తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!
| మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ నవంబర్ 20న తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దుల్కర్ నటించిన తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపిస్తున్న ‘ఓం’ ఒకే రోజు విడుదల కానున్నాయి. ఒకటి ఎమోషనల్ డ్రామా కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్. వేర్వేరు పరిశ్రమలకు చెందిన సినిమాలు కావడంతో విడుదల తేదీని మార్చుకునే అవకాశం లేకుండా ఈ తండ్రీకొడుకుల బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా మారింది.
ఒకే ఫ్యామిలీ నుంచి అందులోనూ తండ్రీకొడుకుల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం అన్నది జరగదు. అలా జరిగిందంటే? తప్పని పరిస్థితులు తప్ప మరే కారణం ఉండదు. తాజాగా అలాంటి సన్నివేశం ఒకటి ఎదురైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి- ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ ఒకేరోజు తమ సినిమా లతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ తండ్రీకొడుకుల క్లాష్ హాట్ టాపిక్‌గా మారింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు చిత్రం `ఆకాశంలో ఒక తార` నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఎమోషనల్ డ్రామాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో ఇప్పటికే `మహానటి`, `సీతారామం, `లక్కీ భాస్కర్` వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న దుల్కర్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యాడు.
సరిగ్గా అదే నవంబర్ 20వ తేదీన మమ్ముట్టి నటించిన తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ `ఓం` కూడా థియేటర్లలోకి వస్తోంది. ధనుష్ , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో మమ్ముట్టి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో థియేటర్ల వద్ద గట్టి పోటీ తప్పేలా లేదు. మమ్ముట్టి, దుల్కర్‌లకు కేరళతో పాటు తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఉంది.
ఒకవైపు కూల్ అండ్ క్లాస్ ఎమోషనల్ కథతో దుల్కర్ వస్తుంటే.. మరోవైపు మాస్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో మమ్ముట్టి రావడం విశేషం. రెండు సినిమాల జానర్లు వేర్వేరు అయినా? రిలీజ్ డేట్ ఒక్కటే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య సరదా చర్చలు మొదలయ్యాయి. దీంతో ఏ సినిమాది పై చేయి అవుతుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. బహుశా ఇలాంటి పరిస్థితి తండ్రీకొడుకులు ఎదురవ్వడం ఇదే తొలిసారి కావొచ్చు.
అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఇద్దరు ఒకే పరిశ్రమకు చెందిన నటులు. కానీ నటిస్తున్న సినిమాలు వేరు వేరు పరిశ్రమల్లో కావడంతోనే ఈ క్లాష్ తలెత్తిందన్నది కాదనలేని నిజం. ఒకే పరిశ్రమ అయితే ఇరువురు చర్చించుకుని నిర్ణయాలు తీసుకేనే ఛాన్స్ ఉంటుంది. కానీ మమ్ముట్టి-దుల్కర్ సినిమాల విషయంలో అందుకు ఛాన్స్ లేదు. దీంతో సినిమా రిలీజ్ అన్నది పూర్తిగా నిర్మాతల ఇష్టంపై ఆధారపడి ఉంది. కాబట్టి ఈ క్లాష్ ను తండ్రీతనయులు ఎదుర్కోవడం తప్ప చేసేదేం లేదు.