చిరంజీవి ఎవరినీ తొక్కడు..ఎక్కుతాడు.. ఎక్కిస్తాడు.. మెగా బ‌ర్త్‌డేలో బండ్ల‌న్న ఎమోష‌న‌ల్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు..అది అభిమానుల ఆత్మీయ కలయిక.

Update: 2026-08-22 05:07 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు..అది అభిమానుల ఆత్మీయ కలయిక. ఇటీవల జరిగిన చిరంజీవి 71వ బర్త్ డే వేడుకల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారితీశాయి. సాధారణంగా ఏ వేదిక మీదైనా తనదైన శైలిలో ఆవేశంగా, ఆత్మీయంగా మాట్లాడే బండ్లన్న.. ఈ వేదికపై మాత్రం దైవసాక్ష్యంగా మాట్లాడుతూ మెగాస్టార్ వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రాన నిలిపారు. ట్రోలర్స్ - విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. చిరంజీవి మహోన్నతమైన మనసును ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఈ సభలో బండ్ల గణేష్ చిరంజీవి లోని అరుదైన కరుణా గుణాన్ని గూర్చి భావోద్వేగంగా మాట్లాడారు. పాతికేళ్ల క్రితం ఎలాంటి అడ్రస్ లేని తను ఇల్లు కట్టుకున్నప్పుడు.. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నా కానీ 50 కిలోమీటర్లు ప్రయాణించి షాద్ నగర్ వచ్చి ఆశీర్వదించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. అలాగే చెల్లెలికి నడుము నొప్పి వస్తే స్వయంగా జెండూబామ్ రాసే అన్నయ్యగా... 85 ఏళ్ల వయసున్న తల్లికి స్వయంగా కాళ్లు ఒత్తుతూ కంటికి రెప్పలా చూసుకునే ఉత్తమ కుమారుడిగా చిరంజీవి వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ స్థాయిలోని ఒక సూపర్ స్టార్ ఇంతటి సామాన్యమైన అనుబంధాలను కాపాడుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనమని పేర్కొన్నారు.

పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని... తన వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్‌ను అందించడం చిరంజీవి వ్యక్తిత్వానికే దక్కిన అదృష్టమని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా... ఒక కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నై నగరంలో అడుగుపెట్టి నిరంతర శ్రమతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చెప్పారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన జీవిత చరిత్రను రాబోయే తరాలకు ప్రేరణగా నిలిచేలా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.

చిరంజీవి ఇతరుల అవకాశాలను తొక్కేస్తున్నారంటూ కొందరు చేస్తున్న విమర్శలపై బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా స్పందించారు. చిరంజీవి ఎవరినీ తొక్కడు..ఎక్కుతాడు.. ఎక్కిస్తాడు.. లేపి సముచిత స్థానంలో కూర్చోబెడతాడు! అని మాస్ స్టైల్ లో స్పష్టం చేశారు. టాలెంట్, నిజాయితీ, కష్టం ఉన్న ప్రతి ఒక్కరినీ చిరంజీవి ప్రోత్సహించారని.. ఆయన ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే తనలాంటి సామాన్యులకు ఇండస్ట్రీపై నమ్మకం ఏర్పడేది కాదని వెల్లడించారు. ప్రతిభ ఉన్నవారికి దోసిళ్లతో అవకాశాలు ఇచ్చే సద్గుణం చిరంజీవి సొంతమని కొనియాడారు.

చివరగా.. ప్రస్తుత సమాజంలో స్వార్థ రాజకీయాలు, అవకాశవాదం ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ బండ్లన్న తన ప్రసంగాన్ని ముగించారు. ``ఏరు దాటేదాకా ఓరి మల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా`` అన్నట్లుగా ప్రవర్తించే మనుషులు ఉన్న ఈ రోజుల్లో చిరంజీవి వెనుక ఎంతమంది ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? అని వ్యాఖ్యానించారు. కొందరు చేసే అల్పసంతోషపు కామెంట్ల వల్ల ఆయన సాధించిన మహోన్నత స్థానం చెక్కు చెద‌ర‌దు. రామాయణం, భగవద్గీతల వంటి ఆయన ఉజ్జ్వల చరిత్ర ఎప్పటికీ చెరిగిపోద‌ని బండ్ల‌న్న‌ భావోద్వేగంగా చెప్పారు.




Tags:    

Similar News