సిక్సర్ల సునామీ.. ప్రత్యర్థులకు వణుకు: ఐపీఎల్‌లో SRH నయా రికార్డు!
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద.. సిక్సర్ల విందు. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి.;
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద.. సిక్సర్ల విందు. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి. బంతి కనిపిస్తే బాదడమే పనిగా ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు.. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సృష్టించిన సిక్సర్ల సునామీ ఇప్పుడు టోర్నీలోనే హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుత సీజన్ గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఏకంగా 82 సిక్సర్లను గాల్లోకి లేపారు. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి పవర్ హిట్టర్లు క్రీజులోకి వస్తే చాలు.. బంతి స్టాండ్స్‌లో పడాల్సిందే అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. వారి దూకుడు చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు బంతిని ఎక్కడ వేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.
హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తలా 69 సిక్సర్లతో కొనసాగుతున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌తో పోలిస్తే ఈ జట్లు 13 సిక్సర్లు వెనుకబడి ఉండటం గమనార్హం. గతంలో పరుగుల యంత్రాలుగా పేరుగాంచిన జట్లను వెనక్కి నెట్టి మరీ హైదరాబాద్ ఈసారి తన పవర్ హిట్టింగ్ సత్తాను చాటుతోంది.
ఇక ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం గుజరాత్ టైటాన్స్ (GT) పరిస్థితి. ఒకప్పుడు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు, ఈ సీజన్‌లో సిక్సర్లు బాదడంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. కేవలం 34 సిక్సర్లతో గుజరాత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్ కొట్టిన సిక్సర్లలో సగం కూడా గుజరాత్ సాధించలేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఎస్‌ఆర్‌హెచ్ అనుసరిస్తున్న ఈ `అటాకింగ్ గేమ్ ప్లాన్` ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. భారీ స్కోర్లను అలవోకగా సాధిస్తూ.. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్న ఈ జట్టు రానున్న మ్యాచ్‌ల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు బాదుడు చూసి పండగ చేసుకుంటున్నారు.