ద‌శాబ్దాల త‌ర్వాత వ‌న్డే టీమ్ ఇండియాలో ఇద్ద‌రు అచ్చ తెలుగోళ్లు

ఎప్పుడో 30 ఏళ్ల కింద‌ట టీమ్ ఇండియా వ‌న్డే జ‌ట్టులో ఇలా ఇద్ద‌రు తెలుగోళ్లు ఉండేవారు.. త‌ర్వాతి కాలంలో ల‌క్ష్మ‌ణ్ కే వ‌న్డే జ‌ట్టులో చోటు క‌ష్ట‌మైంది.;

Update: 2025-11-23 23:30 GMT

ఎప్పుడో 30 ఏళ్ల కింద‌ట టీమ్ ఇండియా వ‌న్డే జ‌ట్టులో ఇలా ఇద్ద‌రు తెలుగోళ్లు ఉండేవారు.. త‌ర్వాతి కాలంలో ల‌క్ష్మ‌ణ్ కే వ‌న్డే జ‌ట్టులో చోటు క‌ష్ట‌మైంది. అంబ‌టి రాయుడు కూడా వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చినా ఎక్కువ మ్యాచ్ లు ఆడ‌లేదు. టి20ల్లో మాత్రం చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఆడాడు. ఇక ఇటీవ‌లి కాలంలో హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ వ‌న్డే జ‌ట్టులో కీల‌కంగా ఎదిగాడు. అయితే, బ్యాట్స్ మ‌న్ ప‌రంగా చూస్తే వ‌న్డేల‌కు ఎంపిక‌వుతున్న‌ తెలుగు క్రికెట‌ర్లు లేరు. ఇప్పుడు మాత్రం ఒకేసారి ఇద్దరు ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. ద‌క్షిణాఫ్రికాతో ఈ నెల 30 నుంచి జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్ కు ఆదివారం జ‌ట్టును ప్ర‌క‌టించారు. రెగ్యుల‌ర్ కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయాల‌తో దూరం కావ‌డంతో బ్యాట్స్ మ‌న్ కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్ప‌గించారు. వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ రిష‌భ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా ప్ర‌క‌టించారు. ఇదే జ‌ట్టులో తెలుగు కుర్రాళ్లు తిల‌క్ వ‌ర్మ‌, నితీశ్ కుమార్ రెడ్డిల‌కు చాన్స్ ద‌క్కింది. సిరాజ్ కు మాత్రం విశ్రాంతి ఇచ్చారు.

వారికి మ‌ళ్లీ పిలుపు.. ఓపెన‌ర్ గా జైశ్వాల్

దేశవాళీల్లో దుమ్మ‌రేపే ప్ర‌తిభావంతుడైన బ్యాట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ కు గిల్ స్థానంలో పిలుపుద‌క్కింది. కొన్నాళ్ల నుంచి వ‌న్డేల్లోకి తీసుకోని సీనియ‌ర్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఈ సిరీస్ కు ఎంపిక చేశారు. ఇటీవ‌ల బాగా రాణిస్తున్న అక్ష‌ర్ ప‌టేల్ ను ప‌క్క‌నపెట్టారు. మేటి పేస‌ర్ బుమ్రాతో పాటు, మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికీ రెస్ట్ ఇచ్చారు. మ‌రోసారి సంజూ శాంస‌న్ కు మొండిచేయి చూపారు. టెస్టుల్లో రాణిస్తున్న యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నాడు.

మిడిలార్డ‌ర్ లో తిల‌క్..

ఆసియాకప్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన తిల‌క్ వ‌ర్మ‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్ స్థానంలో మిడిలార్డ‌ర్ లో ఆడే చాన్సుంది. తిల‌క్ ఇప్ప‌టివ‌ర‌కు 4 వ‌న్డేలు ఆడాడు. ఈ ఫార్మాట్ లోనూ అత‌డు స‌త్తాచాటుకునే అవ‌కాశం వ‌చ్చింది. సీనియ‌ర్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో తెలుగు ఆల్ రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ వ‌చ్చింది. పేస్ బౌలింగ్ బాధ్య‌త‌ను ప్రసిద్ధ్‌, అర్ష‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రాణా మోయ‌నున్నారు. మొద‌టి వ‌న్డే రాంచీలో ఈ నెల 30న‌, రెండో వ‌న్డే డిసెంబ‌రు 3న రాయ్ పూర్ లో, మూడో వ‌న్డే డిసెంబ‌రు 6న విశాఖప‌ట్నంలో జ‌ర‌గ‌నుంది.

ద‌క్షిణాఫ్రికాతో సిరీస్ కు ఇదీ జ‌ట్టుః రాహుల్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), జైశ్వాల్, ధ్రువ్ జురెల్‌, రోహిత్, రుతురాజ్, కోహ్లి, తిల‌క్, నితీశ్‌, సుంద‌ర్, జ‌డేజా, కుల్దీప్, హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ధ్‌, అర్ష‌దీప్.

Tags:    

Similar News