200 కోట్లకు పెరిగిన చైతూ మూవీ బడ్జెట్
అక్కినేని నాగచైతన్య వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ సైలెంట్ గా హిట్లు కొడుతూ తన కెరీర్ ని బేషుగ్గా నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే.;
అక్కినేని నాగచైతన్య వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ సైలెంట్ గా హిట్లు కొడుతూ తన కెరీర్ ని బేషుగ్గా నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరి, తండేల్ లాంటి భారీ హిట్ చిత్రాల్లో నటించాక, అతడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే చైతూ కెరీర్ లో ఒక ఊహించని పరాజయం ఎప్పుడూ అభిమానుల్లో చర్చగా మారుతోంది.
అది అతడి బాలీవుడ్ డెబ్యూ సినిమా- లాల్ సింగ్ చడ్డా. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా పరాజయం పాలైంది. నిర్మాత అమీర్ ఖాన్ సహా పంపిణీ వర్గాలకు తీవ్రమైన నష్టాల్ని మిగిల్చింది ఈ చిత్రం. నాలుగేళ్ల పాటు శ్రమించి తీసిన ఈ సినిమా ఘోరఫలితాన్ని అందుకోవడంతో అమీర్ ఖాన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. హిందీలో ప్రారంభ చిత్రం పరాజయాన్ని చైతూ కూడా జీర్ణించుకోలేకపోయాడు. అమీర్ ఖాన్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఈ సినిమా ఘోర పరాభవానికి కారణమేమిటో తాజా ఇంటర్వ్యూలో అమీర్ విశ్లేషించారు.
నిజానికి అతి నమ్మకం, తప్పుడు లెక్కలు తనను ముంచాయని అతడు నిజాయితీగా అంగీకరించాడు. సినిమా బడ్జెట్‌ను 80 కోట్లు దాటకూడదని భావించినా కానీ, రూ. 200 కోట్ల రేంజుకు అనూహ్యంగా పెరిగిందని తెలిపాడు. తన ఖర్చు ఎలా అదుపు తప్పిందో కూడా వెల్లడించాడు. కోవిడ్ 19 సమయంలో కూడా అతడు తన సిబ్బందికి జీతాలిచ్చాడు. చిత్రీకరణ బాగా డిలే అవ్వడం, విదేశీ షూటింగులు, చైనాలో కాస్ట్‌లీ షూట్ పరిస్థితుల్ని దిగజార్చాయని అన్నాడు.
ఇది అందరికీ నచ్చే సినిమా కాదని నాకు ముందే తెలుసు. కథాబలం కంటే పాత్రలతో నడిచే సినిమా. ప్రధాన కథ కంటే ఉప కథ సుదీర్ఘంగా సాగింది.. నిజానికి ఈ సినిమా 120 కోట్లు మించి వసూలు చేయదని కూడా నాకు తెలుసు. అందుకే 80కోట్లు బడ్జెట్ అనుకున్నాను. కానీ అది దాదాపు మూడు రెట్లు పెరిగి 200 కోట్లకు చేరింది.. అని తెలిపాడు. నా అతివిశ్వాసమే దెబ్బ కొట్టింది. సహజంగా బడ్జెట్ కోత వడపోత పద్ధతి ఉంటుంది.. కానీ అది నేను చేయడం మానేశాను అని తెలిపాడు.
ఇటీవల విడుదలైన `సితారే జమీన్ పార్` చిత్రం కూడా దురదృష్టవశాత్తూ ఆశించినంత విజయం సాధించలేదు. రజనీతో కలిసి నటించిన `కూలీ` కూడా నిరాశపరిచింది. అమీర్ ఖాన్ నిరాశనిస్పృహల ఫర్వం యథావిథిగా కొనసాగుతోంది.