టి20 ప్రపంచ కప్ ముందు టీమ్ఇండియాకు బిగ్ షాక్.. తెలుగోడు ఔట్!
స్వదేశంలో సరిగ్గా నెల రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న టీమ్ఇండియా బిగ్ షాక్ తగిలింది.;
స్వదేశంలో సరిగ్గా నెల రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న టీమ్ఇండియా బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్మాట్ లో కొంతకాలంగా నిలకడగా ఆడుతూ మ్యాచ్ విన్నర్ గా ఎదిగిన తెలుగు క్రికెటర్ పెద్ద గాయమే అయింది. దీంతో అతడు న్యూజిలాండ్ తో త్వరలో జరగనున్న టి20 సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ లోని కొన్ని మ్యాచ్ లకు అతడు దూరం కానున్నాడు. గాయం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే టి20ప్రపంచకప్ మొత్తానికీ అందుబాటులో లేకున్నా ఆశ్చర్యం లేదనే విశ్లేషనలు వస్తున్నాయి. అయితే, ఇప్పటికైతే ఆ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన యువ క్రికెటర్ కోలుకోవడానికి నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. అంటే, ఫిబ్రవరి 10వ తేదీ వరకు అందుబాటులోకి రానట్లే. ఆ తర్వాత ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే ప్రపంచ కప్ లో అవకాశం ఉంటుంది. దీనికి మరో వారం అయిన పట్టే చాన్స్ ఉంటుంది.
మిడిలార్డర్ లో దెబ్బనే..
మంచి ఫామ్ లో ఉన్న హైదరాబాదీ యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ గాయపడ్డాడు. టి20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తాడని భావిస్తుండగా, అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ లో తిలక్ ఫైనల్లో పాకిస్థాన్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 53 బంతుల్లో అజయేంగా 69 పరుగులు చేసి జట్టును చాంపియన్ గా నిలిపి జాతీయ హీరో అయ్యాడు. స్వదేశంలో జరిగేటి20 ప్రపంచ కప్ లోనూ తిలక్ దుమ్మురేపుతాడనే అంచనాలున్నాయి.
కివీస్ తో సిరీస్ కు దూరం..
ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు తిలక్ ప్రస్తుతానికి దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్ కోట్ లో హైదరాబాద్ జట్టు మ్యాచ్ లు ఆడుతోంది. ఈ టోర్నీలో తిలక్ హైదరాబాద్ కెప్టెన్ కూడా. అయితే, అతడి పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. తక్షణమే సర్జరీ అవసరం అని వైద్యులు సూచించడంతో సర్జరీ చేశారు. తిలక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
తిలక్ బదులు ఎవరు?
తిలక్ స్థానంలో కివీస్ తో టి20లకు, టి20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లకు ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. బహుశా జట్టుతో రెగ్యులర్ గా ప్రయాణం చేస్తున్న ఆటగాళ్లకే చాన్స్ దొరకవచ్చు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు తుది జట్టులో తిలక్ స్థానంలో చోటు దక్కొచ్చు. మరో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను తిలక్ స్థానంలో తీసుకోవచ్చని భావిస్తున్నారు.