ఇంగ్లండ్ లో సిరాజ్.. దుబాయ్ లో తిలక్.. హైదరాబాద్ కా షాన్...
టీమ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల వారి ప్రాధాన్యం పెరుగుతోంది.. ఏదో జట్టులో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్లు కాకుండా మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారు.;
టీమ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల వారి ప్రాధాన్యం పెరుగుతోంది.. ఏదో జట్టులో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్లు కాకుండా మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారు. మొన్న ఇంగ్లండ్ లో టెస్టులను.. నేడు దుబయ్ లో ఆసియా కప్ ఫైనల్ ను.. హైదరాబాదీలైన పేసర్ మొహమ్మద్ సిరాజ్, డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మలే గెలిపించారు. మరోవైపు విశాఖపట్టణానికి చెందిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు.
నేనున్నానంటూ...
దిగ్గజాల్లాంటి సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్ కావడంతో ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్ కు ముందు టీమ్ ఇండియా ఒక్కసారిగా కుదుపునకు లోనైంది..! పెద్దగా అనుభవం లేని కుర్రాడు శుబ్ మన్ గిల్ కెప్టెన్... మేటి పేసర్ బుమ్రాకు గాయం బెడద... అటు చూస్తే ఇంగ్లండ్ తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్...! బ్యాటింగ్ లో బలహీనం.. బౌలింగ్ లో అనుభవ లేమి..! కానీ, చివరకు ఫలితం చూస్తే సిరీస్ ను 2-2తో టీమ్ ఇండియా సమం చేసింది. దీనికి కారణం సిరాజ్..! అలుపన్నదే లేకుండా ఐదుకు ఐదు టెస్టులు ఆడిన అతడు ఏకంగా 185.3 ఓవర్లు వేశాడు. చివరి టెస్టులో అయితే సింహంలా పోరాడాడు. ఐదో టెస్టు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 5/104తో దేశం గర్వపడేలా చేశాడు. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం సిరీస్ లో 23 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా లనిలిచాడు. బుమ్రా ఆడిన రెండు టెస్టుల్లో టీమ్ ఇండియా ఓడగా.. అతడు లేని మ్యాచ్ లలో సిరాజ్ ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని నడిపించాడు.
నేను గెలిపిస్తానంటూ...
ఆదివారం ఆసియా కప్ ఫైనల్.. ప్రత్యర్థి పాకిస్థాన్.. గ్రూప్, సూపర్ 4 దశలో అలవోకగా ఓడించినా.. ఫైనల్లో మాత్రం భారత్ ఛేజింగ్ లో మొదట తడబడింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెన్ అభిషేక్ శర్మ (5), వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ (12), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వెంటవెంటనే ఔట్ కావడంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ ఇండియా. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ నిలిచాడు హైదరాబాదీ యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ. 23 ఏళ్ల ఈ కుర్రాడు.. ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు. అనుకోకూడదు కానీ.. ఈ మ్యాచ్ లో తిలక్ ఆడకపోతే టీమ్ ఇండియా గెలుపు కష్టమే అయ్యేది. ఎందుకంటే.. చివరి వరకు పోరాడగల కీలక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేడు. రింకూ సింగ్ ను ఈ కప్ లో తొలిసారి ఆడిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ పెద్దగా రాణించడం లేదు. కానీ, తిలక్ భారమంతా మీద వేసుకుని పోరాడాడు. ఆసియా కప్ ను అందించాడు. సిరాజ్, తిలక్ ల ప్రదర్శన చూసినవారు హైదరాబాద్ కా షాన్ (హైదరాబాద్ వైభవం) అని పొగుడుతున్నారు.
-విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లోనూ బాగానే ఆడాడు. కానీ, గాయంతో చివరి టెస్టుకు అందుబాటులో లేడు. అయితే, నితీశ్ పై తాము చాలా అంచనాలు పెట్టుకున్నామని స్వయంగా భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడం విశేషం. ఇప్పటికే టెస్టుల్లో నిరూపించుకున్న నితీశ్ నిరుడు టి20ల్లో బంగ్లాదేశ్ పై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. భవిష్యత్ లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్నవాడిగా భావిస్తున్నారు. మొత్తానికి టీమ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్ల ప్రాధాన్యం బాగా కనిపిస్తోంది.