ఆధునిక మనిషి మాదిరే.. నక్షత్రాలు

Update: 2015-08-02 04:41 GMT
ఊహించటానికి కూడా సాధ్యం కాని ఒక కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. మనిషి వ్యవహరించినట్లే నింగిలో అల్లంత దూరాన ఉండే నక్షత్రాలకు సంబంధించిన ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. మనుషుల్లాగే నక్షత్రాల్లోనే ఒక లక్షణం ఉందన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.

ఎక్కడో పుట్టే మనిషి.. కాల క్రమంలో.. బాధ్యతల్లో భాగంగా.. తాను పుట్టిన ఊరుకు సంబంధం లేకుండా ఎక్కడో బతకటం తెలిసిందే. పుట్టిన ప్రదేశానికి.. అనంతరం ఉద్యోగాలు.. తదితరాల కోసం ఎలాగైతే.. సదూర ప్రాంతాలకు పయనమవుతాడో.. కొన్ని నక్షత్రాలు అచ్చు మనిషి మాదిరే వ్యవహరిస్తున్నాయట. కొన్ని నక్షత్రాలు తాము పుట్టిన ప్రదేశాన్ని వదిలి.. తమ కక్ష్యల్ని నాటకీయంగా వదిలేసి.. సదూర ప్రాంతానికి పయనమవుతున్నాయట.

ఇలాంటి నక్షత్రాలు ఒకటో రెండో కాకుండా భారీగానే ఉన్నాయట. దీంతో.. మన పాలపుంత గెలాక్సీకి సంబంధించిన సరికొత్త చిత్ర పటాన్ని తయారు చేశారు. ఇప్పటివరకూ మనకున్న అవగాహన ప్రకారం.. నక్షత్రాలు తమ కక్ష్యలోనే ఉంటాయని భావించే వాళ్లం. అయితే.. అందులో నిజం లేదని.. కొన్ని నక్షత్రాలు తమ కక్ష్యను మార్చుకొని.. దూర తీరాలకు పయనిస్తున్న కొత్త విషయాన్ని గుర్తించారు. ఈ ఆసక్తికర విషయాన్ని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు మైఖేల్ హేడెన్ చెబుతున్నారు.

పాలపుంతలోని నక్షత్రాల్లో 30 శాతం వరకూ తాము పుట్టిన ప్రదేశానికి చాలా దూరంగా ఉంటున్నట్లు గుర్తించినట్లు ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. నక్షత్రాలు మరణించినప్పుడు వాటి మూలకాలు వాయువుల్లో కలిసి పోతాయని.. వీటితో మరో కొత్త నక్షత్రం జన్మిస్తున్న విషయన్ని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో నక్షత్రాల జననం ఎక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. తాజా ఆవిష్కరణతో ఆయన గెలాక్సీ పాలపుంతకు సంబంధించిన కొత్త పటాన్ని రూపొందించారు.
Tags:    

Similar News