గిరి'జనం'లో జనసేనకు పట్టెంత.. ?
| గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యాలపై జనసేన దృష్టి పెట్టడం పరిషత్ ఎన్నికల్లో పార్టీకి కలిసొచ్చిందని నేతలు భావిస్తున్నారు. కురుపాం, అల్లూరి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించగా, పోలవరంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన 36 జడ్పీటీసీ, 644కు పైగా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది.
ఇటీవల కాలంలో గిరిజన ప్రాంతాలపై పట్టు పెంచుకునేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. జల్‌జీవన్ మిషన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం.. అలాగే, రహదారుల నిర్మాణానికి, విద్యుత్ సరఫరా వంటి వ్యవస్థ వంటివి పునరుద్ధరిస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పెరుగుతోంది. మరి ఇదిఓటు బ్యాంకుగా మారిందా? గిరిజనుల హృదయాలను జనసేన కైవసం చేసుకుందా? చూద్దాం..
గతంలో కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి అనుకూలంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో తాజాగా జరిగిన పరిషత్ పోరు జనసేనకు అనుకూలంగానే ఉందని చెప్పాలి ఒక్క పోలవరంవంటి ప్రాంతంలో మాత్రమే భిన్నమైన తీర్పు రాగా.. మిగిలిన గిరిజన ప్రాంతాల్లో సేనాని పట్టు నిలుపుకొన్నారు. గిరిజన ప్రాంతాల్లో జనసేన గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా పోటీ చేసిన జనసేన, గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన స్థానాలను దక్కించుకుంది.
గిరిజన ఏజెన్సీ నియోజకవర్గాలైన కురుపాం, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు స్థానిక గిరిజన ఓటర్ల మద్దతుతో మంచి విజయాన్ని సాధించారు. పోలవరంలో ఒకింత ఆశించిన మేరకు ఫలితం రాకపోవడం వెనుక ఎమ్మెల్యే ప్రభావం ఉందన్న చర్చ ఉంది. కానీ.. మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా పవన్‌తో గిరిజనులు కనెక్ట్ అయిన ప్రాంతాల్లో బలమైన తీర్పు వచ్చింది. మొత్తం పరిషత్ ఫలితాల్లో టీడీపీ తర్వాత కూటమిలో జనసేన పార్టీ అత్యధిక స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఎన్నికల్లో జనసేన 36 జడ్‌పీటీసీ స్థానాలను, 644కు పైగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో జనసేన అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శించారు. ఉదాహరణకు, పల్నాడు పరిధిలోని క్రోసూరు జడ్‌పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 30,273 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలే ఈ విజయానికి ప్రధాన కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.