సినిమా చూసి సందీప్ బీర్ ఓపెన్ చేశాడు

సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న రోమాంచకం సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

Update: 2026-08-21 14:50 GMT

సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న రోమాంచకం సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ప్రణయ్.. దర్శకుడు పడ్డ కష్టం, ఔట్‌పుట్ చూశాక సందీప్ రియాక్షన్ లాంటి విషయాలను రివిల్ చేశారు.

దాదాపు పదిహేను నెలల క్రితం దర్శకుడు వేణుగోపాల్ ఈ కథ చెప్పాడని, అప్పుడు అన్ని పాత్రలను తనే యాక్ట్ చేసి చూపించడంతో వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పానని ప్రణయ్ వెల్లడించారు. నటీనటులందరికీ మూడు నెలల పాటు రిహార్సల్స్ చేయించి ఈ సినిమాను తెరకెక్కించారని ఆయన అన్నారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించిందని ప్రణయ్ కాన్ఫిడెంట్ గా చెప్పారు.

షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎండల్లో చెన్నై సముద్రం పక్కన పది రోజుల పాటు షూటింగ్ చేశారని, ఆ సమయంలో తాను స్పిరిట్ పనుల్లో బిజీగా ఉండి అక్కడికి వెళ్లలేకపోయానని ప్రణయ్ తెలిపారు. ఆ షెడ్యూల్ ముగించుకుని వచ్చిన తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డిని చూసి తాను గుర్తుపట్టలేదని, ఎండకు ఆయన అంతలా నల్లబడిపోయాడని సరదాగా చెప్పుకొచ్చారు.

బడ్జెట్ విషయంలో కూడా దర్శకుడు చాలా పక్కాగా ఉన్నాడని ప్రణయ్ ప్రశంసించారు. మొదటి రోజు పేపర్ మీద ఏ బడ్జెట్ రాసిచ్చాడో కరెక్ట్ గా అందులోనే సినిమా పూర్తి చేశాడని స్పష్టం చేశారు. కష్టమైన లొకేషన్లలో కెమెరామెన్ పవన్ అద్భుతంగా షూట్ చేశాడని టెక్నికల్ టీమ్ కు క్రెడిట్ ఇచ్చారు. ఇక సినిమా చూశాక సందీప్ రియాక్షన్ ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ప్రిలిమినరీ కట్ చూశాక సందీప్ తనకు స్వయంగా బీర్ ఓపెన్ చేసి ఇచ్చాడని ప్రణయ్ నవ్వుతూ చెప్పారు.

ఇదే ప్రెస్‌మీట్‌లో యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు ప్రణయ్ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. మీ జీవితంలో రోమాంచకం అనిపించిన మూమెంట్ ఏంటి అని అడగ్గా.. తన తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే తన లైఫ్ లో జరిగిన అలాంటి మూమెంట్ అని ఆయన బదులిచ్చారు. దీనికి ముందు కూడా ఎప్పుడూ ఇలాంటివి జరగలేదని సరదాగా క్లారిటీ ఇచ్చారు.

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ పరంగా సాలిడ్ బ్యాకింగ్ దొరికింది. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారని ప్రణయ్ వెల్లడించారు. సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.



Full View


Tags:    

Similar News