అందరి లెక్కలు సెట్ చేస్తున్న టాలీవుడ్
అఖిల్‌కు ‘లెనిన్’ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఏజెంట్’ తర్వాత వచ్చిన పెద్ద గ్యాప్‌కు ఆ సినిమా సమాధానం ఇచ్చింది.
ఈమధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ ను చూస్తే వరుసగా సినిమాలు ఆడుతున్నాయనే మాట కంటే ఇంకో లెక్క ఎక్కువగా కనిపిస్తోంది. హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న హీరోలకు ఒక్కొక్కరికి సరైన సినిమా పడుతోంది. అఖిల్‌కు ‘లెనిన్’, వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ‘ఇరుముడి’కి వస్తున్న మొదటి టాక్ చూస్తే రవితేజ కూడా అదే లిస్టులో చేరేలా ఉన్నాడు.
అఖిల్‌కు ‘లెనిన్’ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఏజెంట్’ తర్వాత వచ్చిన పెద్ద గ్యాప్‌కు ఆ సినిమా సమాధానం ఇచ్చింది. వరుణ్ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. వరుసగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిస్ అయిన తర్వాత ‘కొరియన్ కనకరాజు’ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఇద్దరికీ హిట్ రావడం మాత్రమే కాదు.. తర్వాతి సినిమాల మీద మళ్లీ నమ్మకం పెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు రవితేజ ముందు కూడా అదే సీన్. ‘ఇరుముడి’ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మొదటి షోల తర్వాత సోషల్ మీడియాలో ఎమోషన్, క్లైమాక్స్, రవితేజ పర్ఫామెన్స్ గురించి మంచి మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వరుసగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా లాంగ్ రన్ తీసుకొస్తే మాత్రం ఈ రెండు నెలల కథలో ఇదే పెద్ద కమ్‌బ్యాక్ అవుతుంది. అయితే మొదటి రోజు టాక్‌ను వీకెండ్ తర్వాత కూడా హోల్డ్ చేయాలి.
ఇక్కడ సూర్యను కూడా మర్చిపోలేం. ఆయనకు తెలుగులో మార్కెట్ కొత్తది కాదు. ‘గజిని’, ‘సింగం’ రోజుల నుంచే ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఈమధ్య ప్రతి సినిమా తెలుగులో అదే స్థాయిలో పని చేయలేదు. ఇప్పుడు వెంకీ అట్లూరి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం, సినిమా రెండో వారంలోకి వెళ్లడం సూర్యకు ఇక్కడ మళ్లీ మంచి రన్ ఇచ్చింది.
మధ్యలో కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా తన రన్‌ను కొనసాగించింది. అంటే ఈ రెండు నెలల్లో ఒకే రేంజ్ హీరోలు, ఒకే జానర్ సినిమాలు ఆడలేదు. ఒకవైపు హారర్ కామెడీ, మరోవైపు ఫ్యామిలీ సినిమా, ఇంకోవైపు ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అందుకే ఇప్పుడు కనిపిస్తున్న ట్రాక్ లో ఒక్క ట్రెండ్‌కు కట్టేయడం కష్టం. సినిమాకు తగ్గ టాక్ వస్తే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారన్నది మాత్రం వరుస రిలీజ్‌లతో కనిపిస్తోంది. అందుకే ఈ టైమ్‌ను టాలీవుడ్ హిట్ సీజన్ అనడం కంటే హీరోల రికవరీ సీజన్ అనడమే కాస్త సరిపోతుంది.