శివన్న, ఉపేంద్ర మల్టీస్టారర్ '45'.. స్టార్స్ ఏమన్నారంటే..
మరో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు అర్జున్ జన్య ప్రతి పాత్రను తానే నటించి చూపించారని మెచ్చుకున్నారు.;
కన్నడ నాట స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న శివ రాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '45 ది మూవీ'. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 1న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ కార్యక్రమంలో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. అర్జున్ జన్య కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ కథ చెప్పారని, ఆ పాయింట్ నచ్చి తానే ఆయన్ని డైరెక్షన్ చేయమని సూచించినట్లు తెలిపారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని అన్నారు. మనం భూమ్మీద ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు కాబట్టి, ఉన్నన్ని రోజులు తోటి ప్రాణులను ప్రేమిస్తూ సంతోషంగా ఉండాలనే మంచి సందేశాన్ని ఈ సినిమా ఇస్తుందని శివన్న పేర్కొన్నారు.
మరో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు అర్జున్ జన్య ప్రతి పాత్రను తానే నటించి చూపించారని మెచ్చుకున్నారు. శివన్నను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో ఈ సినిమాలో చూస్తారని అన్నారు. తనకు కూడా ఎవరూ ఇవ్వని ఒక డేరింగ్ పాత్రను అర్జున్ ఇచ్చారని, తెరపై ఆయన విధ్వంసం సృష్టించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తారని, ఈ సినిమాను కూడా సపోర్ట్ చేయాలని కోరారు.
దర్శకుడు అర్జున్ జన్య మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డానని, ఇదొక కొత్త ప్రపంచంలా ఉంటుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన శివన్న, ఉపేంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో రాజ్ బి శెట్టి నటన కూడా హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది.
నిర్మాత రమేష్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ సినిమాలోని గరుడ పురాణం కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే, ఇంటర్వెల్ నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుందని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శివన్న, ఉపేంద్రల నటన గూస్ బంప్స్ తెప్పిస్తుందని, ప్రస్తుత తరానికి కావాల్సిన మంచి మెసేజ్ ఇందులో ఉందని తెలిపారు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై తెలుగులోనూ ఆసక్తి నెలకొంది. మైత్రి వంటి బడా సంస్థ రిలీజ్ చేస్తుండటంతో థియేటర్ల పరంగానూ సినిమాకు మంచి స్కోప్ దొరికింది. జనవరి 1న ఈ '45' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందో చూడాలి.