స్టార్ హీరోకి అండర్ వరల్డ్ బెదిరింపులు
90లలో ముంబైని అండర్ వరల్డ్ గడగడలాడించేది. ముఖ్యంగా సెలబ్రిటీలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడుకునేందుకు మాఫియా తెగించేది.;
90లలో ముంబైని అండర్ వరల్డ్ గడగడలాడించేది. ముఖ్యంగా సెలబ్రిటీలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడుకునేందుకు మాఫియా తెగించేది. దావూద్ ఇబ్రహీం - అబూసలేం గ్యాంగ్ ల అరాచకాలతో ముంబై అట్టుడికిపోయే పరిస్థితి ఉండేది. పాకిస్తాన్, గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలున్న దావూద్, బాలీవుడ్ ని తన గుప్పిట్లో పెట్టుకుని, గ్లామర్ ప్రపంచంలో కథానాయికలతో గేమ్స్ ఆడిన కథల్ని వెండితెరపైనా చూసాం.
అప్పట్లోనే ప్రముఖులను బెదిరించి, వారిపై తుపాకులతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. టిసిరీస్ గుల్షన్ కుమార్ ని, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ని కూడా మాఫియా బెదిరించింది. వారిపై తుపాకి దాడులు చేసింది. గుల్షన్ మాఫియాకు బలయ్యారు. రాకేష్ రోషన్ కొద్దిలో మిస్సయ్యారు కానీ...! థాంక్ గాడ్ ఈరోజు అతడి గురించి ప్రపంచం మరచిపోయి ఉండేది. ఇవి కేవలం శాంపిల్స్ మాత్రమే.. ముంబైలో ఖాన్ ల త్రయం, బచ్చన్ లు, చాలా మంది సినీదర్శకులు నిర్మాతలకు మాఫియా థ్రెట్ ఎదురైందని కథనాలొచ్చాయి. చాలా మంది కథానాయికలతో ఆటాడుకుంది మాఫియా.
అదే సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి కూడా మాఫియా నుంచి పిలుపు వచ్చింది. అయితే అతడు దానిని సున్నితంగా తిరస్కరించాడు. మీతో వస్తే నా చేతులు కాళ్లు కట్టేసి, నన్ను ఏదైనా చేయగలరు. అందుకే నేను రాను! అని భయపడుతున్నట్టు నటించాడు. కొన్ని నెలల పాటు అతడిని మాఫియా వ్యక్తులు కలుస్తూనే ఉన్నారు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. దుబాయ్ లో పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తమ సర్కిల్ లో చేరాలని కూడా కోరారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అమీర్ కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మాఫియా ఎంత ఒత్తిడి చేసినా తాను తలొంచలేదని అతడు చెప్పాడు. తాను భయపడ్డానని అన్నాడు. అయితే తన కుటుంబం గురించి ఆలోచించి భయపడినట్టు చెప్పాడు. అప్పటికే రీనాతో పెళ్లయింది. ఇద్దరు చిన్న పిల్లలు తనకు ఉన్నారు. అయితే మాఫియా వ్యక్తులు ఆఫర్లతో తనను గెలవడానికి ప్రయత్నిస్తూ తిరిగి వస్తూనే ఉన్నారు. చాలా ప్రయత్నించారు. వారు నాకు డబ్బు ఇచ్చి, నాకు నచ్చిన ఏ పనినైనా పూర్తి చేయమని చెప్పారు. అయినప్పటికీ నేను రావడానికి నిరాకరించాను. వారు తర్వాత స్వరం మార్చారు. నా హాజరును పార్టీకి వచ్చే అతిథులకు అప్పటికే ప్రకటించారు కాబట్టి నేను వెంటనే రావాల్సి ఉంటుందని, అది ప్రతిష్టకు సంబంధించిన విషయం అని వార్నింగ్ ఇచ్చారు! అని అమీర్ చెప్పాడు.
పరిస్థితులు తీవ్ర మలుపు తిరిగినా అమీర్ లొంగలేదు. ``ఇదే మన చివరి సమావేశం అని నేను అన్నాను. ``మీరు ఒక నెల నుండి కలుస్తున్నారు.. నేను రానని మొదటి నుండి మీకు చెబుతున్నాను. మీరు చాలా శక్తివంతులు కాబట్టి మీరు నన్ను కొట్టవచ్చు.. నా తలపై కొట్టవచ్చు, నా చేతులు.. కాళ్ళు కట్టివేయవచ్చు.. మీకు కావలసిన చోటికి బలవంతంగా తీసుకెళ్లవచ్చు.. కానీ నేను రాలేను`` అని చెప్పాను. కాబట్టి వారు నన్ను సంప్రదించడం మానేశారని అమీర్ గుర్తు చేసుకున్నాడు. అమీర్ నటించిన సీతారే జమీన్ పర్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోని సంగతి తెలిసిందే.