2006 టాప్ లిస్ట్: పోకిరి కంటే ఎక్కువ రోజులు ఆడిన రామ్ సినిమా.. ఆ రోజులే వేరు!
ఇవి మాత్రమే కాదు, ఆ ఏడాది ఇంకా చాలా సినిమాలు సెంచరీ కొట్టాయి. యాక్షన్, లవ్, ఫ్యామిలీ, భక్తి.. ఇలా అన్ని రకాల జానర్లనూ ఆడియెన్స్ ఆదరించారు.;
ఇప్పుడు సినిమాలు వారం, రెండు వారాలు ఆడితే గొప్ప. కానీ, ఒకప్పుడు అలా కాదు. సినిమా కాస్త బాగుందంటే నెలల తరబడి థియేటర్లలో సందడి చేసేది. ముఖ్యంగా, తెలుగు సినిమాకు అడ్డా లాంటి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక సినిమా 100 రోజులు పూర్తి చేసుకుందంటే, అది సూపర్ హిట్‌తో సమానం. ఆ పోస్టర్ చూస్తేనే ఫ్యాన్స్‌కు వచ్చే కిక్కే వేరు.
ఆ రోజుల్లోకి వెళ్తే, 2006 సంవత్సరం ఇండిస్ట్రీకి ఒక గోల్డెన్ టైమ్ గా అనిపిస్తుంది. ఆ ఒక్క ఏడాదిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా 13 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అది మామూలు విషయం కాదు, అది నిజంగా సినిమాల జాతర. బాక్సాఫీస్ కళకళలాడిపోయింది, ఆడియెన్స్ పండగ చేసుకున్నారు. ఆ ఏడాది యావరేజ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బాగానే ఆడాయి.
కొన్ని సినిమాలైతే 100 రోజులే కాదు, ఏకంగా 150, 200 రోజులు కూడా దాటేశాయి. రామ్ పోతినేని డెబ్యూ ఫిలిం 'దేవదాసు' ఏకంగా 204 రోజులు ఆడి సంచలనం సృష్టిస్తే, మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' 189 రోజులు, సిద్ధార్థ్, జెనీలియాల 'బొమ్మరిల్లు' 184 రోజులు ఆడి క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి.
ఇవి మాత్రమే కాదు, ఆ ఏడాది ఇంకా చాలా సినిమాలు సెంచరీ కొట్టాయి. యాక్షన్, లవ్, ఫ్యామిలీ, భక్తి.. ఇలా అన్ని రకాల జానర్లనూ ఆడియెన్స్ ఆదరించారు. ప్రతీ కథకూ పట్టం కట్టారు. ఆ విజేతల లిస్ట్ చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది.
బొమ్మరిల్లు: 184 రోజులు
దేవదాసు: 204 రోజులు
గోదావరి: 104 రోజులు
హ్యాపీ: 112 రోజులు
లక్ష్మి: 118 రోజులు
పోకిరి: 189 రోజులు
రాఖీ: 105 రోజులు
సైనికుడు: 100 రోజులు
సామాన్యుడు: 105 రోజులు
శ్రీరామదాసు: 120 రోజులు
స్టాలిన్: 100 రోజులు
స్టైల్: 107 రోజులు
విక్రమార్కుడు: 119 రోజులు
ఈ లిస్ట్ చూస్తే, ఆడియెన్స్ టేస్ట్ ఎంత వైవిధ్యంగా ఉండేదో అర్థమవుతుంది. పోకిరి, విక్రమార్కుడు, లక్ష్మి, స్టాలిన్ లాంటి పక్కా మాస్ మసాలా సినిమాలను ఎంజాయ్ చేశారు. అదే సమయంలో 'బొమ్మరిల్లు', 'గోదావరి' లాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాలను గుండెలకు హత్తుకున్నారు. దేవదాసు, హ్యాపీ, స్టైల్ లాంటి యూత్‌ఫుల్ లవ్ స్టోరీలను ఆదరించారు.
'శ్రీరామదాసు' లాంటి భక్తిరస చిత్రాన్ని, 'రాఖీ', 'సామాన్యుడు' లాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను కూడా పెద్ద హిట్ చేశారు. ఇలా ఒకే ఏడాదిలో ఇన్ని సినిమాలు, ఇన్ని జానర్లలో 100 రోజులు ఆడటం అనేది ఇప్పుడు ఊహించడం కూడా కష్టమే. అందుకే, 2006ను తెలుగు సినిమాకు ఒక 'గోల్డెన్ ఇయర్' అంటారు. ఆ రోజులు నిజంగా వేరు.