అయ్య‌ర్ ఆరోగ్యం ఆల్ రైట్.. మ‌ళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడంటే?

టీమ్ ఇండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డింది. గ‌త శ‌నివారం ఆస్ట్రేలియాతో మూడో వ‌న్డేలో క్యాచ్ ప‌డుతూ అయ్య‌ర్ తీవ్ర గాయానికి గుర‌య్యాడు.;

Update: 2025-10-30 09:30 GMT

టీమ్ ఇండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డింది. గ‌త శ‌నివారం ఆస్ట్రేలియాతో మూడో వ‌న్డేలో క్యాచ్ ప‌డుతూ అయ్య‌ర్ తీవ్ర గాయానికి గుర‌య్యాడు. బంతిని ఒడిసిప‌ట్టినా.. మైదానంలో కిందప‌డడంతో ప్లీహానికి తీవ్ర గాయ‌మైంది. దీంతో హుటాహుటిన ఆస్ప‌త్రి ఐసీయూలో చేర్చారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్ర‌యాణ ఏర్పాట్ల‌తో అయ్య‌ర్ త‌ల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లారు. శ‌స్త్ర‌చికిత్స లేకుండానే ప్లీహం నుంచి బ్లీడింగ్ ఆగింద‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా తెలిపారు. అయితే, డిశ్చార్జి మాత్రం నాలుగైదు రోజుల త‌ర్వాతనే అని తెలుస్తోంది. రెండు రోజుల కింద‌టే అయ్య‌ర్ ఐసీయూ నుంచి జ‌న‌ర‌ల్ వార్డుకు మారాడు. తాజాగా త‌న ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చాడు.

రోజురోజుకు మెరుగు..

త‌న ఆరోగ్యం రోజురోజుకు మెరుగ‌వుతుంద‌న్న‌ అయ్య‌ర్.. మీ అంద‌రి ఆశీస్సుల‌తో కోలుకుని మ‌ళ్లీ మైదానంలో అడుగుపెడ‌తాన‌ని పోస్ట్ చేశాడు. అభిమానుల మ‌ద్ద‌తును ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని కొనియాడాడు. త‌న గురించి ఆలోచ‌న చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. కాగా, ఆదివారం నాటి మ్యాచ్ లో అయ్య‌ర్ ప‌ట్టింది వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అలెక్స్ క్యారీ క్యాచ్. క్యారీ కుదురుకుంటే క‌నుక ప‌రిస్థితి వేరుగా ఉండేది. నాలుగో వికెట్ గా అత‌డు ఔట‌య్యేట‌ప్ప‌టికి ఆసీస్ 183 ప‌రుగుల వ‌ద్ద ఉంది. ఆ త‌ర్వాత 236 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీన్నిబ‌ట్టే శ్రేయ‌స్ ఎంత‌టి విలువైన క్యాచ్ తీసుకున్నాడో తెలుస్తోంది.

మ‌ళ్లీ మైదానంలోకి ఎప్పుడు..??

అయ్య‌ర్ టి20 జ‌ట్టులో స‌భ్యుడిగా లేడు. అయితే, ద‌క్షిణాఫ్రికాతో వ‌చ్చే నెల నుంచి జ‌రిగే టెస్టు సిరీస్ కు ఎంపిక‌య్యే చాన్స్ ఉంది. కానీ, ఇప్పుడు గాయంతో జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ద‌క్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ కూ దూర‌మే. ఎందుకంటే.. 4 నుంచి 8 వారాలు ఆట‌కు దూరం అవుతాడ‌ని తొలుత అంచ‌నాలు వ‌చ్చాయి. ఇప్పుడు 8 వారాలు (2 నెల‌లు) గ్రౌండ్ లోకి దిగ‌బోవ‌డం లేద‌ని తెలుస్తోంది. అంటే.. జ‌న‌వ‌రిలోనే శ్రేయ‌స్ మ‌ళ్లీ టీమ్ ఇండియా జెర్సీలో క‌నిపించే చాన్సుంది. కొత్త సంవ‌త్స‌రంలో న్యూజిలాండ్ తో మూడు వ‌న్డేల సిరీస్ ఉంది. ఫిట్ నెస్ సాధిస్తే, ఎంపికైతే టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఆడే చాన్సుంది.

Tags:    

Similar News