మొన్న తిల‌క్ వ‌ర్మ‌.. నేడు షెఫాలీ వ‌ర్మ‌.. లేడీ సెహ్వాగ్ ఈ కుర్ర‌ది

న‌వంబ‌రు 2 ఆదివారం: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో షెఫాలీ వ‌ర్మ దుమ్మురేపింది.. దేశానికి ప్ర‌పంచక‌ప్ అందించింది.;

Update: 2025-11-03 03:40 GMT

సెప్టెంబ‌రు 28 ఆదివారం.. పురుషుల ఆసియా క‌ప్ ఫైన‌ల్లో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.. పాకిస్థాన్ వంటి ప్ర‌త్య‌ర్థిపై ఒత్తిడిని చిత్తుచేసి మ‌రీ జ‌ట్టును గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

న‌వంబ‌రు 2 ఆదివారం: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో షెఫాలీ వ‌ర్మ దుమ్మురేపింది.. దేశానికి ప్ర‌పంచక‌ప్ అందించింది. ఓపెన‌ర్ గా బ‌రిలో దిగి 78 బంతుల్లోనే 87 ప‌రుగులు సాధించింది. బౌలింగ్ లోనూ 36 ప‌రుగుల‌కు రెండు వికెట్లు తీసింది. ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. అయితే, షెఫాలీ అనుకోకుండా వ‌చ్చి అద్భుతం చేసింది. దీనివెనుక చిన్న క‌థ ఉంది.

అమ్మాయి కాదు అద్భుతం..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సెంచ‌రీతో మెరిసిన ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ గాయం కార‌ణంగా టోర్నీ నుంచి ఔట్ అయింది.. ఆస్ట్రేలియాతో సెమీస్ కు ముందు పెద్ద క‌లవ‌రం.. కానీ, అంత‌కుముందు ప‌క్క‌న‌పెట్టిన జెమీమారోడ్రిగ్స్ అద్భుత అజేయ‌ సెంచ‌రీతో టీమ్ ఇండియాను గెలిపించింది. మ‌రి ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్ సంగ‌తి..? ఊపులో ఉన్న మంధాన కాస్త‌ త్వ‌ర‌గా ఔట్ అయితే ఏంటి ప‌రిస్థితి..? జెమీమా రాణించ‌క‌పోతే ఎలా..? ఆదివారం ఫైన‌ల్లో అదే జ‌రిగింది... కానీ, లేడీ సెహ్వాగ్ షెఫాలీ వ‌ర్మ మాత్రం ఆ లోటు క‌నిపించ‌కుండా చేసింది. ముందు బ్యాటింగ్.. త‌ర్వాత బౌలింగ్ లో స‌త్తాచాటింది.. ఫలితంగా టీమ్ ఇండియా మ‌హిళ‌లు ప్ర‌పంచ చాంపియ‌న్లు అయ్యారు.

ఇంత‌కూ ఈ షెఫాలీవ‌ర్మ ఎవ‌రు..?

హ‌రియాణాకు చెందిన షెఫాలీ 14-15 ఏళ్ల‌కే క్రికెట్ లో అద్భుతాలు సాధించింది. మ‌రీ ముఖ్యంగా ఆమె బంతిపై విరుచుకుప‌డే తీరు అమోఘం.. హ‌రియాణా వారికే ప్ర‌త్యేక‌మైన దూకుడుగా దీనిని చెబుతుంటారు. షెఫాలీని లేడీ సెహ్వాగ్ అంటూ టీమ్ ఇండియా మాజీ దిగ్గ‌జం వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చేవారు. దీనికిత‌గ్గ‌ట్లే 16 ఏళ్ల‌కే ఆమె టీమ్ ఇండియా త‌లుపుత‌ట్టింది. అయితే, ఈ దూకుడు ఆమెకు జాతీయ‌ జ‌ట్టులో చోటు క‌ల్పించినా త‌ర్వాత అదే క్ర‌మంలో త్వ‌ర‌గా ఔట్ కావ‌డంతో కెరీర్ లో కొంత వెనుక‌బ‌డింది. మంధానకు తోడు ప్ర‌తీకా ఓపెన‌ర్ గా కుదురుకోవ‌డంతో ఈ ప్ర‌పంచ క‌ప్ లో షెఫాలీకి అవ‌కాశం ద‌క్క‌లేదు. సెమీస్ కు ముందు ప్ర‌తీకా గాయంతో షెఫాలీని తీసుకోక త‌ప్ప‌లేదు. ఆ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ లో టీమ్ ఇండియాను గెలిపించింది అని చెప్పాలి.

బ్యాట్ తో అమోఘం.. బంతితో సంచ‌ల‌నం..

7 ఫోర్లు, 2 సిక్స్ ల‌తో ఫైన‌ల్లో షెఫాలీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అనే చెప్పాలి. సెంచ‌రీ సాధించే ఊపులో క‌నిపించిన ఆమె 87 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయింది. కానీ, అప్ప‌టికే టీమ్ ఇండియాకు మెరుగైన స్కోరుకు బాట‌లు వేసింది. ఇక ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికాను బంతితోనూ షెఫాలీ దెబ్బ‌కొట్టింది. ప్ర‌మాద‌క‌ర‌మైన‌ సునె ల‌జ్ (25), మ‌రిజెన్ కాప్ (4)ల‌ను వెంట‌వెంట‌నే ఔట్ చేసింది. 123 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోవ‌డంతో ద‌క్షిణాఫ్రికా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. బ్యాటింగ్ లో 87 ప‌రుగులు చేయ‌డ‌మే కాక‌.. 7 ఓవ‌ర్లు వేసి 36 ప‌రుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన షెఫాలీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది.

-2004 జ‌న‌వ‌రి 28న పుట్టిన షెఫాలీ.. 2019 సెప్టెంబ‌రు 24న టి20 మ్యాచ్ తో టీమ్ ఇండియా గ‌డ‌ప తొక్కింది. అప్ప‌టికి 16 ఏళ్లు కూడా నిండ‌లేదు అన్న‌మాట‌. 2021లో టెస్టు, వ‌న్డే జ‌ట్టులోకీ వ‌చ్చింది. మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో వైఫ‌ల్యాలు ఎదుర‌వ‌డంతో తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. తాజాగా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లోనూ సెమీస్ నుంచి ఆడింది.

Tags:    

Similar News