తొలిసారి.. 3వసారి.. మహిళల ప్రపంచ కప్ ఎవరు గెలిచినా చరిత్రే!
గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించడంతో ఈసారి కొత్త చాంపియన్ ఆవిర్భావం ఖాయమైంది.;
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మహిళల ప్రపంచ కప్ ఫైనల్ దశకు వచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించడంతో ఈసారి కొత్త చాంపియన్ ఆవిర్భావం ఖాయమైంది. దీనికిముందే మొదటి సెమీస్ లో దక్షిణాఫ్రికా అమ్మాయిలు ఇంగ్లండ్ ను ఇంటికి పంపించి ఫైనల్ కు చేరారు. ఇక ఆదివారం జరిగే తుది సమరంలో భారత్, దక్షిణాఫ్రికా ఎవరు గెలిచినా మొదటిసారి ప్రపంచ కప్ ను అందుకున్నట్లు అవుతుంది. మహిళల క్రికెట్ లో కొత్త ప్రపంచ చాంపియన్ పుడుతుందన్నమాట. అసలు పురుషుల వన్డే ప్రపంచ కప్ 1975లో మొదలైతే.. 1973లోనే మహిళల ప్రపంచ కప్ నిర్వహించారు అంటే నమ్ముతారా? అయితే, ఇది నిజమే. 1973 తర్వాత 1978, 1982, 1988, 1993, 1997, 2000, 2005, 2009, 2013, 2017, 2022లో వన్డే ప్రపంచ కప్ లు జరిగాయి. ప్రస్తుతం 13వ సారి మెగా టోర్నీ నడుస్తోంది.
రెండోసారే భారత్ ఆతిథ్యం..
1978లో జరిగిన రెండో ప్రపంచ కప్ నకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత 1997, 2013లోనూ మన దేశంలోనే ఈ మెగా టోర్నీ జరిగింది. ఇప్పుడు నాలుగోసారి హోస్ట్ గా ఉంది. అయితే, టీమ్ ఇండియా ఇంతవరకు కప్ నెగ్గలేదు. 2005లో హైదరాబాదీ మిథాలీ రాజ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో, 2017లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మూడోసారి దక్షిణాఫ్రికాను ఎదుర్కోనుంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే ఆ జట్టు తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. 2000, 2017, 2022లలో సెమీఫైనల్ కు చేరినా అంతకుమించి ముందుకెళ్లలేదు.
-మొత్తమ్మీద 12 ప్రపంచ కప్ లలో ఏడుసార్లు ఆస్ట్రేలియా (1972, 1982, 1988, 1997, 2013, 2022), నాలుగుసార్లు ఇంగ్లండ్ (1973, 1993, 2009, 2017), ఒకసారి న్యూజిలాండ్ (2000) విజయం సాధించాయి. 13వ ప్రపంచ కప్ లో మాత్రం కొత్త చాంపియన్ ను చూడనున్నాం.
మళ్లీ దక్షిణాఫ్రికా...
పురుషుల క్రికెట్ లో నిరుడు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమ్ ఇండియా జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్ లోనూ ఈ రెండు దేశాల జట్లే తలపడనున్నాయి.
కొసమెరుపుః దక్షిణాఫ్రికాకు ప్రపంచ క్రికెట్ లో బ్యాడ్ లక్ కు మారుపేరు అనే సానుభూతి ఉంది. అయితే, నిరుడు టి20 ప్రపంచ కప్ ఫైనల్స్ చేరిన పురుషుల జట్టు ఆ పేరును కొంత చెరిపేసింది. ఈఏడాది టెస్టు చాంపియన్ షిప్ కూడా గెలిచింది. ఇప్పుడు మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు వచ్చింది. క్రమంగా తమ బ్యాడ్ లక్ ను దక్షిణాఫ్రికా అధిగమిస్తోంది.