'ప్రశాంత సముద్రాలు నేర్పించవు'.. వైట్ వాష్ పై గిల్ రియాక్షన్ ఇదే!
అవును... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సొంతగడ్డపై టీమిండియా చారిత్రక ఓటమి చవిచూసిన వేళ.. భారత క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు.;
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సొంతగడ్డపై టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో సిరీస్ లో కోల్ కతా టెస్ట్ లో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా... రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇది టెస్టుల్లో భారత్ జట్టుకు అతిపెద్ద ఓటమి కాగా.. 2004లో ఆసిస్ చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి నిన్నటి వరకు పెద్దది!
దీంతో... 13 నెలల కాలంలో టీమిండియాకు స్వదేశంలో ఇది రెండో వైట్ వాష్ గా నిలిచింది. గత ఏడాది ఆ జట్టు కివీస్ చేతిలో 0-3తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ప్రధానంగా వారి ఆగ్రహాన్ని గౌతమ్ గంభీర్ పై చూపిస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అవును... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సొంతగడ్డపై టీమిండియా చారిత్రక ఓటమి చవిచూసిన వేళ.. భారత క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు. కోచ్ గంభీర్ కు వ్యతిరేకంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడాలు లేకుండా నినాదాలు చేస్తున్నారు. ఈ సమయంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్ మౌనం వీడాడు. ఈ ఘోర పరాజయంపై స్పందించాడు. ఈ టెస్టుకు గిల్ దూరమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన శుభ్ మన్ గిల్... "ప్రశాంతమైన సముద్రాలు మీకు ఎలా నడిపించాలో నేర్పించవు.. అది స్థిరమైన చేతులను ఏర్పరిచే తుపాను. మనం ఒకరినొకరు నమ్ముకుంటూ, ఒకరి కోసం ఒకరు పోరాడుతూ, ముందుకు సాగుతూ బలంగా ఎదుగుతాము" అని రాశాడు. కోచ్ పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో గిల్ పోస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజున గిల్ మెడ నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా.. అతడు మిగిలిన మ్యాచ్ లో పాల్గొనలేదు. అయితే ఒక రోజు తర్వాత డిశ్చార్జ్ చేసినా.. ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోవడంతో రెండవ మ్యాచ్ నుంచి తొలగించారు.