెంచారు. ఇది ఆయుష్‌ను తన నటనపై, డాన్స్ , బాడీ లాంగ్వేజ్‌పై మరింత కష్టపడేలా చేసింది. తండ్రి నుండి ఆర్థిక సహకారం అందకపోయినా? తన లక్ష్యం వైపు అడుగులు వేయడంలో ఆయుష్ వెనకడుగు వేయలేదు.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ అండగా నిలిచి ఆయుష్‌ను లవ్‌యాత్రి సినిమాతో పరిచయం చేశారు. సల్మాన్ ఖాన్ తన బావమరిదిని లాంచ్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా ఆయుష్ తండ్రి ఆశ్చర్యపోయారట. తన కుమారుడిలో సల్మాన్ ఖాన్ అంతటి స్టార్ హీరోకి ఏం కనిపించిందోనని పెద్దాయ‌న‌ సరదాగా వ్యాఖ్యానించారు. సల్మాన్ ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆయుష్ ప్రతి సినిమాకు తనను తాను కొత్తగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. అంతిమ్ సినిమాలో ఆయుశ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ , నటన ఆయనలోని పరిణతిని చాటి చెప్పాయి.

సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి చర్చ జరుగుతున్న తరుణంలో ఆయుష్ శర్మ తండ్రి తీసుకున్న‌ నిర్ణయం అభినందనీయం. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహించడం గొప్ప విష‌యం.. తండ్రి పెట్టిన నిబంధన వ‌ల్లే ఆయుష్‌ శర్మకు సినిమా విలువ, అవకాశం వెనుక ఉండే కష్టం అర్థమ య్యాయి. ఇప్పుడు ఆయుశ్ చేసే సినిమాల ద్వారా పాత్రలోనూ ఆ కష్టం, అంకితభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం స్టార్ హోదాను వాడుకోకుండా? ఒక నటుడిగా గుర్తింపు పొందడమే తన లక్ష్యమని ఆయుశ్ నిరూపిస్తున్నాడు.

ఆయుష్ శర్మ ప్రయాణం సినీ రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది వారసులకు ఓ లెస‌న్. తండ్రి రూపాయి పెట్టను అని అనడం శాపం కాదు. అది తనను తాను నిరూపించుకోవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశం అని ఆయుష్ నిరూపించాడు. నేడు సొంత గుర్తింపు కోసం ఆయుశ్ చేస్తోన్న‌ పోరాటం బాక్సాఫీస్ వద్ద కూడా సత్ఫలితాలను ఇస్తోంది. తన తండ్రి ఆశించినట్లుగానే కేవలం పేరు వెనుక ఉన్న ఇమేజ్‌తో కాకుండా తన టాలెంట్‌తో ఆయుష్ శర్మ బాలీవుడ్‌లో స్థిరపడ‌తాడ‌ని ఆశిద్దాం.

Tags:    

Similar News