2025 రౌండప్.. టాలీవుడ్ విన్నర్ ఎవరు?
2025 సంక్రాంతి చిత్రాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. పొంగల్ కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రిలీజై సందడి చేశాయి.;
మరో 15 రోజుల్లో.. 2025 ఎండ్ అయిపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో కొన్ని మూవీలు హిట్ గా నిలిచాయి. మరి 2025లో బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? విన్నర్ గా నిలిచిన హీరో ఎవరు?
2025 సంక్రాంతి చిత్రాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. పొంగల్ కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రిలీజై సందడి చేశాయి. అందులో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా మిగలగా.. డాకు మహారాజ్ దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2025లో ఫస్ట్ హిట్ మూవీ అదే.
ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవ్వగా.. ఆ తర్వాత నెల మార్చిలో వచ్చిన కోర్టు మూవీ భారీ లాభాలు అందుకుంది. అదే నెలలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సూపర్ హిట్ గా నిలిచి ప్రాఫిట్స్ ను ఆర్జించింది. మే నెలలో రిలీజ్ అయిన వివిధ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచి సత్తా చాటాయి.
ముందుకు హిట్ 3.. అందరినీ మెప్పించి మోస్తరు లాభాలు సాధించింది. ఆ తర్వాత సింగిల్ మూవీ హిట్ గా నిలిచింది. మేకర్స్ కు ప్రాఫిట్స్ అందించింది. శుభం కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేరా మూవీ తెలుగులో అనుకున్న రేంజ్ లోనే ప్రాఫిట్స్ ను అందుకుంది.
జూలై నెలలో వచ్చిన తెలుగు సినిమాలు నిరాశపరిచాయి. కానీ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ డబ్బింగ్ వెర్షన్.. కాసుల వర్షం కురిపించిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆగస్టులో కూడా ఏ తెలుగు చిత్రం హిట్ గా నిలవకపోగా.. సెప్టెంబర్ లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ గా నిలిచింది. భారీ రేంజ్ లో లాభాలు అందించింది.
అదే నెలలో రిలీజ్ అయిన కిష్కింధపురి, మిరాయ్ సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఓజీ మూవీ ఓపెనింగ్స్ విషయంలో సత్తా చాటినా.. ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఈవెన్ ను అందుకోలేదు. అక్టోబర్ లో కే- ర్యాంప్ మూవీ మంచి లాభాలు అందుకుని హిట్ గా నిలిచింది. నవంబర్ లో రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే సక్సెస్ అయింది.
ఇప్పుడు డిసెంబర్ లో అఖండ-2 మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. త్వరలో మరిన్ని సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. కానీ అవన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ చిన్న సినిమాలే. దీంతో ఇప్పటి వరకు.. ఎన్నో చిత్రాలు హిట్స్ గా నిలవగా.. భారీ లాభాలు తెచ్చిపెట్టింది సంక్రాంతికి వస్తున్నాం మూవీనే.
2025లో ఎన్నో సినిమాలు ప్రాఫిట్స్ అందుకున్నా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాతనే ఏదైనా. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో రూపొందిన ఆ సినిమా.. రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు రూ.123 కోట్ల వరకు లాభం ఆర్జించినట్లు అంచనా. ఏదేమైనా 2025 బాక్సాఫీస్ విన్నర్ వెంకీ మామనే.