వైసీపీ నేత‌ల‌కు ఆ ద‌మ్ముందా?: చంద్ర‌బాబు ఫైర్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన గూప్ -1 ప‌రీక్ష‌, అనంత‌ర నియామ‌కాల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే.

Update: 2026-08-20 06:46 GMT

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన గూప్ -1 ప‌రీక్ష‌, అనంత‌ర నియామ‌కాల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. వీటిని నిర్ధారిస్తూ.. ఇటీవ‌ల ద‌ర్యాప్తు సంస్థ హైకోర్టుకు 2 వేల పేజీల‌తో కూడిన నివేదిక‌ను అందించింది. ప్రిలిమ్స్ ఎలా ఉన్నా.. ప్ర‌ధాన‌మైన మెయిన్స్ విష‌యంలో అత్యంత దారుణాలు చోటు చేసుకున్నాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థుల‌తోనే ఆయా స‌మాధాన ప‌త్రాల‌ను దిద్దించి మార్కులు వేయించార‌ని తెలిపింది.

అలానే.. అధికారిక భ‌వ‌నం కాకుండా.. ప‌ర్యాట‌క ప్రాంత‌మైన హాయ్‌ల్యాండ్‌లో పేప‌ర్ల దిద్దుబాటు ప్రక్రియ చేప‌ట్టార‌ని పేర్కొంది. అంతేకాదు.. ప్లంబ‌ర్లు, టాపీ మేస్త్రీలు, అంగ‌న్‌వాడీ ఆయాలు కూడా మూల్యాంక‌నంలో పాల్గొన్నార‌ని తెలిపింది. ఇక‌, స‌మాధాన‌ ప‌త్రాల్లో ఎలాంటి దిద్దుబాట్లు ఉండ‌రాద‌ని.. కానీ, 60 మంది పేప‌ర్ల‌లో దిద్దుబాట్లు క‌నిపించాయ‌ని కూడా ద‌ర్యాప్తు సంస్థ వివ‌రించింది. కాగా.. ఈ నివేదిక‌ను స్వీక‌రించిన హైకోర్టు.. విచార‌ణ‌ను వాయిదా వేసింది. ఇదిలావుంటే.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన గ్రూప్ - 1 అక్ర‌మాల వ్య‌వ‌హారంపై తాజాగా అసెంబ్లీలో చ‌ర్చ పెట్టారు.

ఈ చ‌ర్చ‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన అతి పెద్ద ఘోరం ఇదేనని పేర్కొన్నారు. వేలాది మంది అభ్య‌ర్థుల జీవితాల‌ను త‌ల్ల‌కింద‌లు చేశార‌ని విమ‌ర్శించారు. ప్లంబ‌ర్లు, టాపీ మేస్త్రీలు, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌తో పేప‌ర్ల‌ను దిద్దించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు. ద‌ర్యాప్తు సంస్థ అన్నికోణాల్లోనూ విచారించింద‌ని.. విద్యార్థుల నుంచి కూడా వివ‌ర‌ణ కోరింద‌ని తెలిపారు. అస‌లు.. ప‌రీక్ష‌లు రాసిన వారు ఎక్క‌డైనా పేప‌ర్లు దిద్దుతారా? అని ప్ర‌శ్నించారు. కానీ, వైసీపీ హ‌యాంలో మాత్రం అలానే జ‌రిగింద‌ని అన్నారు. గ్రూప్ 1 ప‌రీక్ష రాసిన వారిలో లెక్చ‌ర‌ర్లు కూడా ఉన్నార‌ని.. చివ‌రికి వారిని కూడా మూల్యాంక‌నానికి పిలిచార‌ని తెలిపారు.

క‌ఠినంగా శిక్షిస్తాం..

గ్రూప్ 1 అక్ర‌మార్కుల‌ను వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. దీనిలో త‌ప్పులు జ‌ర‌గ‌లేద‌ని చెప్పే ధైర్యం వైసీపీ నేత‌ల‌కు ఉందా? అని స‌వాల్ రువ్వారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలాంటి త‌ప్పుల‌ను క్ష‌మించేది లేద‌ని.. క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పేర్కొన్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాల‌తో ముడిప‌డిన ఈ వ్య‌వ‌హారాన్ని చూస్తూ వ‌దిలేయ‌బోమ‌న్నారు. దీనిపై చ‌ర్చించేందుకు వైసీపీ నేత‌లు త‌ప్పించుకుని పారిపోయార‌ని వ్యాఖ్యానించారు. డీఎస్సీని పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించామ‌ని.. కోర్టు కూడా అంగీక‌రించింద‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News