• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  100లో 90ఫ్లాపులు.. 100...

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

| టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నా, ఎక్కువ చిత్రాలు నష్టాలనే మిగులుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా విడుదలవుతున్న 240కి పైగా సినిమాల్లో కేవలం 15-18 మాత్రమే విజయాలు సాధిస్తున్నట్లు కథనం పేర్కొంది. హీరోలు, దర్శకుల భారీ పారితోషికాలు, పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, అధిక టికెట్ ధరలతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతోందనే చర్చ మొదలైంది.

By - Sivaji Kontham
Update: 2026-11-20 17:26 GMT

ప్రతి శుక్రవారం థియేటర్ల ముందు కనిపించే భారీ కటౌట్లు- పూలదండలు- బాణసంచా హ‌డావుడి చూసి ఇదంతా తెలుగు సినిమా తిరుగులేని బాక్సాఫీస్ స్టామినా అనుకుంటే గ్ర‌హ‌పాటే. ఏటా వందల కోట్ల వసూళ్లు సాధించే పాన్-ఇండియా చిత్రాలు.. జాతీయ స్థాయిలో పెరుగుతున్న మార్కెట్ వాటా పైకి గొప్పగానే కనిపిస్తాయి. కానీ ఈ రంగుల తెర వెనుక దాగి ఉన్న ఆర్థికప‌ర‌మైన `చేదు నిజం` మాత్రం భయానకంగా ఉంది. ఇక్కడ విడుదలవుతున్న చిత్రాల్లో సుమారు 85 నుంచి 90 శాతం సినిమాలు నష్టాలనే మిగుల్చుతుండగా.. కేవలం కొద్దిమంది స్టార్లు, దర్శకులు మాత్రమే భారీ పారితోషికాలతో లాభపడుతున్నారనే ఆరోప‌ణ‌లున్నాయి. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌ను అడ్డు పెట్టుకుని నిర్మాతా బ‌య‌ట‌ప‌డుతున్నా మునిగిపోయేది చివ‌రికి ఎవ‌రో తెలుసుకుంటే షాక‌వ్వాల్సిందే!

వాస్త‌వ‌ లెక్కలను పరిశీలిస్తే బాక్సాఫీస్ మాయాజాలం వెన‌క గ్యాంబ్లింక్ ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఏటా సుమారు 240కి పైగా నేరుగా తెలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా క్లీన్ హిట్లు, బ్రేక్-ఈవెన్ చిత్రాల సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. తారాస్థాయి అంచనాలు... విపరీతమైన బ్రేక్-ఈవెన్ టార్గెట్లతో వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు తడబడుతుండగా.. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కంటెంట్ రిచ్ చిత్రాలు బయ్యర్లకు లాభాలు అందిస్తున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్నా.. మొదటి వారంలోనే టికెట్ రేట్ల పెంపు ద్వారా వసూళ్లను పెంచి చూపించే ధోరణి అసలు సమస్యను కప్పిపుచ్చలేకపోతోంది.

బడ్జెట్లు రూ. 200 కోట్లు, రూ. 400 కోట్లు దాటిపోవడానికి ప్రధాన కారణం తెరపై కనిపించే నాణ్యత కంటే హీరోలు, దర్శకుల రెమ్యూనరేషనే అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా నిర్మాణ వ్యయంలో పారితోషికాలకు పరిమిత వాటా ఉండాల్సి ఉండగా... టాలీవుడ్‌లో 60 నుంచి 75 శాతం వరకు పెట్టుబడి షూటింగ్ మొదలుకాకముందే కొందరి జేబుల్లోకి వెళ్లిపోతోంది. దీనికి తోడు పక్కా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్‌పైకి వెళ్లడం.. వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు... షూటింగ్ జాప్యంతో పెరిగే వడ్డీ లు ప్రాజెక్టులను మరింత భారంగా మార్చుతున్నాయి.

గ‌త ఏడాది 240-300 సినిమాలు విడుద‌లైతే అందులో 15 -18 మాత్ర‌మే విజ‌యాలు సాధించాయి. మిగ‌తా సినిమాల‌న్నీ న‌ష్టాల‌నే మిగిల్చాయి. అయినా సినిమాలు ఎలా తీయ‌గ‌లుగుతున్నారు? నిర్మాత‌లు బ‌డా హీరోల ఫేస్ వ్యాల్యూని అడ్డు పెట్టుకుని రిలీజ్ ముందే ర‌క‌ర‌కాల హ‌క్కుల రూపంలో త‌మ పెట్టుబ‌డిని తిరిగి వెన‌క్కి తెచ్చుకుంటున్నారు. హీరోలు, ద‌ర్శ‌కుడు భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. కానీ చివ‌రికి అధిక టికెట్ ధ‌ర చెల్లించ‌లేక‌ థియేట‌ర్ల‌కు జ‌నం రాక‌పోవ‌డంతో బ‌య్య‌రు- పంపిణీదారులు ఆ భారాన్ని మోయాల్సిన దుస్థితి నెల‌కొంది.

టాలీవుడ్ లో 200-400 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యితే అందులో 75శాతం పారితోషికాల‌కే వెళ్లిపోతుంటే, సినిమా నాణ్య‌త కోసం ఏం ఖ‌ర్చు చేసిన‌ట్టు? సినిమా ఒక్క స‌న్నివేశం అయినా తీయ‌కుండానే 75 శాతం హీరో, దర్శకుడు, ప్రధాన సాంకేతిక నిపుణుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. కేవ‌లం 25శాతం పెట్టుబ‌డితో సినిమాకి ఎలాంటి నాణ్య‌త వ‌స్తుంది?

ఈ ఆర్థిక అసమతుల్యతలో కూడా `గెలిస్తే నాది- ఓడితే నీది` అన్న ధోరణి పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. సినిమా విజయం సాధిస్తే క్రెడిట్ తీసుకుంటూ తర్వాతి ప్రాజెక్టుకు పారితోషికం పెంచడం లేదా లాభాల్లో భారీ వాటా అడగడం పరిపాటిగా మారింది. కానీ సినిమా డిజాస్టర్ అయి బయ్యర్లు నష్టాల్లో కూరుకుపోతే మాత్రం.. తీసుకున్న భారీ రెమ్యూనరేషన్‌లో వెనక్కి ఇచ్చే దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు కార్పొరేట్ టికెటింగ్ యాప్‌లు..మల్టీప్లెక్స్ వ్యవస్థలు ఫలితంతో సంబంధం లేకుండా తమ వాటాను ప్రేక్ష‌కుల ముక్కు పిండి మ‌రీ గుంజుకుంటున్నాయి. 100 కోట్లు అందుకునే హీరోలు.. 45-50 కోట్లు అందుకుంటున్న ద‌ర్శ‌కులు ఇప్పుడు మ‌న‌కు ఉన్నారు. వీరంతా బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతే అణాపైసా కూడా తిరిగి వెన‌క్కి ఇవ్వ‌ర‌నే టాక్ ఉంది. అయితే హీరోలు దర్శ‌కులు అడిగినంతా ఇచ్చేస్తూ, ఈ పాపంలో నిర్మాత‌లు కూడా భాగ‌స్వాములేన‌నే విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. ఒక‌ప్ప‌టిలా విలువ‌ల‌కు క‌ట్టుబడి ఉండే నిర్మాత‌లు ఈ రోజుల్లో ఎవ‌రున్నారు? అనే ప్రశ్న‌లు ఉన్నాయి. కాంబినేష‌న్లు సెట్ చేసి రిలీజ్ ముందే నిర్మాత సేఫ్ అవుతూ, బ‌య్య‌రు, ప్రేక్ష‌కుడిని ముంచుతున్నాడ‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రేక్ష‌కుడిపై మోపే టికెట్ భారానికి హీరో-ద‌ర్శ‌కుడితో పాటు నిర్మాత కూడా ఒక కార‌ణం.

ఎవ‌రి ధ‌న‌దాహం ఎలా ఉన్నా.. ఈ ఆర్థిక విషవలయంలో నలిగిపోతున్నది ఎగ్జిబిటర్లు- డిస్ట్రిబ్యూటర్లు- సామాన్య ప్రేక్షకులే. ఏడాది పొడవునా థియేటర్లను నడపలేక సింగిల్ స్క్రీన్లు మూతపడుతుండగా.. భారీ రేట్లకు సినిమాలు కొన్న బయ్యర్లు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. భారీ రెమ్యూనరేషన్ల భారాన్ని మోసేందుకు ప్రేక్షకులు అధిక టికెట్ ధరలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్క్రిప్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. పారితోషికాలను వాస్తవ మార్కెట్‌కు అనుగుణంగా మార్చుకుని... లాభనష్టాల్లో భాగస్వామ్యం పెంచినప్పుడే తెలుగు సినిమా పునాదులు పటిష్ఠంగా నిలబడతాయ‌నే విశ్లేష‌ణ సాగుతోంది. కానీ ఈ మార్పు ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుంది.. అనేదే స‌మాధానం లేని ప్ర‌శ్న‌!

Tags:    
  • tollywood 
  • telugucinema 
  • tollywoodbusiness 
  • telugumovies 
  • boxofficereports 

Similar News

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!

2026-11-17 04:00 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. పరిస్థితి ఎలా ఉంది?

2026-11-16 10:25 GMT

Copyright @2026

Powered by Blink CMS