వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. ఎక్కడ? ఎలాంటి బిజినెస్ ప్రారంభించాలో తెలుసా?
చాలా వ్యాపారాలు ఐడియా బాగోక ఫెయిల్ అవ్వవు, కేవలం తప్పుడు లొకేషన్ వల్లనే నష్టపోతుంటాయి.
సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? కానీ, ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎవరిని అడగాలి? లాభం వస్తుందో లేదో, నష్టపోతానేమో అన్న భయం మిమ్మల్ని వెంటాడుతోందా? అయితే ఇది మీకోసమే. వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి లక్షల రూపాయల పెట్టుబడి, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. సరైన చోట, సరైన బిజినెస్ పెడితే చాలు.. కస్టమర్లు తమంతట తామే వస్తారు. డిమాండ్ ఉన్న లొకేషన్‌ను బట్టి ఎలాంటి వ్యాపారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
లొకేషన్ ముఖ్యం :
చాలా వ్యాపారాలు ఐడియా బాగోక ఫెయిల్ అవ్వవు, కేవలం తప్పుడు లొకేషన్ వల్లనే నష్టపోతుంటాయి. ఎక్కడైతే ప్రజల అవసరం డిమాండ్ ముందే ఉంటుందో, అక్కడ బిజినెస్ పెడితే అమ్మకాలు నిరంతరాయంగా సాగుతాయి, లాభాలు కూడా వేగంగా పెరుగుతాయి. ఇక లొకేషన్ ఆధారంగా సక్సెస్ అయ్యే కొన్ని బెస్ట్ ఐడియాలు ఇవే..
ప్రభుత్వ కార్యాలయాల దగ్గర:
మీరు గమనించే ఉంటారు, ప్రభుత్వ ఆఫీసుల (రిజిస్ట్రేషన్ ఆఫీసులు, కలెక్టరేట్, కోర్టులు) చుట్టుపక్కల ఎప్పుడూ జనాలు ఉంటారు. అక్కడ డాక్యుమెంట్లు, ఐడీ కార్డుల అవసరం ప్రతిరోజూ ఉంటుంది. కాబట్టి, ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర గనుక ఒక జెరాక్స్ మరియు స్టేషనరీ షాప్ పెడితే రోజూ మంచి ఆదాయం సంపాదించవచ్చు.
జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల వద్ద:
ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ అదేనండి ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారి సంఖ్య చాలా పెరిగింది. పొద్దున్నే లేచి జిమ్‌కు వెళ్లేవారు, ఆటలు ఆడేవారు ఎనర్జీ కోసం చూస్తుంటారు. అందుకే, జిమ్‌లు లేదా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల పక్కన ఒక ఫ్రెష్ జ్యూస్ పాయింట్ లేదా ఫ్రూట్ సలాడ్ షాప్ పెడితే బిజినెస్ కుమ్మేయడం ఖాయం.
మెట్రో, బస్టాండ్ స్టేషన్ల దగ్గర:
ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లే వేలాది మంది ప్రతిరోజూ ఉదయాన్నే మెట్రో స్టేషన్లు, బస్టాండ్ల వద్దకు వస్తుంటారు. చాలామందికి ఇంట్లో టిఫిన్ చేసే టైం ఉండదు. ఇక అలాంటప్పుడు స్టేషన్లకు దగ్గర్లో ఒక చిన్న బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ స్టాల్ పెడితే, ఉదయం పూట కస్టమర్ల రద్దీ తట్టుకోవడం కూడా కష్టమే.
యూనివర్సిటీలు, కాలేజీల చుట్టుపక్కల:
విద్యార్థులు ఉండే చోట ఎప్పుడూ ఏదో ఒక డిమాండ్ ఉంటుంది. బయట ఊర్ల నుండి వచ్చే స్టూడెంట్స్ కోసం కాలేజీల దగ్గర పీజీ లేదా హాస్టల్ సర్వీస్ రన్ చేయవచ్చు. అలాగే, నేటి యువత ఎక్కువగా మొబైల్స్ వాడుతుంటారు కాబట్టి, కాలేజీల దగ్గర మొబైల్ యాక్సెసరీస్ మరియు రీఛార్జ్ షాప్ పెడితే నిరంతరం లాభాలు వస్తాయి.
హాస్పిటల్స్ మరియు ఐటీ ఆఫీసుల :
ఆసుపత్రుల దగ్గర ఎప్పుడూ డిమాండ్ తగ్గని ఏకైక బిజినెస్ ఫార్మసీ మెడికల్ షాప్ అలాగే, పెద్ద పెద్ద ఐటీ ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీలు ఉన్న ఏరియాలో రూమ్స్ తీసుకుని ఉండే బ్యాచిలర్స్ కోసం ఇంటి వంట టిఫిన్, మీల్స్ సర్వీస్ అందిస్తే చాలా తక్కువ పెట్టుబడితోనే మంచి బిజినెస్ సెట్ చేసుకోవచ్చు.
బిజినెస్ చేయాలనే భయాన్ని వదిలేసి, మొదట మీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లను గమనించండి. అక్కడ జనాల అవసరం ఏంటో తెలుసుకుని అడుగు ముందుకు వేయండి. ఇక కస్టమర్ల అవసరాన్ని గుర్తిస్తే చిన్న పెట్టుబడితోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు.