సరికొత్త సంచలనాలు... అట్లుంటాది 'రోకో' తోనీ..!
అవును... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డే లో కింగ్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. బ్యాటింగ్ కి దిగినప్పటి నుంచీ ఫుల్ కాన్ఫిడెంట్ గా షాట్స్ ఆడిన కొహ్లీ... 102 బంతుల్లో సెంచరీ చేశాడు.;
దక్షిణాఫ్రికాతో మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు.. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ధ్వయం సంచలనాలు సృష్టించారు. ఆసక్తికర భాగస్వామ్యం నెలకొల్పి, ఈ గ్యాప్ లో కొత్త రికార్డులు సృష్టించారు. ఇందులో భాగంగా... కొహ్లీ సుమారు రెండేళ్ల తర్వాత వన్డేల్లో బ్యాట్ ఎత్తగా.. అత్యధిక సిక్స్ ల రికార్డును హిట్ మ్యాన్ నెలకొల్పాడు.
అవును... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డే లో కింగ్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. బ్యాటింగ్ కి దిగినప్పటి నుంచీ ఫుల్ కాన్ఫిడెంట్ గా షాట్స్ ఆడిన కొహ్లీ... 102 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది తన కెరీర్ లో 52వ సెంచరీ కాగా... సుమారు రెండేళ్ల తర్వాత చేసిన సెంచరీ ఇది. కాగా.. 2023 నవంబర్ 15న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చివరిసారిగా ఆసిస్ మీద 117 పరుగులు చేశాడు.
నాండ్రే బర్గర్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటైన అనంతరం.. మూడో ఓవర్లోనే పిచ్ లో అడుగుపెట్టాడు కొహ్లీ. వచ్చినప్పటి నుంచీ బ్యాట్ కు పని చెబుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగా.. అతడు ఎదుర్కొన్న మొదటి బంతిలోనే థర్డ్ మ్యాన్ దాటుకుని బౌండరీ కొట్టాడు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. బౌలర్ ఎవరనే పట్టింపూ లేదు!
మొత్తంగా ఈ మ్యాచ్ లో 120 బంతులు ఆడిన కొహ్లీ.. 11 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో 135 పరుగులు చేశాడు. ఈ క్రమంలో.. నాండ్రే బర్గర్ బౌలింగ్ లో ర్యాన్ రికెల్టన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వన్డేల్లో అత్యధిక సిక్స్ ల వీరుడు హిట్ మ్యాన్!:
మరోవైపు ఈ మ్యాచ్ లో 51 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మార్కో జున్సెన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అప్పటికే అద్భుతమైన ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఇందులో బాగంగా... వన్డేల్లో పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రీది పేరిట ఉన్న అత్యధిక సిక్స్ ల (351) రికార్డును చెరిపేసి, 352 సిక్స్ లతో అత్యధిక సిక్స్ ల వీరుడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో తొలుత కాస్త నెమ్మదిగానే మొదలుపెట్టిన రోహిత్ శర్మ... స్పిన్నర్ ప్రేనెలన్ సుబ్రాయెన్ బైలింగ్ లో 14 ఓవర్ లో మొదటి రెండు బంతుల్లోనూ వరుసగా సిక్స్ లు బాదాడు. దీంతో అఫ్రీదీ రికార్డును సమం చేశాడు. అనంతరం... మార్కో యాన్సన్ బౌలింగ్ లో 19.4 ఓవర్లో మరో అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో... హేమాహేమీలందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో చేరాడు!
సచిన్ - ద్రావిడ్ రికార్డ్ బ్రేక్!:
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ధ్వయం ఓ అరుదైన ఘనతను సాధించింది. ఇందులో భాగంగా... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ – మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశారు. వీరిద్దరూ 391 అంతర్జాతీయ మ్యాచ్ లు కలిసి ఆడగా.. తాజా మ్యాచ్ తో రోకో ధ్వయం దాన్ని అధిగమించింది.