గ్రూప్ -1 ఎఫెక్ట్: బొత్స ఇరుక్కుపోతారా..?!
తాజాగా గ్రూప్-1 వ్యవహారం ఏకంగా అప్పటి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చుట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికలు గడిచి రెండున్నరేళ్లు అయిపోయాయి. ఈ రెండున్నరేళ్ల కాలంలో వైసీపీ పుంజుకున్నది ఏమీ కనిపించడం లేదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న కేసులు.. పార్టీని పుట్టిముంచే పరిస్థితిలోకి నెట్టడం ఖాయమని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇవేవీ చిన్నాచితకా కేసులు కావని కూడా అంటున్నారు. తాజాగా గ్రూప్-1 వ్యవహారం ఏకంగా అప్పటి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చుట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
వాస్తవానికి గ్రూప్-1 నిర్వహించిన సమయంలో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ రామాంజనేయులపై ఇప్పటికే కేసులు కొనసాగుతున్నాయి. ఇక, ఇప్పుడు దీనికి మూల కారకులు ఎవరనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే నాటి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ చుట్టూ కేసు అల్లుకోనుందని అంటున్నారు. తాజాగా మండలిలోనూ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''ముందు గ్రూప్-1 గురించి ఆలోచించుకోండి బొత్సగారూ.. పోలీసులు ఎప్పుడు తలుపు తడతారో.. ఏమో!'' అని వ్యాఖ్యానించారు.
సో.. దీనిని బట్టి ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ కేసునుంచి తప్పించుకునే అవకాశం లేదని అంటున్నారు. అదే సమయంలో ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ పేరు కూడా ఈ కేసులో వినిపిస్తోంది. గతంలో ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే ఈ అవకతవకలు జరిగాయన్న వాదన ఉంది. ఈ క్రమం లో ఆయనపై కూడా కేసు నమోదు కావొచ్చని అంటున్నారు. అయితే.. ఆయన తన సొంత రాష్ట్రం అస్సాంకు వెళ్లిపోయారు. ఇక, ఇప్పటికే మద్యం కేసు వైసీపీని తరుముతూనే ఉంది.
మరోవైపు.. గనులు, ఇసుక వ్యవహారంపై కూడా దర్యాప్తును ప్రభుత్వం ఆదేశించనుంది. ఇలా.. అన్ని వైపుల నుంచి వైసీపీకి ఇరకాటం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పోనీ.. వీటిని రాజకీయ కుట్రలు అనిదాటేసేందుకు కూడా వైసీపీకి అవకాశం లేకపోవడం గమనార్హం. ఎందుకంటే.. పక్కా ఆధారాలు.. సాక్షులు.. ఇలా అన్నీ ఉండడంతో వైసీపీ నానాటికీ ఊబిలోకి దిగిపో తోందన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.