ట్రెండీ టాక్: సంపదల సృష్టిలో టాప్ -10 టీమిండియా క్రికెటర్లు
భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. అది కోట్లాది మంది హృదయాలలో ఒక బలమైన సెంటిమెంట్.
భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. అది కోట్లాది మంది హృదయాలలో ఒక బలమైన సెంటిమెంట్. మైదానంలో టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శనలిస్తూ.. దేశానికి చిరస్మరణీయ విజయాలు అందించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడాకారులుగా ఎదిగారు. సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్. ధోని, విరాట్ కోహ్లీ వంటి లెజెండ్స్ తమ అసాధారణ ఆటతీరుతో పిచ్‌పై రికార్డుల వేట సాగించడమే కాకుండా.. మైదానం వెలుపల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ కెరీర్ కాలపరిమితి..వేలాది పరుగులు.. గెలిపించిన కీలక మ్యాచ్‌ల ఆధారంగా వీరు సంపాదించిన ఆస్తుల వివరాలు షాకిస్తున్నాయి.
ఈ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన `గాడ్ ఆఫ్ క్రికెట్` సచిన్ టెండూల్కర్ దాదాపు 24 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు సేవలు అందించారు. ప్రపంచ రికార్డు స్థాయిలో 34,357 పరుగులు చేసిన సచిన్ ఆస్తి విలువ 1250 కోట్లుగా ఉంది. ఆయన తర్వాత స్థానాల్లో ఉన్న ఎం.ఎస్ ధోని ఆస్తి-1060 కోట్లు. 15 సంవత్సరాల కెరీర్‌లో 17,266 పరుగులు సాధించి మూడు ఐసీసీ ట్రోఫీలను అతడు తన టీమ్‌కి అందించాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆస్తి-1050 కోట్లు. 18 సంవత్సరాలుగా ఆడుతూ ఇప్పటికే 27,000కు పైగా పరుగులు పూర్తి చేసి భారత్ సాధించిన అత్యధిక ఛేజింగ్ విజయాలలో ఒంటిచేత్తో గెలుపును ఖరారు చేసిన దిగ్గజ క్రికెటర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. 2026 ఐపిఎల్ ఫైనల్‌లో జీటీపై ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ఛేజింగ్ ఎబిలిటీ మరోసారి చర్చకు వచ్చింది.
మిగతా టాప్ క్రికెటర్ల విషయానికి వస్తే.. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్తి-350 కోట్లు 14 ఏళ్ల కెరీర్‌లో 17,253 పరుగులు చేసి రెండు టెస్ట్ త్రిశతకాలతో భారత్‌కు పవర్‌ఫుల్ పునాది వేసిన మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు ప్రపంచ కప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఆస్తి-291 కోట్లు. 17 ఏళ్ల పాటు మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌గా 11,778 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచారు. అలాగే ఒత్తిడి వాతావరణంలో ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన గౌతమ్ గంభీర్ ఆస్తి-265 కోట్లు. అతడు 13 ఏళ్లలో 10,324 పరుగులు చేయగా.. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఆస్తి-215 కోట్లు. 13 ఏళ్లలో 7,987 పరుగులు సాధించి లోయర్ ఆర్డర్ ఫినిషర్‌గా నిలిచారు. పవర్ హిట్టర్ రోహిత్ శర్మ ఆస్తి- 214 కోట్లు. 19 ఏళ్లుగా ఆడుతూ 19,000కు పైగా పరుగులు చేయగా.. క్లాసిక్ వెటరన్ బ్యాటర్, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆస్తి-197 కోట్లు. ద్రావిడ్ 16 ఏళ్లలో 24,208 పరుగులు సాధించారు. చివరగా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆస్తి-160 కోట్లు. ఆయన 16 ఏళ్ల కెరీర్‌లో 13,214 పరుగులు చేసి విదేశాల్లో టెస్టులు గెలవడం నేర్పిన తొలి తరం లెజెండ్‌గా నిలిచారు.
ఈ స్టార్ క్రికెటర్లందరూ తమ కష్టార్జితంతో ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు దేశ విదేశాలలోనూ విలువైన స్థిరాస్తులను, లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్‌కు ముంబైలోని పోష్ బాంద్రా ప్రాంతంలో మల్టీస్టోరీడ్ లగ్జరీ బంగ్లాతో పాటు లండన్‌లో కూడా ఒక విలాసవంతమైన ప్రాపర్టీ ఉంది. విరాట్ కోహ్లీకి ముంబైలోని వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం ఎదుట అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో పాటు గురుగావ్‌లో ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. ఇక రోహిత్ శర్మ సైతం ముంబైలోని అహూజా టవర్స్‌లో రూ. 30 కోట్లకు పైగా విలువైన 4-బీహెచ్ కే అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు.
మరోవైపు మెట్రో నగరాలకు దూరంగా ప్రశాంతమైన ప్రదేశాలలో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడానికి కొందరు మొగ్గు చూపారు. ఎం.ఎస్. ధోనికి తన సొంత ఊరైన రాంచీలో దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన `కైలాసపతి` అనే అత్యంత విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడే అతడు తన బైక్స్ - లగ్జరీ కార్ల కలెక్షన్‌ను ఉంచారు. యువరాజ్ సింగ్‌కు చండీగఢ్‌లోని విలాసవంతమైన బంగ్లాతో పాటు గోవాలోని హిల్-టాప్‌పై ఒక అందమైన హాలిడే హోమ్ ఉంది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లకు ఢిల్లీలోని హౌజ్ ఖాస్, రాజేంద్ర నగర్ వంటి ఏరియాలలో కోట్లాది రూపాయల విలువైన కోటల్లాంటి ఇళ్లు ఉన్నాయి. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్‌లకు ముంబై, బెంగళూరులతో పాటు విదేశాలలో సైతం కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు- కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీళ్లంతా రియల్ ఎస్టేట్ సహా పలు స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తున్నారు. అదే సమయంలో లగ్జరీ కార్ల సేకరణలోను ఇతరుల కంటే టాప్ లో ఉన్నారు.