రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..
| తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాల్సి ఉండగా, ధరల పెరుగుదల నేపథ్యంలో రూ.5 వేలు ఇచ్చినా తక్కువేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వానికి ఈ డిమాండ్ కొత్త చిక్కులు తెచ్చిపెట్టగా, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం కల్పించింది.
ప్రశాంతంగా ఉంటే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది నాయనలారా.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మూడు తిట్లు.. ఆరు వెన్నుపోట్లు అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. ఆది నుంచి అది మనకు అలవాటాయే.. కాంగ్రెస్ లో క్రమశిక్షణ చాలా తక్కువ.. స్వేచ్ఛ ఎక్కువ.. పీకలదాకా వస్తే తప్ప ఏ నేతను శిక్షించరు.. అందుకే కాంగ్రెస్ నేతలు ఆకాశమే హద్దుగా సొంత ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసే రాజకీయం చేస్తుంటారని రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం ఇప్పటికీ ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో విపక్షాల విమర్శలకు అస్సలు కొదవ లేదు. కానీ అసలు మజా ఎప్పుడొస్తుందయ్యా అంటే.. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలే ఫ్రెండ్లీ ఫైర్ మొదలుపెట్టినప్పుడు.. సరిగ్గా ఇప్పుడిదే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు గాంధీ భవన్ నుంచి సచివాలయం వరకు చర్చనీయాంశమయ్యాయి.. మన లోకల్ మీడియాకు ఏసుకోవడానికి మంచి స్టఫ్ ఇచ్చినట్టైంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చేయూత’ పెన్షన్ హామీ ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాల్సి ఉంది. దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. పెరిగిన నిత్యావసర ధరలు.. మందుల ఖర్చుల నేపథ్యంలో రూ.2 వేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగితే అది సాధారణ విజ్ఞప్తి అయ్యేది.. కానీ రూ.4 వేలు కాదు అధ్యక్ష.. రూ.5 వేలు ఇచ్చినా తక్కువే అని ఆయన కొత్త పల్లవి అందుకోవడంతో రాజకీయ వేడి రాజుకుంది.
రాజగోపాల్ రెడ్డి మాటల్లో ప్రజావేదన.. పేదల పట్ల సానుభూతి స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. నిజమే పెరుగుతున్న ధరల ముందు రూ.2 వేలు ఏ మూలకు సరిపోతాయి? కానీ ఇక్కడే ప్రభుత్వానికి అసలు చిక్కు వచ్చి పడింది.
ఒకవైపు ఆరు గ్యారంటీల అమలు.. మరోవైపు రాష్ట్ర అప్పులు.. ఇంకోవైపు ఖజానాకు ఆదాయం సమకూర్చే మార్గాల అన్వేషణ.. ఇలా ప్రభుత్వం ఇప్పటికే అంకెల గారడీలో తలమునకలై ఉంది. రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఏకంగా టార్గెట్‌ను రూ.5 వేలకు పెంచేయడం విశేషం హామీ ఇచ్చిన నాలుగు వేలకే దిక్కులేదు.. ఇప్పుడీ ఐదు వేల గోల ఏంటి? అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు ఏదైనా డిమాండ్ చేస్తే గత ప్రభుత్వమే ఖజానా ఖాళీ చేసింది అంటూ అధికార పక్షం కౌంటర్ ఇవ్వగలదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా పెన్షన్ బాంబ్ పేల్చడంతో రేవంత్ సర్కార్ అటు సమర్థించుకోలేక.. ఇటు ఖండించలేక ఇరకాటంలో పడింది. విపక్షాలకు మాత్రం ఎలాంటి శ్రమ లేకుండానే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఒక బలమైన అస్త్రం దొరికినట్లయింది.
ప్రజా సంక్షేమం అనేది ఒక ఎత్తు.. ఆర్థిక క్రమశిక్షణ మరో ఎత్తు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించినట్లు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచి ప్రజల మన్ననలు పొందుతారా.. లేక కనీసం ఇచ్చిన రూ.4 వేల హామీనైనా నిలబెట్టుకుని గట్టెక్కుతారా అన్నది వేచి చూడాలి. ఇలా రేవంత్ రెడ్డికి బయటి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతల సూచనలే ఎక్కువ చెమటలు పట్టించేలా ఉన్నాయి...