ఇలాంటి వాదనలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు
ఆస్కార్ బరిలో పోటీపడిన `లాపాటా లేడీస్` వీడియోని, బుర్కా సిటీ సన్నివేశాలతో పోల్చుతూ..సోషల్ మీడియాలో ఒక క్లిప్ వైరల అయ్యాక అసలు వివాదం మొదలైంది.;
లాపాటా లేడీస్ .. 2025- ఆస్కార్ బరిలో పోటీకి నిలిచిన చిత్రమిది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సతీమణి, ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆస్కార్ బరిలో విన్ కొట్టకపోయినా ఈ సినిమా మీడియాలో పెద్ద చర్చగా మారింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా కథాంశాన్ని ఓ అరబిక్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయింది.
తాజాగా ఈ ఆరోపణలను లాపాటా లేడీస్ రచయిత బిప్లాబ్ గోస్వామి కొట్టి పారేసారు. ఈ సినిమా కథ, సంభాషణలు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ సంవత్సరాల తరబడి పరిశోధించి నిజాయితీగా రాసుకున్న తర్వాతే పుట్టాయని గోస్వామి అన్నారు. ఇటీవలి కాపీరైట్ ఆరోపణలను ఆయన గట్టిగా ఖండించారు. ఈ చిత్రం 2019 అరబిక్ షార్ట్ ఫిల్మ్ బుర్కా సిటీతో పోలికలను కలిగి ఉందనే వాదనలను కొట్టి పడేసారు. గోస్వామి తన స్క్రిప్ట్ కు సంబంధించిన డాక్యుమెంట్ రుజువును సమర్పించారు. వివాదం తలెత్తడానికి కొన్ని సంవత్సరాల ముందే ఈ కథను రూపొందించి, రచయితల సంఘంలో రిజిస్టర్ చేసామని చెప్పారు.
ఆస్కార్ బరిలో పోటీపడిన `లాపాటా లేడీస్` వీడియోని, బుర్కా సిటీ సన్నివేశాలతో పోల్చుతూ..సోషల్ మీడియాలో ఒక క్లిప్ వైరల అయ్యాక అసలు వివాదం మొదలైంది. రెండు కథలు కూడా బురఖా ధరించడం వల్ల వధువులు మారిపోవడం అనే కాన్సెప్టును ఎంచుకోవడంతో సారూప్యతల్ని చూసారు. కొందరు నెటిజనులు `లాపాటా లేడీస్` చిత్రాన్ని ఒరిజినల్ మూవీ కాదని ఆస్కార్స్ కి పోటీపడటం సరికాదని మూవీ విశ్వసనీయతను ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ఒక లేఖలో రచయిత గోస్వామి ఆరోపణలను నేరుగా ఖండించారు. ``మా కథ, పాత్రలు, సంభాషణలు 100 శాతం ఒరిజినల్`` అని రాశారు. లాపాటా లేడీస్ స్క్రీన్‌ప్లే చాలా సంవత్సరాల సమయం తీసుకుని అభివృద్ధి చేసాము. 3 జూలై 2014న `టూ బ్రైడ్స్ విత్ ది స్క్రీన్‌రైటర్స్ అసోసియేషన్` అనే వర్కింగ్ టైటిల్ కింద స్క్రిప్ట్ రిజిస్టర్ చేసామని, బుర్కా సిటీ 2019లో విడుదల కావడానికి చాలా కాలం ముందు ఇది జరిగిందని తెలిపారు. తన వాదనను బలపరచుకోవడానికి రచయిత రిజిస్ట్రేషన్ పత్రాలను సాక్ష్యంగా విడుదల చేశారు. కాపీ ఆరోపణలు నిరాధారమైనవి అని అన్నారు. రచయితగా నా ప్రయత్నాలను మాత్రమే కాకుండా, ఈ చిత్రానికి ప్రాణం పోసిన మొత్తం బృందం కృషిని కూడా దెబ్బతీస్తున్నారని అన్నారు. `లాపాటా లేడీస్`లోని ప్రత్యేకమైన పాత్రలు, నేపథ్యం వగైరా బుర్కా సిటీతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయని హైలైట్ చేశారు.
లాపాటా లేడీస్ ఇలాంటి వాదనలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, ఫిలింమేకర్ అనంత్ మహాదేవన్ఈ సినిమా కథాంశం తన 1999 టెలిఫిల్మ్ ఘుంఘాట్ కే పట్ ఖోల్‌ను పోలి ఉందని అన్నారు. ప్రస్తుతానికి తాజా ఆరోపణలకు సంబంధించి దర్శకురాలు కిరణ్ రావు లేదా నిర్మాత అమీర్ ఖాన్ నుండి అధికారిక ప్రతిస్పందనలేవీ లేవు. మార్చిలో విడుదలైన లాపాటా లేడీస్ IIFA 2025లో 10 అవార్డులను గెలుచుకుంది. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మంచి గుర్తింపు పొందింది.