స్టార్ డమ్ కోల్పోయి హీరోలు ఫేడవుట్..ఒప్పుకోని హీరో!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `సూపర్ స్టార్` అనే హోదాపై ఇప్పుడు ఇద్దరు అగ్ర హీరోల మధ్య విరుద్ధ చర్చ హాట్ టాపిగ్గా మారింది.;
అమీర్ ఖాన్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతి కొత్త తరం అంతకుముందు తరం కంటే మెరుగ్గా ఉంటుందని నొక్కి చెప్పారు. కొత్త తరం నటులకు పాత తరం అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడతాయని అది వారి ఎదుగుదలకు ప్లస్ అవుతుందని విశ్లేషించారు. భవిష్యత్తులో కూడా గొప్ప స్టార్లు పుట్టుకొస్తారని..మేమే చివరి స్టార్‌లం అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదని అమీర్ తన వాదన వినిపించారు.
కాల ప్రవాహంలో మార్పు అనేది సహజమని... పాత నీరు వెళితేనే కొత్త నీరు వస్తుందని అమీర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన దైవత్వంతో కూడిన సృష్టి, స్థితి, లయ (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) తత్వాన్ని ప్రస్తావించడం విశేషం. ఒకానొక సమయంలో ప్రజలు పాత స్టార్లను మర్చిపోయి కొత్తవారిని ఆరాధిస్తారని.. ఇది ప్రపంచ రీతి అని ఆయన చాలా నిజాయితీగా చెప్పారు. అమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న పరిణతిని, అహంకారం లేని వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి నేటి తరం నటులు సూపర్ స్టార్లుగా పిలుపు అందుకోలేరా? అనే ప్రశ్నలు ఉదయించాయి. కానీ అమీర్ ఖాన్ ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇప్పటికే రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి నటులు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్`ఫ్రాంఛైజీ చిత్రాల సంచలన విజయం తర్వాత కొత్త తరం స్టార్లు తమ ఉనికిని గట్టిగా చాటుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. విక్కీ కౌశల్ చావా చిత్రంతో 800 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంతో 900 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరాడు. రణవీర్ సింగ్ ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ హీరో. దురంధర్ 2తో 2000 కోట్ల క్లబ్ లో చేరుతున్నాడు. వీరంతా స్టడీగా ఈ విజయాలను కొనసాగిస్తే సూపర్ స్టార్ డమ్ దిశగా దూసుకెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓవరాల్ గా సినీపరిశ్రమలో స్టార్‌డమ్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అమీర్ ఖాన్ తేల్చి చెప్పారు. పాత తరం నటులు తమ స్థానాన్ని భద్రపరుచుకున్నా.. కొత్త తరం కూడా అదే స్థాయిలో పేరు, ప్రఖ్యాతులను ఆస్వాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా అనే అద్భుతమైన మాధ్యమం ఉన్నంత కాలం సూపర్ స్టార్లు పుడుతూనే ఉంటారని.. వారిని ఆదరించే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారని ఈ చర్చ ద్వారా మరోసారి వెల్లడైంది.
అయితే సౌత్ లో ఇటీవల కొత్త తరం హీరోలు దూసుకెళుతున్నారు. 100 కోట్ల క్లబ్ లు అందుకోవడం ఈ హీరోలకు కష్టంగా లేదు. అయితే అగ్ర హీరోలు అడపాదడపా విజయాలు అందుకుంటున్నా కానీ, భవిష్యత్ వీరందరికీ సవాల్ గా మారనుందనే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ఈ అగ్ర హీరోలు ఫేడవుట్ అయ్యారని మీరు భావిస్తున్నారా?