ముకేశ్ అంబానీ కొడుకు చెప్పిన ఇంటి విషయం

ఇప్పటికే జియో 2.0 పనులు మొదలైనట్లు చెప్పిన ఆకాశ్ అంబానీ.. ఐఐటీ బాంబేతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రాంపై పని చేస్తున్నామని చెప్పారు

Update: 2023-12-28 11:30 GMT

దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు కమ్ జియో ఇన్ఫో కామ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న అకాశ్ అంబానీ నోట ఆసక్తికర అంశాలు వచ్చాయి. తాజాగా ఆయన ముంబయిలో జరిగిన టెక్ ఫెస్ట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన విజన్ తో పాటు.. ఫ్యూచర్లో చేపడుతున్న ప్రాజెక్టులు.. ఇప్పుడు తాము ఫోకస్ చేసిన పలు అంశాల గురించి మాట్లాడారు. సాధారణంగా ఇలాంటివి కామనే. కానీ.. ఆయన తన మాటల్లో తమ ఇంటి బెడ్రూంకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఎంతలా వాడుకోవచ్చు.. ఇంటి బెడ్రూంలో సైతం వినూత్న సేవలు అందించేందుకు ఎంతలా సాయం చేస్తుందన్న విషయాన్నివెల్లడించారు. తన బావ (సోదరి భర్త) బెడ్రూంలోని పరుపులోని టెంపరేచర్ ను ఒక ఏఐ యాప్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూపించాడని.. అది తనను ఎంతో ఆకర్షించినట్లు చెప్పారు. టెక్నాలజీ ఎంతలా విస్త్రతం అవుతుందన్న దానికి ఇదో ఉదాహరణగా చెప్పారు.

తమ కుటుంబానికి 2024 సో స్పెషల్ గా అభివర్ణించారు. కారణం.. తన సోదరుడు అనంత్ 2024లోనే పెళ్లి చేసుకోవటంగా చెప్పిన ఆకాశ్.. 5జీ ప్రైవేటు నెట్ వర్కును అందజేయటనికి తమ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏ కంపెనీకైనా పరిణామంతో సంబంధం లేకుండా ఒక 5జీ స్టాక్ ను అందించే వీలుందన్నారు. ఇక.. టీవీలకుసంబంధించి ఒక ఓఎస్ ను తయారు చేసే పనిలో తాము ఉన్నట్లు చెప్పారు.

ఇప్పటికే జియో 2.0 పనులు మొదలైనట్లు చెప్పిన ఆకాశ్ అంబానీ.. ఐఐటీ బాంబేతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రాంపై పని చేస్తున్నామని చెప్పారు. ఏఐతో ప్రతీ రంగంలోని ఉత్పత్తులు.. సేవల్లో పెను మార్పులు తీసుకు వచ్చే వీలుందన్న ఆయన.. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వైఫల్యం గురించి ఆలోచించకుండా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దశాబ్దం చివరకు భారతదేశం 6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తాను ఆశిస్తున్నట్లుగా తెలిపారు. పలు అంశాల మీద మాట్లాడిన ఆకాశ్ అంబానీ మాటలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News