టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే... ప్రేమికుల రోజు తర్వాత శత్రువుల ఫైట్!

అయితే.. ఈ ప్రపంచ కప్ గెలవడం చాలా పెద్ద పని అని తెలిపారు. కాగా.. టీ20 క్రికెట్ కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-11-25 18:18 GMT

వచ్చే ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో భాగంగా... 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ప్రధానంగా... ఒకే గ్రూపులో ఉన్న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.

అవును... 2026లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో.. ఈ సారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. అయితే మొదటిసారి టోర్నీకి ఇటలీ అర్హత సాధించింది. ఈ క్రమంలో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గురూపు నుంచి రెండేసి జట్ల చొప్పున సూపర్ - 8 కు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్ - 8 లోని నాలుగు టీములను రెండు గ్రూపులుగా విభజిస్తారు.

ఫైనల్ మ్యాచ్ పై 'స్కై' అంచనా ఇదే!:

ఈ షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్... వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడటం సవాలుతో కూడుకున్నదని.. జట్టును నడిపించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరగనుందని అంచనా వేశాడు.

బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ:

ఈ క్రమంలో భారత్ కు 2024 వరల్డ్ కప్ సాధించిపెట్టిన రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ - 2026 బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా స్పందించిన హిట్ మ్యాన్... అంబాసిడర్ గా ఉండటం చాలా గౌరవంగా ఉందని.. గత ఏడాది లాగానే మనం ఈ సారి మ్యాజిక్ సృష్టిస్తామని ఆశిస్తున్నానని అన్నారు. అయితే.. ఈ ప్రపంచ కప్ గెలవడం చాలా పెద్ద పని అని తెలిపారు. కాగా.. టీ20 క్రికెట్ కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్రూపులు, అందులోని టీమ్ ల వివరాలు!:

ఈ సారి ఎడిషన్ లో 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ ఎ: ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఎ, నెదర్లాండ్స్, నమీబియా

గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్

గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ

గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఎఇ

భారత్, శ్రీలంకల్లోని వేదికలు!:

టీ-20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మ్యాచ్ లు భారత్ లోని ఐదు వేదికల్లోనూ.. శ్రీలంకలోని మూడు వేదికల్లోనూ జరగనున్నాయి. ఇందులో భాగంగా... భారత్ లోని వేదికలు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, అహ్మదాబాద్ కాగా... శ్రీలంకలోని మూడు వేదికల్లో రెండు కొలంబోలోవి కాగా ఒకటి క్యాండీలోని పల్లెకెలె స్టేడియం.

భారత్ మ్యాచ్‌ ల తేదీ - ప్రత్యర్థి - వేదిక!:

ఫిబ్రవరి 7 - యూఎస్‌ఏ - ముంబయి

ఫిబ్రవరి 12 - నమీబియా - ఢిల్లీ

ఫిబ్రవరి 15 - పాకిస్థాన్‌ - కొలంబో

ఫిబ్రవరి 18 - నెదర్లాండ్స్‌ - అహ్మదాబాద్

Tags:    

Similar News