AI యుగంలోనూ సినిమాకు భావోద్వేగాలే శ్రీరామరక్ష: ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్
చలనచిత్ర రంగంలో ఎడిటింగ్ (కూర్పు) అనేది కేవలం కొన్ని విజువల్ షాట్లను ఒకదానికొకటి జోడించడం మాత్రమే కాదని శ్రీకర్ ప్రసాద్ వివరించారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృజనాత్మక రంగాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నా సినిమాకు అసలైన జీవం పోసేది మాత్రం కేవలం మనిషి ఇన్నర్ సామర్థ్యం.. భావోద్వేగాలు.. కథా కథనాలేనని ప్రముఖ సీనియర్ ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పాపులర్ ఫిల్మ్ ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఒక ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లో తొమ్మిది సార్లు జాతీయ అవార్డు అందుకున్న లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఎడిటింగ్ ప్రక్రియలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు చలనచిత్ర నిర్మాతలు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై ఆయన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
చలనచిత్ర రంగంలో ఎడిటింగ్ (కూర్పు) అనేది కేవలం కొన్ని విజువల్ షాట్లను ఒకదానికొకటి జోడించడం మాత్రమే కాదని శ్రీకర్ ప్రసాద్ వివరించారు. అది కథలోని పాత్రల స్వభావాన్ని మలచడం,,, ప్రపంచాన్ని సృష్టించడం, సినిమా లయను (రిథమ్) నియంత్రించడం ...ప్రేక్షకుడిని మానసికంగా లీనం చేసే ఒక గొప్ప కళ అని అభివర్ణించారు. ప్రస్తుతం పరిశ్రమను కుదిపేస్తున్న ఏఐ (AI), విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల గురించి చర్చిస్తూ.. టెక్నాలజీ ఎంత పెరిగితే... ఒక ఎడిటర్‌గా ఆలోచించే విధానానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
సినిమా నిర్మాణంలో `ప్రీ-విజువలైజేషన్` (ముందస్తు ఊహారూపం) ప్రాధాన్యతను... ముఖ్యంగా 3D విజువలైజేషన్ పాత్రను ఆయన తన సొంత అనుభవాల ద్వారా విద్యార్థులకు వివరించారు. షూటింగ్‌కు వెళ్లే ముందే ఆడియో-విజువల్ పరంగా ఉన్న అనంతమైన అవకాశాలను అన్వేషించడానికి... పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. దర్శకుడు, ఎడిటర్ మధ్య ప్రారంభ దశలోనే ఇలాంటి సమన్వయం కుదిరితే, అది కథా అభివృద్ధిని బలపరచడమే కాకుండా.. విజువల్ డిజైన్‌ను మెరుగుపరుస్తుందని.. అనవసరమైన షూటింగ్ ఖర్చులను ... సమయాన్ని తగ్గించి అద్భుతమైన క్రియేటవ్ రిజల్ట్ ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిమితులపై శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ, సాంకేతికత అనేది కేవలం అపారమైన అస్సెట్.. నిర్మాణపరంగా లోపాలు లేని అవుట్‌పుట్‌ను మాత్రమే ఇవ్వగలదని, కానీ కథలు చెప్పడంలో మనిషి నిర్ణయాధికారమే ఎప్పుడూ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికంగా కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చినా.., ఒక సినిమాకు లభించే ఎమోషనల్ పవర్ అనేది మానవ జీవితంలోని లోపాలు, బుర్ర తక్కువ నిర్ణయాలు, నమ్మకాల నుండే పుడుతుందన్నారు. ఏఐ సృష్టించే విజువల్స్‌ను సమర్థవంతంగా పరిశీలించడం.. షాట్ కన్‌స్ట్రక్షన్ చేయడం.. వాటికి భావోద్వేగ రూపాన్ని ఇవ్వడంలో భవిష్యత్తు ఎడిటర్లు మరింత పట్టు సాధించాల్సి ఉంటుందని సూచించారు.
సమాజాన్ని గమనించడం (అబ్జర్వేషన్)... సీన్ల నిడివిని నిర్ణయించడం... విజువల్ కొరియోగ్రఫీ వంటి ప్రాథమిక సూత్రాలను విద్యార్థులకు గుర్తుచేశారు. ఒక అర్థవంతమైన సినిమా అనేది నిరంతర ప్రయోగాలు.. తాము చెప్పాలనుకున్న కథపై మేకర్స్‌కు ఉండే నమ్మకం నుంచే పుడుతుందని అన్నారు. భారీ బడ్జెట్ లను కేటాయించే ముందే ఆ ప్రాజెక్ట్ క్రియేటివిటీ.. వాణిజ్యపరమైన అర్హతలను అంచనా వేయడానికి ప్రేక్షకుల ఒపీనియన్ రీసెర్చ్ ఎంతగానో దోహదపడుతుందని శ్రీకర్ ప్రసాద్ ఈ మాస్టర్‌క్లాస్‌లో వెల్లడించారు.