15,921 సరే.. 18,426 పరుగుల సచిన్ రికార్డును తిరగరాయలగరా?
కోహ్లి ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2025-26 సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడతాడు. ఆపై ఆసియా కప్, ప్రపంచ కప్ కలిపితే 30 మ్యాచ్ ల వరకు చాన్సుంది.;
15,921.. టెస్టుల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేసిన పరుగులు.. రికార్డు స్థాయిలో 200 మ్యాచ్ లు ఆడిన సచిన్ ఈ స్థాయిలో పరుగులు చేశాడు. 2013లో అతడు రిటైర్ అయ్యేనాటికి ఈ రికార్డును కనీసం ఎవరైనా అందుకోగలరా? అని భావించారు. కానీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జో రూట్ దూసుకొచ్చేస్తున్నాడు. కేవలం 158 టెస్టుల్లోనే 13,543 పరుగులు చేసిన రూట్.. సచిన్ కు కేవలం 2,500 పరుగుల దూరంలోనే ఉన్నాడు. వచ్చే డిసెంబరు 30తో 35 ఏళ్లు నిండే రూట్.. మరో రెండేళ్లయినా ఆడతాడు. సచిన్ టెస్టు పరుగులను దాదాపు అందుకోవడం కూడా ఖాయమే. మరి వన్డేల్లో...? ఈ స్థాయి సత్తా ఎవరికి ఉంది..?
సచిన్ ను దాటేయగలరా?
18,426... వన్డేల్లో సచిన్ చేసిన పరుగులు. చూస్తేనే వామ్మో అనే స్థాయిలో 463 మ్యాచ్ లలో సచిన్ ఈ రికార్డును నెలకొల్పాడు. దీనిని భవిష్యత్ లో ఎవరూ బీట్ చేయలేరని భావించారు. 2012లో పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం సచిన్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. విశేషం ఏమంటే.. ఈ మ్యాచ్ లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. భవిష్యత్ వన్డే స్టార్ తానే అని నిరూపించాడు.
సంగక్కర రెండోస్థానానికే సరి..
శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. ఇతడు సచిన్ రికార్డుకు పోటీ వస్తాడని ఏనాడూ భావించలేదు. అయితే, ఎన్ని పరుగులు చేయగలడా? అని చూశారు. 14,234 వద్ద ఆగిపోయాడు. కానీ, కోహ్లి మాత్రం వన్డేల్లో సచిన్ రికార్డును అందుకుంటాడని ఒక దశలో భావించారు. కానీ, గత నాలుగైదేళ్లుగా ఫామ్ తగ్గడంతో ఓ 1,500 పరుగులైనా తక్కువ చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మాత్రం సంగక్కరను దాటేశాడు. ప్రస్తుతం కోహ్లి 14,255 పరుగుల వద్ద ఉన్నాడు. అయితే, సచిన్ ను మాత్రం అందుకుంటాడని చెప్పలేం.
ఫిట్ నెస్ ఉన్నా ఫామ్..?
కోహ్లి ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2025-26 సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడతాడు. ఆపై ఆసియా కప్, ప్రపంచ కప్ కలిపితే 30 మ్యాచ్ ల వరకు చాన్సుంది. వీటిలో ఎంత రాణించినా 2 వేల పరుగులు చేస్తాడేమో. ఈ లెక్కన సచిన్ పరుగులకు ఇంకా రెండు వేలు వెనుకే అన్నమాట. అసలు కోహ్లిని వచ్చే ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగిస్తే కదా..? ఫిట్ నెస్ ఉన్నా.. అతడి ఫామ్ ఇందుకు కారణం కావొచ్చు.
భవిష్యత్ లో చాన్సుందా?
సచిన్ వన్డే పరుగుల రికార్డును బద్దలుకొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇప్పుడు అసలు వన్డేలే జరగడం లేదు. సచిన్ 16వ ఏట అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. ఐదారేళ్లు వన్డేల్లో మిడిలార్డర్ లో ఆడాడు. ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాక పరుగుల వరద పారించాడు. మొదటినుంచి ఓపెనర్ అయ్యుంటే.. 20 వేల పరుగులు చేసేవాడేమో? ఇక ఈ తరం క్రికెటర్లలో సచిన్ వన్డే పరుగుల రికార్డును అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. గతంలో ఏడాది 25-30 వన్డేలు జరిగేవి. ఇప్పడు అవి 5-10కి పడిపోయాయి. దీంతో మరే క్రికెటర్ కూ సచిన్ రికార్డును అందుకునే చాన్స్ లేనట్లే.