అరుదైన వ్యాధి.. ఆసియా కప్ నకు గంట వెయిట్.. తిలక్ సంచలన విషయాలు
2022లో ముంబై ఇండియన్స్ కు ఆడడం ద్వారా తిలక్ వర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్థానం మొదలైంది.;
తిలక్ వర్మ.. మూడేళ్లుగా భారత క్రికెట్ లో మార్మోగుతున్న హైదరాబాదీ యువకుడి పేరు.. కానీ ఆసియా కప్ ఫైనల్ అనంతరం అతడు ఏంటో మొత్తం ప్రపంచానికే తెలిసింది..! ఇప్పుడు టీమ్ ఇండియాలో తిలక్ ఉన్నాడా? అని మొత్తం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి తిలక్ 20 ఏళ్ల వయసులోనే అరుదైన వ్యాధి బారినపడ్డాడట. ఆసియా కప్ ఫైనల్ అనంతరం కప్ కోసం గంటకు పైగా మైదానంలో నిరీక్షించారట..! ఈ విషయాలను అతడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తొలి ఐపీఎల్ సీజన్ లోనే...
2022లో ముంబై ఇండియన్స్ కు ఆడడం ద్వారా తిలక్ వర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్థానం మొదలైంది. అయితే, ఆ సీజన్ లోనే తిలక్ కు అరుదైన వ్యాధి ఉన్నట్లు బయటపడిందట. ఏమాత్రం చికిత్స ఆలస్యమైనా ప్రాణాలు పోయేంతటి తీవ్ర వ్యాధిగా దీనిని అతడు స్వయంగా చెప్పాడు. ఆ వ్యాధి పేరు రాబ్డోమయోలిసిస్. ఇది కండరాల వ్యాధి. చాలా అరుదుగా వస్తుంది.
తొలిసారి బయటకు...
రాబ్డోమయోలిసిస్ గురించి తిలక్ తొలిసారి నోరు విప్పాడు. 23 ఏళ్ల తిలక్ సూపర్ ఫిట్ నెస్ తో కనిపిస్తాడు. అయితే, దీనికోసం పడిన కష్టమే చివరకు రాబ్డోమయోలిసిస్ వ్యాధికి కారణమైందని అతడు చెప్పాడు. వర్క్ అవుట్స్ లో విపరీతంగా శ్రమించడంతో ఈ వ్యాధి బారినపడ్డడాట. దీనికి గురైనేవారి కండరాలు అధిక ఒత్తిడికి గురై విచ్ఛిన్నం అవుతాయట. శరీరంలోని నరాలు గట్టిపడతాయట.
-తిలక్ టి20 ప్లేయర్. వన్డేలు, టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. టెస్టు జట్టులో ఆడాలనేది తన కల. అందుకే ఫిట్ నెస్ కోసం పరితపించేవాడు. ఎప్పుడూ జిమ్ జిమ్ అంటుండేవాడినని.. విశ్రాంతి కూడా తీసుకునేవాడిని కాదని తెలిపాడు. దీంతో కండరాలపై ఒత్తిడి పెరిగి శరీరం పూర్తిగా అలసిపోయి 2022 ఐపీఎల్ సీజన్ తర్వాత అనారోగ్య సమస్యలు మొదలైనట్లు చెప్పాడు.
-బంగ్లాదేశ్ తో ఎ సిరీస్ ఆడుతుండగా తన చేతులు గట్టిపడ్డాయని.. వేళ్లు మొద్దుబారాయని.. దీంతో గ్లౌజ్ తీసేసినట్లు ఎడమచేతి వాటం బ్యాటర్ తెలిపాడు. కాగా, తనను ఇంతగా ఇబ్బంది పెట్టిన వ్యాధి విషయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ సత్వర స్పందనను తిలక్ గుర్తు చేశాడు. బీసీసీఐతో మాట్లాడి.. ఆకాశ్ తన చికిత్సకు సాయం చేశాడని తెలిపాడు. బీసీసీఐ అప్పటి కార్యదర్శి జై షాను సంప్రదించి ఆస్పత్రిలో చేర్చినట్లు వివరించాడు.
-కొన్ని గంటలు ఆలస్యమైనా ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారని.. సూదులు గుచ్చుతుండగా అవి విరిగేంతగా తన మజిల్స్ మారిపోయాయని తిలక్ చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ ప్లేయర్ కావాలనే లక్ష్యంతో చేసిన కసరత్తులు ఈ పరిస్థితికి తెచ్చాయన్నాడు. అందుకని.. జీవితంలో విశ్రాంతి కూడా అవసరమేనని తాను గుర్తించినట్లు పేర్కొన్నాడు.
ఆసియా కప్ కోసం మైదానం గంట ఉన్నాం..
దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ గెలిచాక సెప్టెంబరు 28న రాత్రి ట్రోఫీ కోసం మైదానంలో గంట పాటు నిరీక్షించామని కూడా తిలక్ చెప్పుకొచ్చాడు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా.. ఆసియా కప్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్, పాకిస్థాన్ జాతీయ మంత్రి కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి తీసుకునేందుకు టీమ్ ఇండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. కానీ, కప్ ను నఖ్వీ తన వెంట హోటల్ రూమ్ కు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ఆటగాళ్లు కప్ లేకుండానే ఉన్నట్లుగా సంబరాలు జరుపుకొన్నారు. ఈ ఐడియాను పేసర్ అర్షదీప్ సింగ్ ఇచ్చినట్లు తిలక్ తెలిపాడు.