టీమ్ ఇండియా గంభీర్ ఇష్టారాజ్యమా? ఇదేం దారుణం అగార్కర్?
అంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇష్టారాజ్యం నడుస్తోందని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయాలు సరైనవేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.;
ఈ నెల 19 నుంచి జరగనున్న మూడు వన్డేలు, ఐదు టి20ల ఆస్ట్రేలియా టూర్ కు టీమ్ ఇండియా ఎంపిక తీరు దుమారం రేపుతోంది. స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడం, స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని అసలు పరిగణించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇష్టారాజ్యం నడుస్తోందని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయాలు సరైనవేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
జడేజా ఎక్కడ..?
సరిగ్గా శనివారం ఆస్ట్రేలియా టూర్ కు వన్డే జట్టును ప్రకటించే సమయానికి వెస్టిండీస్ తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇటీవలి కాలంలో టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు అతడిని గత ఏడాది శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేయలేదు. ఇప్పుడు మళ్లీ పరిగణించలేదు. దీనికి అగార్కర్ చెప్పిన కారణంగా కూడా సరిగా లేదు.
-మేటి పేస్ బౌలర్ బుమ్రాను ఆసీస్ తో వన్డేలకు విశ్రాంతినిచ్చారు. కానీ, మొన్నటి ఆసియా కప్ లో ధారాళంగా పరుగులిచ్చిన హర్షిత్ రాణాను వన్డేలకు ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అతడు గంభీర్ మనిషి అని.. కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి హర్షిత్ పై నమ్మకం ఉంచుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
సంజూ ఎందుకు లేడు..?
ఆసీస్ తో టి20లకు ఎంపిక చేసిన జట్టుపై పెద్దగా విమర్శలు లేవు. కానీ, వన్డేలకు సంజూ శాంసన్ ను కాదని వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సంజూ తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ చేశాడు. అలాంటి ఆటగాడిని ఆస్ట్రేలియా తీసుకెళ్లరా? అని నిలదీస్తున్నారు. టి20ల్లోనూ సంజూతో ఇలానే ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ లోనూ సంజూను కాదని సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్న సంగతిని గుర్తుచేస్తున్నారు. నిరుటి టి20 ప్రపంచ కప్ లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను ఎంపిక చేశారని ప్రస్తావిస్తున్నారు.
-కెప్టెన్ శుబ్ మన్ గిల్, హర్షిత్ రాణాపై గౌతమ్ గంభీర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం పైనా ప్రశ్నలు వస్తున్నాయి. గిల్ కు బదులు రోహిత్ ను వన్డే కెప్టెన్ గా కొనసాగించాల్సి ఉండాల్సిందని, గొప్ప ఆటగాడిని ఇలా అవమానించడం తగదని అంటున్నారు. స్టార్ పేసర్ షమీ కెరీర్ ఇక ముగిసినట్లేనా? అని మరికొందరు స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జట్టు ఎంపిక ప్రక్రియను పూర్తిగా గంభీర్, అగార్కర్ కు వదిలేయకుండా బీసీసీఐ ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.