'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!
| ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ డిసెంబర్ 17న విడుదల కానుండగా, ఇండియాలో నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ 17 నుంచే టికెట్ల అమ్మకాలు మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ రీఎంట్రీ, అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ పాత్రలు ఒకే సినిమాలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగు నిర్మాతలు కూడా ముందస్తు బుకింగ్స్ విషయంలో హాలీవుడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలనే చర్చ జరుగుతోంది.
డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ టికెట్లు ఇండియాలో నెల రోజుల ముందే అమ్మకానికి వచ్చేశాయి. నవంబర్ 17 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ముంబైలో అర్ధరాత్రి షోలతో పాటు ఒకే స్క్రీన్‌లో ఎనిమిది షోలు వేయడానికి సిద్ధమవుతున్నారంటే సినిమాపై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పట్టణాల్లోనూ ఈ సినిమా బుకింగ్స్‌పై ఆసక్తి కనిపిస్తోంది.
రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా తిరిగి మార్వెల్ తెరపైకి రావడం అభిమానులకు పెద్ద ఆకర్షణ. అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ పాత్రలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ బుకింగ్స్ విషయంలో మన తెలుగు సినిమా నిర్మాతలను కూడా ప్రస్తావించుకోవాలి. మన దగ్గర వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీస్తారు. పాన్ ఇండియా రిలీజ్ అంటూ భారీ ప్రచారం చేస్తారు. కానీ టికెట్లు అమ్మే సమయానికి మాత్రం చివరి నిమిషం వరకు ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు విడుదలకు ఒక్కరోజు ముందు బుకింగ్స్ తెరుస్తారు.
సెన్సార్, థియేటర్ల కేటాయింపులు వంటి సమస్యలు ఉండొచ్చు. కానీ అవి ముందుగానే పరిష్కరించుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందుగానే టికెట్ కొనుక్కునే అవకాశం ఇవ్వడంలో తప్పేముంది? హాలీవుడ్ సినిమాల నుంచి మన నిర్మాతలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే.