వైభవ్ సూర్యవంశీపై నిషేధమేనా? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?
భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ సందర్భంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రవర్తన క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ సందర్భంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రవర్తన క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో చోటుచేసుకున్న ఒక వివాదాస్పద సంఘటన నేపథ్యంలో అతడిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందా? అసలు వైభవ్‌పై నిషేధం విధించే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలు, నిపుణుల విశ్లేషణల ప్రకారం ఏం జరుగుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.
నిషేధం విధించే అవకాశం ఉందా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, క్రికెట్ నిబంధనలను పరిశీలిస్తే వైభవ్ సూర్యవంశీపై వెంటనే సస్పెన్షన్ లేదా నిషేధం విధించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్‌లో జరిగిన ఘటనను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆటగాళ్లు, అంపైర్లు, మ్యాచ్ అధికారులు లేదా ఇతర సిబ్బందితో అనుచితంగా, శారీరకంగా తాకిన సందర్భాలను పరిశీలించేందుకు ఈ నిబంధనను ఉపయోగిస్తారు.
మ్యాచ్ అధికారులు ఏం పరిశీలిస్తారు?
మైదానంలో జరిగిన ఏవైనా వివాదాస్పద సంఘటనలను సమీక్షించే సమయంలో మ్యాచ్ అధికారులు ప్రధానంగా మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తారు. ఆ చర్య పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా కేవలం నిర్లక్ష్యంగా జరిగిందా? సదరు ఆటగాడు కాస్త జాగ్రత్త పడితే ఆ ఘటనను నివారించే అవకాశం ఉందా? ఈ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చర్యల తీవ్రతను అధికారులు నిర్ణయిస్తారు.
‘లెవల్-1’ నేరంగా పరిగణించే అవకాశం
సాధారణంగా ఆర్టికల్ 2.12 కింద నమోదయ్యే మొదటి తప్పులను ‘లెవల్-1’ ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఐసీసీ నిబంధనల ప్రకారం నేరుగా నిషేధం విధించడం చాలా అరుదు. సాధారణంగా ఈ కింది చర్యలు ఉంటాయి. ఆటగాడికి అధికారికంగా హెచ్చరిక జారీ చేయడం... మ్యాచ్ ఫీజులో కొంత శాతం కోత విధించడం.. ఆటగాడి ఖాతాలో డీమెరిట్ పాయింట్లు చేర్చడం చేస్తారు.
డీమెరిట్ పాయింట్ల రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు 24 నెలల (రెండు సంవత్సరాల) వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు సంపాదిస్తేనే సస్పెన్షన్‌కు గురవుతాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఖాతాలో ఎలాంటి పాత డీమెరిట్ పాయింట్లు ఉన్నట్లు సమాచారం లేదు. కాబట్టి కేవలం ఈ ఒక్క ఘటన ఆధారంగా అతడిపై నిషేధం పడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది.
తుది నిర్ణయం ఎవరిది?
ఈ వివాదంలో తుది నిర్ణయం మొత్తం మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ చేతుల్లోనే ఉంది. మైదానంలో ఉన్న వీడియో ఫుటేజీలు, ఫీల్డ్ అంపైర్ల నివేదికలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే ఆయన ఒక నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ ఆటగాడి తప్పు ఉందని భావిస్తే, నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి అధికారిక శిక్ష లేదా నిషేధం ఖరారు కాలేదు. మ్యాచ్ రిఫరీ తుది నివేదిక వెలువడితేనే ఈ వివాదానికి పూర్తి స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఈ యువ క్రికెటర్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడనట్లే!