గట్టెక్కే ప్లాన్ లో ఆమిర్.. హిరానీ...

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే, వరుసగా రెండు ఫ్లాపులు పడితే మార్కెట్ డౌన్ అయిపోతుంది.;

Update: 2025-12-09 04:17 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే, వరుసగా రెండు ఫ్లాపులు పడితే మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఒకప్పుడు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆమిర్, గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే ఒక భారీ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే '3 ఇడియట్స్' సీక్వెల్. అయితే ఇది కేవలం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ మాత్రమే కాదు, ఆమిర్ ఖాన్ కి, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి చావో రేవో లాంటి ప్రాజెక్ట్ అనే చెప్పాలి.

ఆమిర్ ఖాన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే గత కొన్నాళ్లుగా దారుణంగా పడిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'లాల్ సింగ్ చడ్డా' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానికి ముందు వచ్చిన 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' కూడా నిరాశే మిగిల్చింది. దీంతో ఆమిర్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏదో ఒక హిట్ కాదు, తన స్టామినాను నిరూపించే బ్లాక్ బస్టర్. అందుకే కొత్త ప్రయోగాలు చేయకుండా, తనకు ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన '3 ఇడియట్స్' బ్రాండ్ ను నమ్ముకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది.

మరోవైపు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ పరిస్థితి కూడా గతంతో పోలిస్తే కాస్త డల్ గానే ఉంది. 'మున్నా భాయ్', 'పీకే', 'సంజు' లాంటి సినిమాలతో ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసిన హిరానీ మ్యాజిక్ ఈ మధ్య కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ తో చేసిన 'డంకీ' కమర్షియల్ గా ఓకే అనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం హిరానీ మార్క్ మిస్ అయ్యిందనే కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు హిరానీ కూడా తన పాత ఫార్ములాను, తన ఫేవరెట్ జోన్ ను ఎంచుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో '3 ఇడియట్స్' సీక్వెల్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేయడం ఒక సేఫ్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీ. 15 ఏళ్ల తర్వాత కథ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కచ్చితంగా ఉంటుంది. పైగా ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్.. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ నలుగురూ మళ్ళీ కలుస్తున్నారంటేనే సగం విజయం సాధించినట్లు.

అయితే క్లాసిక్ సినిమాలకు సీక్వెల్ తీయడం అనేది కత్తి మీద సాము లాంటింది. ఏ మాత్రం తేడా వచ్చినా, మొదటి పార్ట్ పరువు కూడా పోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమిర్ కు, హిరానీకి ఇంతకంటే మంచి ఆప్షన్ లేదు. పాత పాత్రలు, ఫ్రెష్ ఎమోషన్స్ తో ఆడియెన్స్ ని కనెక్ట్ చేస్తే.. వీరిద్దరూ మళ్ళీ టాప్ చైర్ లో కూర్చోవడం ఖాయం. 2026 సెకండ్ హాఫ్ లో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు స్క్రిప్ట్ ని ఇంకాస్త పదును పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ సీక్వెల్ ఆమిర్ ఖాన్ కు పూర్వ వైభవాన్ని, హిరానీకి తన పోయిన మ్యాజిక్ ను తిరిగి ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News