చివరి మాటతోనే నిందితులను పట్టేశారు.. రూపారెడ్డి హత్య కేసులో కీలక ఆధారం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసును పోలీసులు ఛేదించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.

Update: 2026-08-20 06:48 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసును పోలీసులు ఛేదించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ఎలాంటి క్లూ లభించని కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా పరిష్కరించడానికి హతురాలు రూపారెడ్డి చివరిగా మాట్లాడిన మాటలే కీలక ఆధారంగా పనిచేశాయని చెబుతున్నారు. ఇంట్లో దొంగతనానికి వచ్చిన విద్యార్థి తనను చూసిన ప్రిన్సిపల్ పై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే దాడికి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోనులో మాట్లాడుతూ చివరగా ‘బాబూ.. ఏయ్ బాబూ’ అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత ఫోన్ పెట్టేయడమే కాకుండా, మళ్లీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదని పోలీసుల విచారణలో తెలుసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారించగా, కేసు చిక్కుముడి వీడిందని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 11న రూపారెడ్డి ఒక్కరే ఉండగా, ఇంట్లో దొంగతనానికి వచ్చిన విద్యార్థిని ఆమె చూసినట్లు భావిస్తున్నారు. ముఖానికి మాస్క్ ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడిన వారిని పిల్లాడిగా గుర్తించి రూపారెడ్డి ‘బాబూ.. ఏయ్ బాబూ’ అంటూ పిలిచారని, ఆ సమయంలో ఫోనులో మాట్లాడుతున్నందున రూపారెడ్డి చిన్నమ్మ కూడా ఆ మాటలను గుర్తించుకుని పోలీసు విచారణలో హతురాలి చివరి సంభాషణను తెలియజేశారని అంటున్నారు. రూపారెడ్డి హత్య తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సుమారు 80 మందిని విచారించారు. ఇందులో ఆమె భర్తతోపాటు చివరిగా ఫోనులో మాట్లాడిన ఆమె చిన్నమ్మ కూడా ఉన్నారు.

అయితే ఈ విచారణలో రూపారెడ్డి తనతో చివరగా మాట్లాడుతున్నప్పుడు ‘బాబూ.. ఏయ్ బాబూ’ అంటూ గట్టిగా అరవడం వినిపించిందని హతురాలి చిన్నమ్మ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు రూపారెడ్డి మాటతీరును తెలుసుకోగా, ఆమె తన పాఠశాలలో చదివే పిల్లలను బాబూ అంటూ పిలుస్తారని గుర్తించారు. ఈ క్రమంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై అనుమానం వ్యక్తం అయిందని, ఇద్దరు విద్యార్థులు హత్య జరిగిన మరునాడు నుంచి స్కూల్ కి రాకపోగా, డబ్బు జల్సాగా ఖర్చు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడిందని చెబుతున్నారు.

దీంతో పోలీసులు స్కూలుకు రాకుండా తిరుగుతున్న విద్యార్థులను పట్టుకోగా, వారివద్ద రూ.1.54 లక్షల నగదు, రూపారెడ్డి ఐఫోన్, రెండు స్మార్టు ఫోన్లు గుర్తించారు. పట్టుబడిన నగదులో 500 వందల రూపాయల కాగితాలకు రక్తమరకలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు భారీగా డబ్బు దొంగిలించాలనే ఆలోచనతో ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు రూపారెడ్డి ఇంటికి వెళ్లారని, పెరటి ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించి డబ్బు కాజేయాలని ప్లాన్ చేయాలని చూశారని ఎస్పీ వివరించారు. ఈ సమయంలో రూపారెడ్డి విద్యార్థిని గుర్తించి కేకలు వేయగా, వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్లు ఎస్సీ వెల్లడించారు. నిందితులు ఇద్దరు బాలలు కావడంతో జువెనైల్ హోమ్ కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.

Tags:    

Similar News